Suryakantham100 Years : వెండితెర చూసిన మరో విశ్వరూపం!

ABN , First Publish Date - 2023-10-28T05:07:27+05:30 IST

పదాల్ని పచ్చడి చేసేస్తుంది... డైలాగుల్ని నమిలి అవతల పారేస్తుంది.. ఎంతటి పాత్రనైనా మొట్టికాయ వేసి మరీ లొంగ దీసుకొంటుంది..

Suryakantham100 Years : వెండితెర చూసిన మరో విశ్వరూపం!

పదాల్ని పచ్చడి చేసేస్తుంది... (Suryakantham)

డైలాగుల్ని నమిలి అవతల పారేస్తుంది..

ఎంతటి పాత్రనైనా మొట్టికాయ వేసి మరీ లొంగ దీసుకొంటుంది..

ఎదుట ఉన్నది ఎవ్వరైనా.. చెవి మెలేసి ఆధిపత్యం చెలాయిస్తుంది..

ఇన్ని చేసేదెవ్వరు...?? సూరేకాంతం కాకపోతే...??

‘సూరేకాంతం..’ ఈ పేరే బహు పవర్‌ ఫుల్‌. ఆమెకు తప్ప మరెవ్వరికీ సూటు కాదు. పెట్టుకొనే ధైర్యమూ లేదు.

సూరేకాంతం... ఈ పేరు వింటే కోడళ్లు ఝడుసుకొంటారు. అల్లుళ్లు పారిపోతారు. అత్తలు గర్వంగా తలెగరేస్తారు!(Suryakantham)

కొంగు బొడ్లో దోపి, జుట్టు ముడేసి, కుడి చేతిని నడుంపై వేసుకొని, ఎడమ చేత్తో విసుర్లు విసురుతోంటే.. ఎంతటివాడైనా గండైపోవాల్సిందే. దటీజ్‌ సూరేకాంతం. ఇన్ని మాటలెందుకూ.... టీవీని మ్యూట్‌లో పెట్టినా డైలాగ్‌ వినిపించిందంటే... అద్గదీ సూరేకాంతమంటే!! (100 Years of Suryakantham)

ఆమె ఎంట్రీ ఇస్తే చాలు. ‘సూరేకాంతమొచ్చిందిరోయ్‌’ అంటూ థియేటరే అటెన్షన్‌ అయిపోయేది. కుటుంబ కథా చిత్రంలో సూరేకాంతం ఓ హారర్‌ ఎలిమెంట్‌! ప్రేమకథల్లో తానో కుదుపు.

కానీ ఆ భయమూ భలే బాగుండేది. ‘హయ్యో...’ అంటూ సూరేకాంతం మూతి విరుపులూ, నిష్టూరాలూ, మాట మెరుపులూ, విసుర్లు, తిట్లు, శాపనార్థాలూ వింటుంటే, ఒక్కో డైలాగ్‌కీ ఆమె ముఖంలో మారే రంగులు గమనిస్తుంటే, సగటు ప్రేక్షకుడికి అంతకంటే వినోదం ఉంటుందా..??

ఆమె పక్కన నటించే మొగుడు అనబడే మగాడెవరైనా సరే సూరేకాంతం దెబ్బకు కుదేలైపోవాల్సిందే. ఎస్వీఆర్‌, రేలంగి, రమణారెడ్డి.. ఎవ్వరైనా కానివ్వండి. సూరేకాంతం ఆధిపత్యంతో వార్‌ వన్‌ సైడే.

కోడళ్లను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేది. హీరోల ముందు ఠీవీగా నిలబడేది. వాళ్లను మాటల్తో పడగొట్టేది. ‘సంసారం, రక్తసంబంధం, మాంగల్యబలం, గుండమ్మ కథ, కులగోత్రాలు...’ ఒకటా రెండా వందల సినిమాల్లో గయ్యాళి పాత్ర. ఎన్నిసార్లు చేస్తుంది, ఇంకెన్నిసార్లు చూడాలి...?? ఎన్నిసార్లు చూసినా చూడబుద్ధేసే నటన ఆమెది. గయ్యాళితనానికి ఓ ట్రేడ్‌ మార్క్‌. అత్త పాత్ర గుత్తకు తీసుకొని తన చెంగుకు కట్టేసుకొన్న బ్రాండ్‌ అంబాసిడర్‌.

రక్తసంబంధం చూసి జనాలు ఠారెత్తిపోయారు. సూరేకాంతం మీద మండిపడ్డారు. మరీ అంత గయ్యాళితనమా...?? అంటూ నివ్వెరబోయారు. సినిమా చూసిన ప్రేక్షకుడు నిజంగానే ఫీలైపోయి సూరేకాంతాన్ని థియేటర్లలోనే ఆడిపోసుకొనేవారంటే నమ్మండి! బయట ఆమె ఆటోగ్రాఫ్‌ అడగడానికి కూడా జనం భయపడేవారు. అమ్మాయిలైతే సూరేకాంతం ఉన్న దరిదాపుల్లోకే వెళ్లేవాళ్లు కాదు.

ఆమె హీరో కాదు. కానీ వాళ్లకు తలదన్నే ఇమేజ్‌ దక్కించుకొంది.

ఆమె హీరోయిన్‌ కాదు.. కానీ వాళ్లకు మించిన క్రేజ్‌ సంపాదించుకొంది.

ఆమె విలన్‌ కాదు.. కానీ సినిమా అంతటినీ తన వైపు నుంచి నడిపించింది.

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎస్వీఆర్‌... ఇలాంటి ఉద్దండులున్న సినిమాకి సూరేకాంతం పేరుతో టైటిల్‌ పెట్టడం ఏంటి?? ‘గుండమ్మ కథ’ కాకపోతే??!

ఓసారి చక్రపాణి నాగిరెడ్డిల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది.

మన సినిమాలో సూరేకాంతంకి భర్తగా ఎవర్ని పెడదాం అన్నదే టాపిక్కు!

సూరేకాంతం ఉండగా, మరో మొగుడెందుకు...?? వద్దులే అనుకొన్నార్ట చివరాఖరికి. అదీ సూరేకాంతం గయ్యాళితనం అంటే.

చరిత్ర ఎంతోమంది నటీనటుల్ని చూసుంటుంది. కానీ సూరేకాంతం వేరు. అలాంటి నటి మళ్లీ రారు!

ఘంటసాల లేని లోటు బాలు తీర్చుండొచ్చు! ఎస్వీఆర్‌ని కాస్తో కూస్తో కైకాల సత్యనారాయణ భర్తీ చేసుండొచ్చు!

అప్పుడు సావిత్రి.. ఆ తరవాత సౌందర్య అని చెప్పుకొనే ధైర్యం చేసుండొచ్చు...!

కానీ సూరేకాంతంకి అటు, ఇటూ.. ఆమెకు ప్రత్యామ్నాయంగా నిలిచిన నటీమణి లేరు. రారు. అందుకే వన్‌ అండ్‌ ఓన్లీ... సూరేకాంతం అయ్యారావిడ. ఆమెకు మరో రూపం ఇవ్వలేక, ఆమెలాంటి మరో నటీమణిని తయారు చేయలేక కాలం కూడా కొయ్యబారిపోయింది.

సూరేకాంతం తిట్టు కూడా అట్టులా ఉంటుంది.

ఆమె విరుపులు మెరుపుల్లా మారతాయి.

ఆమె నిష్టూరాలు మనకు చక్రపొంగళ్లు.

ఆమె కారాలు నూరితే... అవే కారపూస.

( సూర్యకాంతం శత జయంతి సంవత్సరం ప్రారంభం సందర్భంగా)

Updated Date - 2023-10-28T10:25:36+05:30 IST