Trivikram Srinivas: మా నాన్నగారు ఇప్పటికీ బాధపడుతూ ఉంటారేమో..!

ABN , First Publish Date - 2023-02-16T22:23:01+05:30 IST

నేను చదువుకునే సమయంలో ఇంజనీరింగ్ కోసం ఏడెనిమిది వేలు ఫీజు కట్టాలి. కానీ మా నాన్నగారు డిగ్రీ చదువుకోమని చెప్పడంతో..

Trivikram Srinivas: మా నాన్నగారు ఇప్పటికీ బాధపడుతూ ఉంటారేమో..!
Trivikram Srinivas

‘‘నేను చదువుకునే సమయంలో ఇంజనీరింగ్ కోసం ఏడెనిమిది వేలు ఫీజు కట్టాలి. కానీ మా నాన్నగారు డిగ్రీ చదువుకోమని చెప్పడంతో.. నేను పెద్దగా ఏమీ ఆలోచించకుండా, చింతించకుండా డిగ్రీలో చేరాను. నేను దాని గురించి పెద్దగా బాధపడలేదు.. కానీ ‘సార్’ సినిమా చూసిన తర్వాత.. మా నాన్నగారు మాత్రం ఇప్పటికీ మా వాడిని ఇంజనీరింగ్ చదివించలేకపోయానని బాధపడుతూ ఉంటారేమో’’ అని అన్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). ధనుష్ (Dhanush), సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోహీరోయిన్లుగా వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సార్’ (Sir). ఈ సినిమా ఫిబ్రవరి 17 గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న సందర్భంగా బుధవారం ప్రీ రిలీజ్ వేడుక (Sir Pre Release Event)ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన త్రివిక్రమ్.. ప్రస్తుతం ఎడ్యుకేషన్ పరిస్థితి ఎలా ఉందో చెప్పుకొచ్చారు.

ఆయన మాట్లాడుతూ.. ‘‘గోవిందుడు, గురువు ఎదురైతే మొదటి నమస్కారం నేను ఎవరికి పెట్టాలంటే.. గోవిందుడు వీడు అని చెప్పిన గురువుకే నా మొదటి నమస్కారం పెడతానని కబీర్ అన్నాడు. అలాంటి ఎంతోమంది గురువులకి నమస్కారం. అలాంటి గురువుల గురించి సినిమా తీసిన వెంకీని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ప్రతి కథకి ఒక ఆత్మ ఉంటుంది. ఈ కథ తాలూకు ఆత్మ ఏంటంటే.. విద్య, వైద్యం లాంటి మౌలిక సదుపాయాలు డబ్బుతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉండాలనేది ప్రపంచం మనకి నేర్పుతున్న పాఠం. కానీ వాటినే సామాన్య జనాలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. అసలు చదువు ఎందుకు మనిషికి ముఖ్యమంటే.. ఒక మనిషి జీవనశైలిని మార్చగలిగేది చదువు మాత్రమే. ఒక పేదవాడి కొడుకుని డబ్బున్న వాడిని చేయగలిగేది చదువు. ఒక గుమాస్తా కొడుకుని కలెక్టర్‌ని చేయగలిగేది చదువు. ఒక మాములు మనిషి కొడుకుని ఒక సుందర్ పిచై, ఒక సత్య నాదెళ్ళ లాంటి స్థాయికి.. ప్రపంచం మొత్తం చూసే స్థాయికి తీసుకెళ్లగలిగేది చదువు. అంత గొప్ప ఆయుధాన్ని కేవలం డబ్బు మీకు లేదని ఒక కారణం మూలంగా వాళ్ళకి దూరం చేయడం ఎంతవరకు రైట్?. ఈ ప్రశ్నే ఈ సినిమాలో వెంకీ అడిగే ప్రయత్నం చేశాడు. అందుకే ఈ సినిమాకు నాకు చాలా బాగా నచ్చింది. (Trivikram speech at Sir Pre Release Event)

దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి కుటుంబాలలో ఉండే వాళ్లకి ఉన్నత చదువులకు వెళ్ళాలంటే అడుగడుక్కి చదువు దూరమైపోతుంది. ఇప్పుడైతే ఎల్కేజీ ల నుంచే దూరమవ్వడం మొదలుపెట్టింది. అక్కడి నుంచే గీతలు గీసేస్తున్నాం.. మీకు డబ్బుంది, మీకు డబ్బు లేదు.. మీరు చదువుకోగలరు, మీరు చదువుకోలేరని. చదువుకోవడానికి బుర్ర కాదు, డబ్బు కావాలి అనుకునే స్థాయి మనం వచ్చేశామంటే.. మనం ఎంత దిగజారిపోతున్నామో మనకు తెలుస్తుంది. వీటిని సినిమాలో చాలా బలంగా ప్రశ్నించాడు వెంకీ. నేను చదువుకునే సమయంలో ఇంజనీరింగ్ కోసం ఏడెనిమిది వేలు ఫీజు కట్టాలి. కానీ మా నాన్నగారు డిగ్రీ చదువుకోమని చెప్పడంతో.. నేను పెద్దగా ఏమీ ఆలోచించకుండా, చింతించకుండా డిగ్రీలో చేరాను. కానీ ఈ సినిమాలో ఒక సీన్ చూస్తే.. పిల్లలు ఏదైనా ఒక వస్తువు అడిగినప్పుడు వాళ్ళకి కొనలేకపోతే వాళ్ళు కాసేపే బాధపడతారు. కానీ వాళ్ళ అమ్మానాన్నలు మాత్రం ఆ కొనలేని పరిస్థితి గురించి పోయేవరకు బాధపడతారు అని ఈ సినిమాలో ఒక మాట రాశాడు వెంకీ. నాకు ఇప్పుడు అనిపిస్తుంది.. నేను దాని గురించి పెద్దగా బాధపడలేదు.. కానీ మా నాన్నగారు మాత్రం ఇప్పటికీ మా వాడిని ఇంజనీరింగ్ చదివించలేకపోయానని బాధపడుతూ ఉంటారేమో. మౌలికమైన వసతులు అందరికీ సమానంగా అందాలి. నేను జల్సా సినిమాలో ఇదే రాశాను. వాళ్ళు ఆసుపత్రికి ఇంత దూరంగా ఉన్నారు, స్కూల్ కి ఇంత దూరంగా ఉన్నారు.. కానీ పేదరికానికి మాత్రం బాగా దగ్గరలో ఉన్నారు. ఇలాంటి సమాజాన్ని మనం ప్రోత్సహించకూడదు. మనకేం కాదు కదా మనం బాగున్నాం కదా అనుకుంటే.. బాగున్నా గ్రూప్ చిన్నదైపోయి, బాగోని గ్రూప్ పెద్దదైతే గనుక.. బాగున్నవాళ్ళు కూడా ఉండరు.. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.. ’’ అని చెప్పుకొచ్చారు. (Director Trivikram Srinivas)

Updated Date - 2023-02-16T22:23:03+05:30 IST