SP Balasubramaniam: మళ్లీ రావాలి.. పాటకు ప్రాణం పోయాలి!

ABN , First Publish Date - 2023-06-04T13:41:28+05:30 IST

ఆయన గొంతు అన్ని స్వరాలనూ పలికిస్తుంది. ఒక్క అప స్వరాన్ని తప్ప - అన్న పేరును గడించారు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం. నేపథ్య గాయకుడిగా చలనచిత్ర పరిశ్రమలో 45 వసంతాలు పూర్తి చేసుకున్న ఆయనకు ఆ కీర్తి అయాచితంగా ఒక్కసారిగా వచ్చి వళ్లో వాలలేదు. గాన గంధర్వుడిగా ఇంత ఖ్యాతి రావడం వెనక నిరంతరం బాలు సలిపిన కృషి ఎంత్తైనా ఉంది. నేడు గానగంధ్వరుడి జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుందాం.

SP Balasubramaniam: మళ్లీ రావాలి.. పాటకు ప్రాణం పోయాలి!

ఆయన గొంతు అన్ని స్వరాలనూ పలికిస్తుంది(Spbalu). ఒక్క అప స్వరాన్ని తప్ప - అన్న పేరును గడించారు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం. నేపథ్య గాయకుడిగా చలనచిత్ర పరిశ్రమలో 45 వసంతాలు పూర్తి చేసుకున్న ఆయనకు ఆ కీర్తి అయాచితంగా ఒక్కసారిగా వచ్చి వళ్లో వాలలేదు. గాన గంధర్వుడిగా ఇంత ఖ్యాతి రావడం వెనక నిరంతరం బాలు (SP Balasubramaniam) సలిపిన కృషి ఎంత్తైనా ఉంది. శ్రీపతి పండితారాధ్యుల వంశంలో పుట్టిన బాల సుబ్రహ్మణ్యాన్ని తెలిసిన వారంతా ‘బాలు’ అని పిలుస్తుంటే, ఆప్తమిత్రులు మాత్రం ‘మణి’ అని పిలుస్తుంటారు. బాల గంధర్వలాంటి ఈ సంగీత మణికి చిన్నప్పటి నుంచి సంగీతమంటే ప్రీతి. ఐదు సంవత్సరాల వయసులోనే తండ్రి వేసిన ‘భక్త రామదాసు’ నాటకంలో రామదాసు కొడుకు వేషం వేసి, చక్కని పాటలు పాడి ఆనాడే ప్రేక్షకుల్ని మెప్పించారు. నాటినుంచీ నాటకాలలో వేషాలు వేస్తూ, స్టేజీ మీద పాటలు పాడుతూనే ఉన్నారు బాలు. అయితే ‘నేనేనాడూ ప్లేబ్యాక్‌ సింగర్‌ అవుతానని అనుకోలేదు. అసలా ఆలోచన కూడా నాకు అప్పట్లో కలగలేదు’’ అని అనేవారు బాలు. నెల్లూరులో కాలేజ్‌ చదువు ముగించుకుని, అనంతపురంలో ఇంజనీరింగ్‌లో చేరారు. అలవాటైన నెల్లూరు గాలి ఆయన్ను అక్కడ నిలవనీయలేదు. నెల్లూరులో మిత్రులతో పెన్నా నది ఒడ్డున వ్యవహారాలయిన నాటకాలు, పాటలు వీటిని వదిలి ఉండేలేక ఏడాది తిరగకుండానే అనంతపురం నుంచి తిరిగి వచ్చేశారు. అప్పుడు ఏం చేయాలా అని మదనపడిన తండ్రి బాలుని ఒప్పించి మద్రాసు పంపి ఎం.ఐ.యిలో చేర్పించారు. ఒక విధంగా మద్రాస్‌ జీవితమే బాలు జీవితాన్ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. మద్రాసులో మిత్రులతో కలిసి పాటలు పాడుతూ, పోటీలతో పాల్గొంటూ, తనకు తెలియకుండానే తన జీవిత సౌభాగ్యానికి పునాదులు వేసుకుంటూ వచ్చారు బాలు. నేడు గానగంధ్వరుడి జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుందాం. (Sp balu Birth Anniversary)

34.jpg

1966లో బాలుని హాస్యనటుడు, నిర్మాత పద్మనాభం దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు ‘శ్రీశ్రీశీ మర్యాదరామన్న’ చిత్రం తీస్తున్నారు. పద్మనాభం బాలు పాట విన్నారు. గొంతు ఆయనకి బాగా నచ్చింది. దాంతో మర్యాదరామన్న చిత్రంలో పాడే ఛాన్స్‌ ఇచ్చారు. ఆ సినిమాకు సంగీత దర్శకుడు కోదండపాణే. అందులో సుశీలతో కలిసి ‘ఏమి ఈ వింత మోహము’ అనే పాట పాడారు. ఆ పాట కోదండపాణితోపాటు అందరికీ నచ్చింది. ఆనాడే బాలు గొప్ప గాయకుడు అవుతాడని ఊహించారు. ఆ తర్వాత ప్రతి సంగీత దర్శకుడితో బాలు గురించి చెబుతుండేవారు పాణి. ఆ విధంగా బాల సుబ్రహ్మణ్యాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఆయన అభివృద్ధికి తోడ్పడ్డాడు కోదండపాణి, ఆ కృతజ్ఞతా భావంతోనే మద్రాసులో తను నిర్మించి స్టూడియోకు కోదండపాణి పేరే పెట్టారు బాలు.

సంగీత దర్శకుడిగా బాలు తొలి చిత్రం ‘కన్యాకుమారి’(1977). దానికి దాసరి దర్శకుడు. అయితే, అంతకు ముందు తెరపై తొలిసారి ‘తెలుగు తల్లి’కి స్వరకర్తగా పేరు పడింది. దానికి నేపథ్య సంగీతంతో పాటు ఓ పాట చేశారు. అది పేకేటి శివరామ్‌ దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీ.

పువ్వు పుట్టగానే పరిమళించిందన్నట్టు... పుట్టుకతో బాలూకి స్వరకళ అబ్బిందని చెప్పుకోవాలి. ఎక్కడా సంగీతం నేర్చుకోని ఆయన, చిన్నతనం నుంచి బాణీలు కట్టడం, పాటలు రాయడం ప్రారంభించారు. ఆలిండియా రేడియో పోటీల కోసం 1961-62లో తండ్రి సాంబమూర్తి రాసిన పాటలకు తొలిసారి బాణీలు కట్టారు. ‘పాడవే పల్లకీ...’, ‘పచ్చని వెచ్చని పచ్చిక సుడిలో...’ పాటలకు స్వరకల్పన చేశారు. బాలు గాత్రానికి, బాణికీ ‘పాడవే పల్లకీ...’ మంచి పేరు తీసుకొచ్చింది.

సినిమా రంగానికి వస్తే... ‘కన్యాకుమారి’ తర్వాత ‘కెప్టెన్‌ కృష్ణ’, ‘రారా క్రిష్ణయ్య’ చిత్రాలకు సంగీతం అందించారు. ఆ తర్వాత ‘తూర్పు వెళ్లే రైలు’ ఆయనకు సంగీత దర్శకుడిగా పేరు తీసుకొచ్చింది. సంగీత దర్శకుడిగా బాలూని బాపు-రమణలు ఎంతో ప్రోత్సహించారు. బాలు-బాపు కలయికలో ‘జాకీ’, ‘సీతమ్మ పెళ్లి’ తదితర చిత్రాలొచ్చాయి. అలాగే, బాలు-జంధ్యాల కలయికలో ‘పడమటి సంధ్యారాగం’, ‘వివాహ భోజనంబు’, ‘నీకూ నాకూ పెళ్లంట’ చిత్రాలు వచ్చాయి. ఆర్‌. నారాయణమూర్తి హీరోగా నటించిన ‘సంగీత’, గొల్లపూడి రాసిన నాటకం ఆధారంగా తీసిన ‘కళ్లు’ చిత్రాలకు ఆయనే సంగీత దర్శకుడు. ‘మయూరి’కి సంగీత దర్శకుడిగా నంది పురస్కారం అందుకున్నారు.

2.jpg

తమిళంలో రజనీకాంత్‌ ‘టుడిక్కం కరంగళ్‌’, బాలచందర్‌ నిర్మించిన ‘శిగరం’ సహా ఐదు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. సోమశేఖర స్వీయ దర్శక-నిర్మాణంలో రూపొందిన ‘బేబీ’ కోసం మద్రాసు ఆర్కెస్ట్రాను బెంగళూరు తీసుకువెళ్లి నేపథ్య సంగీతం చేశారు. మద్రాసు నుంచి బెంగళూరుకి కన్నడ చిత్ర పరిశ్రమ తరలివెళ్లిన తర్వాత ఆ ప్రయత్నం చేసిన తొలి సంగీత దర్శకుడు ఆయనే.

బాలూకి పాశ్చాత్య సంగీత పరిజ్ఞానం ఉన్నప్పటికీ ఆ తరహా బాణీలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించలేదు. శ్రోతలకు సాహిత్యం స్పష్టంగా వినిపించే, హాయిగా పాడుకునే పాటలు ఇవ్వాలనేది ఎస్పీబీ సిద్ధాంతం.

సంగీత దర్శకులు ఎమ్మెస్‌ విశ్వనాథన్‌, ఇళయరాజా స్వరపరిచిన పలు గీతాలను ఎస్పీబీ ఆలపించారు. అవి ఆయనకు ఎంతో పేరు తీసుకొచ్చాయి. అయితే, వాళ్లిద్దరి చేత ఓ పాట పాడించిన ఘనత మాత్రం ఎస్పీబీదే.

తనయుడు చరణ్‌ నిర్మించిన తమిళ చిత్రం ‘ఉన్నై శరణడైన్దేన్‌’ (2003)లో తాను స్వరపరిచిన ‘పానక్కు నిలమూడు’ పాటను దిగ్గజ సంగీత దర్శకులిద్దరి చేత ఆయన పాడించారు. తాను సంగీతం అందించిన చిత్రాల్లోని పాటలను పలువురి ప్రముఖుల చేత బాలు పాడించారు. ‘కొంగుముడి’లో ‘రాదా మళ్లీ వసంతకాలం...’ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు రమేశ్‌ నాయుని చేత, తమిళ చిత్రం ‘శిగరం’ టైటిల్‌ సాంగ్‌ను జె. ఏసుదాసు, అందులో మరో పాటను మంగళంపల్లి బాలమురళీ కృష్ణతో, ‘కళ్లు’ చిత్రంలో ‘తెల్లారింది లెగండోయ్‌...’ను ఆ పాట రాసిన సిరివెన్నెల చేత పాడించారు. అన్నిటికంటే ముఖ్యమైనది కన్నడ చిత్రం ‘మద్దినమావ’లో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌తో పాడించడం.

పాటే కాదు... ప్రత్యేకంగా నటించే కళ కూడా బాల్యంలో బాలూకి అవలీలగా వచ్చిందేమో! చిన్నతనంలో తండ్రితో కలిసి ఓ నాటకం వేశారాయన. తండ్రి రామదాసు పాత్ర అయితే... బాలూది రఘురాముడి పాత్ర. దాంట్లో ఆయన పద్యాలు పాడుతుంటే ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. తర్వాత వెండితెరపైనా తనదైన నటనతో మిగతా నటుల మధ్య ప్రత్యేకంగా నిలిచారు. ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. వెండితెరపై ఎస్పీబీ తొలిసారి కనిపించిన చిత్రం ‘మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌’ (1972). ఆ తర్వాత ఐదేళ్లకు దాసరి దర్శకత్వంలో ‘కన్యాకుమారి’లో కనిపించారు. నటుడిగా పాత్ర నిడివి గురించి ఆయనెప్పుడూ ఆలోచించలేదు. మనసుకు నచ్చితే, తన శరీరానికి నప్పుతుందనుకుంటే నటించారు. సుమారు 60 చిత్రాల్లో ఆయన కనిపించారు. బాలు నటించిన చిత్రాలన్నీ ఒకెత్తు. తనికెళ్ల భరణి దర్శకత్వంలో నటించిన ‘మిథునం’ మరో ఎత్తు. అందులో అప్పదాసుగా చిరస్థాయిగా నిలిచే నటన కనబరిచారు. ఆ చిత్రానికి నటుడిగా స్పెషల్‌ జ్యూరీ అవార్డు అందుకున్నారు. తాను ఫ్రొఫెషనల్‌ నటుణ్ణి కాదని చెప్పే ఆయన, తన భారీ పర్సనాలిటీపై ‘నేను 70ఎంఎం నటుణ్ణి’ అని జోకులు వేసేవారు. ఎస్పీబీ నటించిన చివరి చిత్రం నాగార్జున-నానిల ‘దేవదాస్‌’. అందులో మెడికల్‌ యూనివర్సిటీ డీన్‌గా కనిపించారు. (SPB)

Untitled-1.jpg

తొలిసారిగా ఉత్తమ నేపథ్యగాయకుడిగా 1979లో శంకరాభరణం చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్నారు బాలు. ఆ తర్వాత వరుసగా 1981, 1983, 1988, సంవత్సరాల్లో కూడా -ఉత్తమగాయకుడిగా నేషనల్‌ అవార్డ్‌ ఆయనకే వచ్చింది. భగవద్గీతలోని కొన్ని ఎంపిక చేసిన శ్లోకాలను అర్థసహితంగా ‘పుహలేంది’ సంగీత దర్శకత్వంలో ఆలపించి గాయకుడిగా మరో మెట్టు ఎదిగారు బాలు. 16 భాషల్లో దాదాపు 50 వేల పాటలు పాడి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు బాలు. సంగీత రంగంలో పెరుగుతున్న పోటీని దాటుకుని జనరేషన్‌లతో సంబంధం లేకుండా తుది శ్వాస విడిచే వరకూ కూడా పాడుతూనే ఉన్నారు బాలు. పాడుతా తీయగా, స్వరాభిషేకం వంటి షోలతో వందల మంది యువ గాయనీగాయకులను వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత ఆయనది. అలనాటి జానకమ్మ, సుశీల దగ్గర నుంచి ఈతరం దీపు, శ్రీకృష్ణ, గీతా మాధురి, రమ్య బెహరా, మోహన, హారికా వరకూ ఆయన స్టేజ్‌ షేర్‌ చేసుకున్నారు. (Sp Balu)

కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరిన బాలు చికిత్స పొందుతూ సెప్టెంబర్‌ 25, 2020లో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం గాన గంధర్వుడు స్వర్గలోకంలో బాణీలు కట్టే పనిలోనో, తన మధురమైన స్వరంతో దేవతా మూర్తుల ఎదుట చక్కని పాటలు ఆలపించడంలోనో నిమగ్నమై ఉంటారు. భౌతికంగా ఆయన మన మధ్య లేరేమో కానీ పాట రూపంలో ఎప్పటికీ బతికే ఉంటారు. నేడు ఆయన జయంతి సందర్భంగా పాటను, సంగీతాన్ని అభిమానించే ప్రతి ఒక్కరూ బాలుని గుర్తు చేసుకుంటున్నారు. ‘మీరు మళ్లీ రావాలి.. తెలుగు పాటకు ప్రాణం పోయాలి అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

Updated Date - 2023-06-04T13:41:28+05:30 IST