PSPK - Urvashi rautela: ‘ఖుషి’ చూసింది అందుకేనా?

ABN , First Publish Date - 2023-06-05T11:06:06+05:30 IST

పవన్‌ కల్యాణ్‌, ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వంలో జీ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. ఈ సినిమాలో ఓ పాటకోసం బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలను ఎంపిక చేశారని సమాచారం.

PSPK - Urvashi rautela: ‘ఖుషి’ చూసింది అందుకేనా?

పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan), ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ (Sai tej)తేజ్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’(Bro). సముద్రఖని దర్శకత్వంలో జీ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. ఈ వారంలో పవన్‌, తేజ్‌లపై ఓ పబ్‌ సాంగ్‌ను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రత్యేక గీతం కోసం తొలుత రకుల్‌ను సంప్రదించారని, ఆమె బాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉండడం, ప్రత్యేక గీతంలో నటించడం ఇష్టం లేకపోవడంతో సున్నితంగా తిరస్కరించిందని తెలుస్తోంది. ఇప్పుడీ పాట కోసం బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలను (Urvasi routela) ఎంపిక చేశారని సమాచారం. అయితే ఆదివారం ఊర్వశి పవన్‌కల్యాణ్‌ నటించిన ‘ఖుషి’ (Kushi) సినిమా చూసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. దీన్ని బట్టి ‘బ్రో’ ప్రత్యేక గీతానికి ఊర్వశి రౌతెల సై అన్నట్లే అనిపిస్తోంది. ఇప్పటికే ఆ పాటకు సంబంధించి పబ్‌ సెట్‌ను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ పాటకు గణేశ్‌, భాను మాస్టర్‌ నృత్యరీతుల్ని సమకూర్చుతున్నారట. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మూడో షెడ్యూల్‌ మొదలు..

పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘ఓజీ’. సుజీత్‌ దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే ముంబైలో, పుణె ప్రాంతాల్లో మొదటి షెడ్యూల్‌ను, హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం మూడో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో మొదలైంది. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు సోషల్‌ మీడియా వేదికగా తెలిపాయి. ప్రస్తుతం ప్రధాన తారాగణంపై పలు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో పవన్‌ సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారని సమాచారం. ఆయనకు జోడీగా ప్రియాంక మోహన్‌ నటిస్తోంది.

Updated Date - 2023-06-05T11:06:06+05:30 IST