టాలీవుడ్‌లో ఏం నడుస్తోంది..?

ABN , First Publish Date - 2023-09-02T00:02:34+05:30 IST

అని ఎవరైనా అడిగితే... నిన్నా మొన్నటి వరకూ ‘పార్ట్‌ 2 ట్రెండ్‌ నడుస్తోంది’ అని చెప్పుకొన్నాం. ఓ కథని రెండు భాగాలుగా విడగొట్టి సరికొత్త కమర్షియల్‌ సూత్రాన్ని కనిపెట్టారు దర్శకులు....

టాలీవుడ్‌లో ఏం నడుస్తోంది..?

సీక్వెల్‌ సీజన్‌ నడుస్తోంది!

అని ఎవరైనా అడిగితే... నిన్నా మొన్నటి వరకూ ‘పార్ట్‌ 2 ట్రెండ్‌ నడుస్తోంది’ అని చెప్పుకొన్నాం. ఓ కథని రెండు భాగాలుగా విడగొట్టి సరికొత్త కమర్షియల్‌ సూత్రాన్ని కనిపెట్టారు దర్శకులు. ఇది బాగా వర్కవుట్‌ అయ్యింది. ‘బాహుబలి’ కంటే ‘బాహుబలి 2’ ఎక్కువ వసూళ్లు తెచ్చుకొంది. ‘కేజీఎ్‌ఫ’తో పోలిస్తే... ‘కేజీఎఫ్‌ 2’ పెద్ద హిట్‌. ‘పుష్ప’ పెట్టుబడి, దాని మార్కెట్‌తో బేరీజు వేసుకొంటే ‘పుష్ప 2’ స్టామినా డబుల్‌ అయ్యింది. ‘సలార్‌’, ‘కల్కి’ కూడా రెండు భాగాలుగా వస్తున్నాయి. ఒకదాన్ని మించి మరోటి వినోదాన్ని పంచడానికి రెడీ అవుతున్నాయి.

‘బాహుబలి’ వచ్చాక ట్రెండ్‌ మారింది కానీ, ఇది వరకు కొనసాగింపు కథలే ఎక్కువగా కనిపించేవి. థ్రిల్లర్లు, హారర్‌లూ హిట్టయితే వెంటనే పార్ట్‌ 2కి సరంజామా సిద్ధమైపోయేది. ఎందుకైనా మంచిదని.. క్లైమాక్స్‌లో రెండో భాగానికి బీజం వేసిన సినిమాలెన్నో. అయితే అలా హిట్‌ సినిమాని నమ్ముకొని వచ్చిన కథలన్నీ బాక్సాఫీసు దగ్గర బోల్తా పడ్డాయి. కొన్నాళ్ల పాటు సీక్వెల్‌ కథలవైపు కన్నెత్తి చూడ్డానికి సైతం దర్శక నిర్మాతలు భయపడ్డారు. ఆ స్థానంలోనే ఓ కథని రెండుగా విడగొట్టి, విడుదల చేయడం మొదలెట్టారు. ఈ పద్ధతి ప్రస్తుతానికైతే లాభసాటిగానే కనిపిస్తోంది.

7.jpg

అయితే మెల్లగా సీక్వెల్‌ కథలు తమ ప్రభావాన్ని చూపించడం మొదలెట్టాయి. ‘ప్రతినిధి’కి కొనసాగింపుగా ఇప్పుడు ‘ప్రతినిధి 2’ రెడీ అవుతోంది. నారా రోహిత్‌ కథానాయకుడిగా రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రం ఇటీవలే కొబ్బరికాయ కొట్టుకొంది. హారర్‌ చిత్రాల్లో ‘గీతాంజలి’ ఓ లాండ్‌ మార్క్‌. భయానికి వినోదం జోడించిన విధానం ప్రేక్షకులకు నచ్చింది. అంజలి ఖాతాలో మరో హిట్టు పడేలా చేసింది. ఇప్పుడు ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ పేరుతో సీక్వెల్‌ తయారవుతోంది.

6.jpg

మంచు విష్ణు కెరీర్‌లో మర్చిపోలేని సినిమా ‘ఢీ’. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఇప్పటికీ నవ్విస్తూనే ఉంది. ఈ కథని కొనసాగించాలని విష్ణు ఎప్పటి నుంచో అనుకొంటున్నాడు. ఆమధ్య ‘డీ అండ్‌ డీ’ అంటూ ఓ టైటిల్‌ ప్రకటించారు. ‘డబుల్‌ డోస్‌’ అనేది ఉపశీర్షిక. విష్ణు ప్రస్తుతం ‘కన్నప్ప’ కథని పట్టాలెక్కించాడు. ఆ సినిమా పూర్తయ్యాకే ‘డీ’ సీక్వెల్‌ మొదలవుతుంది. సోషియో ఫాంటసీ జోనర్‌లో వచ్చిన ‘బింబిసార’ కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌కి ఊపిరి పోసింది. ఈ సినిమా కమర్షియల్‌ గా మంచి విజయాన్ని అందుకొంది. దీనికి సీక్వెల్‌ రాబోతోందని అప్పుడే చిత్రబృందం ప్రకటించింది. 2024లో ‘బింబిసార 2’ పట్టాలెక్కుతుంది. అయితే పార్ట్‌ 1కి దర్శకత్వం వహించిన వశిష్ట స్థానంలో కొత్త దర్శకుడు ఈ టీమ్‌లో చేరే అవకాశాలు ఉన్నాయి.

3.jpg

‘కార్తికేయ’ కంటే ‘కార్తికేయ 2’ పెద్ద హిట్‌. ఈ సినిమాతోనే నిఖిల్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు. ఇప్పుడు అదే స్ఫూర్తితో ‘కార్తికేయ 3’ మొదలు కానుంది. ఇటీవలే దర్శకుడు చందూ మొండేటి పార్ట్‌ 3 కథని సిద్ధం చేసి నిఖిల్‌కి కూడా వినిపించేశాడు. ‘‘చందూ కథ చెప్పాడు. చాలా బాగా నచ్చింది. ‘కార్తికేయ 2’ కంటే భారీ చిత్రమిది. అతి త్వరలోనే ఈ సినిమా గురించి కొత్త విషయాలు మీతో పంచుకొంటాం’’ అని నిఖిల్‌ ఊరిస్తున్నాడు.

Cj-1-1.jpg

ఇక అందరి దృష్టీ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సీక్వెల్‌పైనే ఉంది. రాజమౌళి, రామ్‌ చరణ్‌, రామారావు కాంబోలో రూపొందిన ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ కనీవినీ ఎరుగని విజయాన్ని సాధించింది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ కలిస్తే ఎలా ఉంటుందన్న ఊహతో ఈ చిత్రాన్ని రూపొందించారు. వారిద్దరూ కలిసి స్వాతంత్య్ర సమరం చేస్తే ఎలా ఉండేదన్న కల్పనతో పార్ట్‌ 2 కథని రచయిత విజయేంద్ర ప్రసాద్‌ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ని కొనసాగిస్తామని కూడా రాజమౌళి హింట్‌ ఇచ్చేశారు. బహుశా మహేశ్‌ బాబుతో సినిమా పూర్తయిన తరవాత ఈ సీక్వెల్‌ ఉండొచ్చు. ‘ఈగ 2’ కూడా తీయాలని రాజమౌళి ఆశ.. ఆలోచన. ‘ఈగ’ని ఓ ప్రయోగాత్మక చిత్రంగా మలిచారు. అప్పట్లో బడ్జెట్లు చాలా తక్కువ. కాబట్టి రాజమౌళి ఆ పరిమితుల్లోనే సినిమా తీశారు. ఇప్పుడు ఆ పరిమితుల్లేవు. ఈసారి ‘ఈగ’ని అంతర్జాతీయ స్థాయిలో తీయాలన్నది రాజమౌళి ఆలోచన. రాజమౌళి చిత్రాల్లో ‘విక్రమార్కుడు’నీ కొనసాగించే ఆలోచన ఉంది. అయితే ఈ కథకి రాజమౌళి స్థానంలో మరొకరు దర్శకత్వం వహించే ఛాన్సుంది.

Updated Date - 2023-09-02T00:02:34+05:30 IST