Guntur Kaaram: వివాదంలో మహేష్ బాబు సినిమా... అన్నిటికీ కారణం అదేనా...

ABN , First Publish Date - 2023-12-15T15:25:28+05:30 IST

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' మళ్ళీ వివాదంలో పడింది. ఆ చిత్ర నిర్మాత నాగ వంశి, మహేష్ బాబు అభిమానులని కోతులతో పోల్చడం, దానిమీద మళ్ళీ వివరణ ఇవ్వటం, రామజోగయ్య శాస్త్రిని, థమన్ ని ట్రోల్ చెయ్యడం... ఇలా వివాదాలతో నిండిపోయింది ఈ సినిమా

Guntur Kaaram: వివాదంలో మహేష్ బాబు సినిమా... అన్నిటికీ కారణం అదేనా...
Mahesh Babu from Guntur Kaaram

మహేష్ బాబు (Mahesh Babu) సినిమా 'గుంటూరు కారం' #GunturKaaram ఎప్పుడు మొదలెట్టారో కానీ, ఆ ముహూర్తం మంచిది కాదేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఆ సినిమా మొదలైన దగ్గర నుంచీ వివద్దాల్లోనే వుంది. మొదట అనుకున్న తేదీకి ఈ సినిమా షూటింగ్ మొదలవ్వకపోవటం, సినిమా ఉంటుందా, వుండదా అనేవరకు వార్తలు వచ్చాయి. తీరా ఒక పోరాట సన్నివేశంతో మొదలయ్యాక అది కొన్ని రోజులు చేసి, బాగోలేదని ఆపేశారని వార్త. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకుడు, సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మాత.

పూజ హెగ్డే (Pooja Hegde) కథానాయకురాలు అన్నారు, సినిమా చాలా ఆలస్యంగా మొదలవడంతో ఆమె తప్పుకుంది. తరువాత ఈ సినిమా ఛాయాగ్రాహకుడు ఈ సినిమా నుండి తప్పుకున్నారు. ఇలా మొదట్లోనే ఈ సినిమా వివాదాలతో మొదలైంది. ఆ తరువాత ఇందులో రెండో కథానాయికగా వున్న శ్రీలీలనే (Sreeleela) ప్రధమ కథానాయకురాలిగా చేశారు, మీనాక్షి చౌదరి (MeenakshiChaudhary) ని రెండో కథానాయకురాలిగా చేశారు. ఇదిలా ఉంటే మళ్ళీ ఈ సినిమా మధ్యలో షూటింగ్ కొన్ని కారణాల వలన ఆగిపోయింది.

gunturkaaramcompleted.jpg

ఇలా అన్నీ వివాదాలతోటే ఈ సినిమా నడుస్తూ వస్తోంది. మొత్తానికి రానున్న సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా జనవరి 12న విడుదలకి సిద్ధం అవుతోంది. ఈలోగా ప్రచార చిత్రాల్లో భాగంగా నిన్న ఒక పాటని విడుదల చేశారు. థమన్ సంగీత దర్శకుడు, రామజోగయ్య శాస్త్రి (RamajogayyaSastry) సాహిత్యం అందించారు. 'ఓ మై బేబీ' #OhMyBaby అనే ఈ పాట మహేష్ బాబు అభిమానులకి సరిగ్గా ఎక్కలేదు. చెప్పాలంటే ఈ పాట అంతగా లేదని కూడా వినిపిస్తోంది. దీని మీద మహేష్ అభిమానులు తమన్ ని, రామజోగయ్య శాస్త్రిని ట్రోల్ చేశారు, రామజోగయ్య గారు వొళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని అభిమానులకి వార్నింగ్ ఇచ్చారు. అతన్ని మళ్ళీ ట్రోల్ చేశారు, అతను తన ఎక్స్ (ట్విట్టర్) ఆకౌంట్ ని తీసేసారు.

పోనీ అక్కడితో అయిపోయిందా అంటే, ఆ సినిమా నిర్మాత నాగ వంశి అభిమానులను కోతులతో పోల్చాడు. ఒక సినిమా నిర్మాత అయిన నాగవంశీ ఒక సూపర్ స్టార్ అభిమానులని కోతులతో పోల్చడం ఏంటి అని మళ్ళీ అతన్ని ట్రోల్ చేశారు. మరి ఇంత బడ్జెట్ పెట్టి ఇంత పెద్ద సినిమా ఒక సూపర్ స్టార్ తో తీసినప్పుడు, పాటలు అభిమానులకి నచ్చేలా ఉన్నాయో లేదో చూసుకోవాలి కదా అని అడుగుతున్నారు సాంఘీక మాధ్యమంలో. (Naga Vamsi) నోరు జారడం, మళ్ళీ దానికి ఇంకో మాట అనడం సినిమా సెలబ్రిటీస్ కి అలవాటే కదా, నోరు జారినందుకు మళ్ళీ ఇంకో సమాధానం కూడా పెట్టారు నిర్మాత.

నేను చెప్పిన సమాధానానికి మీరు హర్ట్ అయి వుంటారు కదా, మరి మీరు ట్రోల్ చేస్తున్నప్పుడు మేము అంతే హర్ట్ అవుతాం కదా అన్నట్టుగా వచ్చే సమాధానం ఇచ్చి, జనవరి 12 వరకు ఓపిక పట్టండి అని చెప్పారు నిర్మాత తన ఎక్స్ (ట్విట్టర్) లో. మొత్తం మీద ఈ సినిమా మొదలైన దగ్గరనుంచీ వివాదాల్లో కూరుకుపోతింది. కొన్ని వివాదాలు వాటంతట అవి వస్తే, కొన్ని వాళ్ళు చేసుకున్నావే. సినిమా కథ, నిర్మాణం, విడుదల, ప్రచారాలు, ఎలా చెయ్యాలి అనే వాటిమీద దృష్టి పెట్టి ఉంటే బాగుండేది, ఇలా అభిమానులు ట్రోల్ చేస్తున్నారని వాళ్ళని కోతులతో పోల్చడం, మరింత వివాదాలకు తావిచ్చే మాటలు మాట్లాడటం వలన సినిమాకి నెగటివిటీ పెరుగుతుంది అని పరిశ్రమలో చర్చ నడుస్తోంది. ఏమైనా మహేష్ బాబు అభిమానులు నిరాశ పడిన మాట వాస్తవం, ఇప్పుడు వాళ్ళని మళ్ళీ ఇంకో మంచి పాట, లేదా సినిమా ట్రైలర్ తో ఈ వివాదం ఆపేస్తే మంచిది అని కూడా అంటున్నారు.

Updated Date - 2023-12-15T15:25:29+05:30 IST