వివాదం ముదిరింది!

ABN , First Publish Date - 2023-05-02T00:14:24+05:30 IST

కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతులు ఏమయ్యారు, ఎక్కడున్నారు? అని ఇతివృత్తంతో రూపుదిద్దుకొన్న ‘ద కేరళ స్టోరీ’ చిత్రం విడుదలపై..

వివాదం ముదిరింది!

కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతులు ఏమయ్యారు, ఎక్కడున్నారు? అని ఇతివృత్తంతో రూపుదిద్దుకొన్న ‘ద కేరళ స్టోరీ’ చిత్రం విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నెల 5న ఈ సినిమా విడుదల కావాలి. అయితే ఇటీవల వదిలిన ఈ చిత్రం ట్రైలర్‌ చూసి పలు వర్గాలు, రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. కేరళలో తప్పిపోయిన నలుగురు అమాయకపు యువతులు మతం మార్చుకుని, ఐసిస్‌ ఆధ్వర్యంలో ఉగ్రవాదులు మారినట్లు ఈ ట్రైలర్‌లో చూపించడం వివాదానికి కారణమైంది. ఈ సినిమా కేరళలో విడుదల చేయకుండా నిషేదించాలనే డిమాండ్‌ మొదలైంది. కనపించకుండా పోయిన 32 వేల మంది యువతులు మతం మార్చుకుని ఉగ్రవాదులుగా పని చేస్తున్నారని ట్రైలర్‌లో చూపించడంతో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళను ప్రపంచం ముందు అవమానించాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశారనీ, లవ్‌ జిహాదీ తమ రాష్ట్రంలో లేనే లేదని ఆయన స్పష్టం చేశారు.

32 వేల మంది కాదు కనీసం 32 మంది అయినా ఇలా మతం మార్చుకున్నారని ఆధారాలతో నిరూపిస్తే రూ. 11 లక్షలు ఇస్తానని కేరళ న్యాయవాది, నటుడు సి. షుక్కు ప్రకటించారు. ‘ఇది మా కేరళ కథ కాదు.. బహుశా మీ కేరళ స్టోరీ ఏమో’ అంటూ ఎద్దేవా చేశారు కాంగ్రెస్‌ ఎంపీ శశీధరూర్‌ ఈ వివాదంపై దర్శకుడు సుదీప్తో సేన్‌ స్పందిస్తూ ‘కేరళలో కొన్ని నెలలు ఉండి రీసెర్చి చేసిన తర్వాత , బాధిత కుటుంబాలతో మాట్లాడిన తర్వాత తీసిన సినిమా ఇది’ అని చెప్పారు. ‘కేరళ గురించి వ్యతిరేకంగా తీసిన సినిమా కాదిది. అలాగే ఉగ్రవాదులను టార్గెట్‌ చేస్తూ చిత్రం తీశామే తప్ప ముస్లీముల గురించి కాదు. ముఖ్యమంత్రిగారూ ఒకసారి మా సినిమా చూడండి. మీకు నచ్చని అంశాలు ఉంటే అప్పుడు చర్చిద్దాం’ అని నిర్మాత విపుల్‌ షా చెప్పారు. అదా శర్మ ‘ద కేరళ స్టోరీ’ లో హీరోయిన్‌గా నటించారు.

Updated Date - 2023-05-02T19:20:47+05:30 IST