సంస్కారవంతమైన సినిమా ఇది
ABN , First Publish Date - 2023-02-22T00:37:14+05:30 IST
డాక్టర్ రాజేంద్రప్రసాద్, మీనా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ-హైబ్రీడ్ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ‘బిగ్‌బాస్’ సోహెల్, మృణాళిని హీరోహీరోయిన్గుగా నటించారు...
డాక్టర్ రాజేంద్రప్రసాద్, మీనా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ-హైబ్రీడ్ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ‘బిగ్‌బాస్’ సోహెల్, మృణాళిని హీరోహీరోయిన్గుగా నటించారు. కోనేరు కల్పన నిర్మించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘ ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు అందరినీ ఆలరించే చిత్రాలతో విజయవిహారం చేసిన దర్శకుడు కృష్ణారెడ్డిగారు, నేను, అచ్చిరెడ్డిగారు మళ్లీ ఇంతకాలానికి కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఒకప్పుడు ఇంటిల్లిపాదీ చూసే సంస్కారవంతమైన చిత్రాలు చేసిన మేము అటువంటి తరహా సినిమాతో మళ్లీ మీ ముందుకు వస్తున్నాం. చాలా కాలం తర్వాత మళ్లీ నేను, మీనా కలసి నటిస్తున్నాం.
హీరో సోహైల్ తన పాత్రకు చెందిన అన్ని రసాలను అద్భుతంగా ఆవిష్కరించాడు. ఈ సినిమాను థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయండి’ అని కోరారు. దర్శకుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘ వినోదం’ చిత్రం తర్వాత నేను చేసిన కంప్లీట్ కామెడీ ఫిల్మ్ ఇది. మీకు నచ్చే అన్ని అంశాలను పుష్కలంగా ఏరి కూర్చిన కథ ఇది. నిర్మాత కల్పన గారికి కథ బాగా నచ్చడంతో ప్రాజెక్ట్‌లో బాగా ఇన్‌వాల్వ్ అయ్యారు. థియేటర్‌లో ప్రేక్షకులు నవ్వే నవ్వులు చూసి ముచ్చటపడి పోవడానికి ఎదురు చూస్తున్నాను’ అన్నారు. ‘రాజేంద్రప్రసాద్ గారితో 30 ఏళ్ల తర్వాత నటిస్తున్నాను. అలాగే కృష్ణారెడ్డిగారి దర్శకత్వంలో తొలిసారిగా నటిస్తున్నాను. ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అన్నారు. ఈ సినిమాలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నాననీ, కృష్ణారెడ్డి వింటేజ్ ఎంటర్‌టైన్‌మెంట్ మళ్లీ ఇందులో చూస్తారని సోహైల్ చెప్పారు. సినిమా బాగా వచ్చిందనీ, మార్చిలో విడుదల చేయడానికి నిర్మాత కల్పన ఏర్పాట్లు చేస్తున్నారనీ చిత్ర సమర్పకుడు అచ్చిరెడ్డి చెప్పారు.