Shaakuntalam: కర్ణుడి చావుకి వంద తప్పులన్నట్టు, గుణశేఖర్ సినిమా చూడకపోవటానికి కూడా....

ABN , First Publish Date - 2023-04-15T14:51:56+05:30 IST

గుణశేఖర్, దిల్ రాజు నేతృత్వంలో వచ్చిన 'శాకుంతలం' సినిమా ప్రేక్షకులు చూడకపోవటానికి, ఈ సినిమా ఎందుకు అంత ఫెయిల్ అయింది అనటానికి కొన్ని కారణాలు సాంఘీక మాధ్యమాల్లో, పరిశ్రమల్లో అనుకుంటున్నవి

Shaakuntalam: కర్ణుడి చావుకి వంద తప్పులన్నట్టు, గుణశేఖర్ సినిమా చూడకపోవటానికి కూడా....

దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) ఎంతో గొప్పగా అభివర్ణించిన 'శాకుంతలం' (Shaakuntalam) అనే సినిమా నిన్న విడుదల అయింది. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ ఎందుకు గుణశేఖర్ ఇలా తీసాడు, ఇంతకంటే బాగా ఎందుకు తీయలేకపోయాడు అనే చర్చ జరుగుతోంది తప్ప, సినిమా ఎందుకు చూడాలి అనే విషయం మీద ఎవరూ మాట్లాడటం లేదు.

shakuntalam6.jpg

ఈ సినిమా పోవటానికి మొదటి కారణం దర్శకుడు గుణశేఖర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక తెలిసిన కథ నేరేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అందులో ఎటువంటి పాయింట్స్ వున్నాయి, ఎలా నేరేట్ చెయ్యాలి అనే విషయం మీద పూర్తిగా రీసెర్చ్ లాంటిది చెయ్యాలి. 'అభిజ్ఞాన శాకుంతలం' మహాకవి కాళిదాసు రచన. అటువంటి మహా కావ్యాన్ని పట్టుకొని తనకు తోచిన రీతిలో తీయటం మొదటి తప్పు. కాళిదాసు ఎంతో చక్కగా సంస్కృతం లో రాసాడు, ఇది గొప్ప శృంగారభరిత నాటకం గా ప్రసిద్ధి చెందింది. ప్రేమ గానీ, శృంగారం కానీ, సంఘర్షణ ఇవేవి ఈ గుణశేఖర్ 'శాకుంతలం' లో కానరావు.

ఇక రెండో కారణం, పాత పౌరాణిక సినిమాలు చూస్తే వాటిలో చాలా సన్నివేశాలు సినిమాకి పనికి వచ్చే విధంగా మార్పులు చేసుకున్నవే. అయితే ఎంత మార్పు చేసినా సహజంగా వుండేటట్టు చిత్రీకరించారు, అందుకే అవి అలరించాయి. అప్పట్లో సాంకేతికత అంతలా లేకపోయినా ఆ సినిమాలు అలరించాయి అంటే, ఆ సినిమా రచన, కథ మీద పట్టు, దర్శకత్వ ప్రతిభ ఇవన్నీ ముఖ్యమైనవి. ఇప్పుడు గుణశేఖర్ తీసిన 'శాకుంతలం' (Shaakuntalam) సాంకేతికతని సరిగ్గా ఉపయోగించుకోలేక చాల పేలవంగా తీశారు. ఈమధ్య విడుదల అయిన చిన్న సినిమా తేజ సజ్జ (Teja Sajja) నటించిన, ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వం వహించిన 'హనుమాన్' (Hanu-man) ట్రైలర్ చూడండి అందులో గ్రాఫిక్స్ ఎంత బాగున్నాయో. మరి వాళ్ళు అంత చక్కగా చూపించినప్పుడు గుణశేఖర్ ఎందుకు చూపించలేకపోయాడు.

sam-shakuntalam2.jpg

ఇందులో పాత్రలు తమ డైలాగ్స్ ని అప్పచెప్పినట్టుగా మాట్లాడేరు తప్పితే ఎక్కడా భావోద్వేగాలు కనపడలేదు. శకుంతల, దుష్యంతుడు మధ్య ఆ ప్రేమ సన్నివేశాలు కానీ, సంఘర్షణ కానీ సరిగ్గా చూపించలేకపోవటం ఇంకో కారణం. దేవ్ మోహన్ (Dev Mohan) దుష్యంతుడుగా బాగున్నాడు, కానీ అదొక్కటే సరిపోదు కదా. అతని మాట్లాడుతున్నప్పుడు ముఖ కవళికల్లో ఎటువంటి మార్పు లేకుండా, ఒక భావోద్వేగం లేకుండా ఉండటం వలన, సినిమాలో అతని సన్నివేశాలు అంత రక్తి కట్టలేదు.

సినిమా '3డి' లో చూపించటం కూడా ఈ సినిమా నచ్చకపోవటానికి ఇంకో కారణం. ఈ సినిమా ప్రీమియర్ లు చాలా వరకు '3డి' లో చూపించాడు. కానీ ఆ టెక్నాలజీ సరిగా తెలియకో, రాకో, మరి అందులో చూస్తే సినిమా ఏమి బాగోలేదు. ఒక్కోసారి అందరూ చాలా చిన్నగా, ఒక్కోసారి పెద్దగా, ఒక్కోసారి ఒక మనిషి తల నీడ కెమెరా ముందు కనపడుతూ ఇలా చాలా చికాకు అనిపించింది. ఇలా చూసినవాళ్ళకి సినిమా అస్సలు నచ్చకపోవటం ఇంకో కారణం. ఇలా '3డి' లో చూపిద్దాం అని గుణశేఖర్ తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద తప్పే అని చెప్తున్నారు.

shakuntalam3.jpg

అసలు దర్శకుడు గుణశేఖర్ ఒక మంచి యాక్షన్ సినేమానా, మాస్ సినేమానా, లేక ఇంకేమయిన సాంఘీక సినిమాలు చేసుకోక, ఇలా చారిత్రాత్మక, పౌరాణిక సినిమాలు అంటూ వీటి మీద పడ్డాడు ఎందుకో. ఇవి తీయాలంటే అంత సులువు కాదు, కాలము, డబ్బు రెండూ వృధా. ఆడకపోతే మళ్ళీ ప్రేక్షకులని, మీడియాని అందరినీ నిందించటం. అంతే కానీ, అసలు ఎక్కడ తప్పు ఉందొ తెలుసుకొని సరిదిద్దుకుంటే సరిపోయేది.

'రుద్రమదేవి' సినిమా అల్లు అర్జున్ (Allu Arjun) వున్నాడు కాబట్టే ఓపెనింగ్స్ వచ్చాయి. అతను లేకపోతే, ఆ సినిమా కూడా 'శాకుంతలం' (Shaakuntalam) లానే తయారయ్యేది అని అందరూ అంటున్నమాట. అలాగే దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్ హౌస్ తన ట్విట్టర్ ఖాతాలో పైరసీ సినిమా చూడొద్దు, థియేటర్ కి వెళ్లి చూడండి అని ఒక పోస్టర్ ట్వీట్ చేశారు. అసలు థియేటర్ లో ఫ్రీ గా వేసిన చూడం బాబూ అంటూ నెటిజన్స్ దీని మీద ఆడుకుంటున్నారు. మొదటి షో కె చాలా బాడ్ వచ్చేసింది. అన్నీ నాసిరకం, గ్రాఫిక్స్ బాగోలేవు, వి.ఎఫ్.ఎక్స్ బాగోలేవు, నిర్మాణ ప్రమాణాలు కూడా అంత బాగోలేవు, మరి ఇన్ని నెగటివ్ వున్న సినిమా ప్రేక్షకులని ఎలా థియేటర్ కి రప్పించ లేకపోతోంది. ఇంకా పైరసీ కూడా చూస్తారా?

Shaakuntalam Still.jpg

ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సినిమాలో నటీనటుల ఎంపిక సినిమాకి ఒక పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో నిజంగా నటించి చూపించగల సత్తా ఎవరికీ లేకపోయింది, ఒక్క మోహన్ బాబు కి తప్ప. ఇది ఒక పౌరాణిక సినిమా అని తెలిసినప్పుడు, ఇందులో నటీనటుల్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. మరి గుణశేఖర్ ఎందుకో ఆలా చెయ్యలేకపోయాడు. సమంత (Samantha) కూడా చాలా హోమ్ వర్క్ చేసి ఉండాల్సింది.

Dil-Raju.jpg

పాన్ ఇండియా అన్న పదం కూడా ఈమధ్య తెలుగు సినిమా వాళ్ళని చంపేస్తోంది. తెలుగు సినిమా ముందు తీస్తే, అది పాన్ ఇండియా లెవెల్లో ఆడుతుంది. అసలు తెలుగు సినిమానే సరిగ్గా తీయటం రావటం లేదు, కానీ సినిమా సబ్జెక్టు మాత్రం పాన్ ఇండియా అంటారు. 'కార్తికేయ 2' (Karthikeya 2) తెలుగు సినిమా ఇక్కడ ముందు హిట్ అయి తరువాత పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయింది. 'కాంతారా' (Kantara) కన్నడం లో హిట్ అయింది ముందు, తరువాత పాన్ ఇండియా అయింది. 'పుష్ప' (Pushpa) కూడా ముందు తెలుగు సినిమా, తరువాత పాన్ ఇండియా అయింది. ఈ పాన్ ఇండియా అని చెప్పి, ఇతర బాషా నటుల్ని తీసుకొచ్చి వూరికే కెమెరా ముందు నిలబెడితే ఎలా. వాళ్ళతో నటింప చెయ్యాలి కదా. సినిమాలు పోవడానికి కూడా ఈ పాన్ ఇండియా ఒక కారణం అని అంటున్నారు.

Updated Date - 2023-04-15T14:52:07+05:30 IST