RIPSarathBabu : వెండితెర శరత్‌ చంద్రుడు

ABN , First Publish Date - 2023-05-23T05:08:22+05:30 IST

హీరోలతో సరిసమానమైన అందం శరత్‌బాబుది. మంచి నటనతో, చక్కని వాచకంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విలక్షణ నటుడు ఆయన. అంతేకాదు.. హ్యాండ్‌సమ్‌ పర్సనాలిటీతో హీరోలా కనిపిస్తూ క్యారెక్టర్‌ ఆర్టిస్టుల్లో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నారు..

RIPSarathBabu : వెండితెర శరత్‌ చంద్రుడు
Sarath Babu

శరత్‌ బాబు 1951-2023

హీరోలతో సరిసమానమైన అందం శరత్‌బాబుది. మంచి నటనతో, చక్కని

వాచకంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విలక్షణ నటుడు ఆయన. అంతేకాదు.. హ్యాండ్‌సమ్‌

పర్సనాలిటీతో హీరోలా కనిపిస్తూ క్యారెక్టర్‌ ఆర్టిస్టుల్లో తనకంటూ ఓ ప్రత్యేకత

చాటుకున్నారు. తెలుగు చిత్రపరిశ్రమలో హీరోగా ఆయన ప్రస్థానం ప్రారంభమైనా

విలన్‌గా, ఓ మంచి స్నేహితుడిగా, ఆదర్శవంతమైన భర్తగా.. తండ్రిగా ఇలా విభిన్న

పాత్రలు పోషించి ఆల్‌రౌండర్‌ అనిపించుకున్నారు. ‘సాగరసంగమం’ చిత్రంలో కమల్‌

హాసన్‌ స్నేహితుడిగా శరత్‌బాబు ప్రదర్శించిన నటనని ఎవరూ మరచిపోలేరు

నిజజీవితంలో కూడా స్నేహితులైన కమల్‌హాసన్‌, శరత్‌బాబు ఆ చిత్రంలోని పాత్రల్లో

జీవించారనే చెప్పాలి. ఆ ఒక్క సినిమాలోనే కాదు తనకు లభించిన ప్రతి పాత్రకూ

న్యాయం చేసి, ప్రశంసలు అందుకున్నారు. తెలుగులోనే కాదు తమిళంలో కూడా

ఆయనకు మంచి పాత్రలు లభించాయి. కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు

‘వేకింగ్‌ డ్రీమ్స్‌’ అనే ఆంగ్ల చిత్రంలో నటించారు శరత్‌బాబు

శరత్‌బాబు (SarathBabu) అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్‌. 1951 జూలై 31న ఆమదాల వలసలో పుట్టారు. తండ్రి విజయశంకర్‌ దీక్షిత్‌కు ఆముదాల వలసలో హోటల్‌ ఉండేది. తల్లి సుశీల దేవి. ఈ దంపతులకు మూడో కుమారుడు సత్యనారాయణ. శ్రీకాకుళం ఆర్ట్స్‌ కాలేజీలో బి.ఎస్‌.సి చదివారు. అలాగే హిందీ ‘విశారద’ కూడా పాసయ్యారు. #RIPSarathBabu చదువుకొనే రోజుల్లో ఆటల్లో, వక్తృత్వ పోటీలో చురుకుగా పాల్గొనేవారు. కాలేజీ వార్షికోత్సవాల్లో గొల్లపూడి రాసిన ‘రెండు రెళ్లు ఆరు’ నాటకంలో నటించి, ఉత్తమ నటుడిగా నిలవడమే కాకుండా పార్వతీపురంలో జరిగిన పరిషత్‌ నాటక పోటీల్లో బహుమతులు పొందారు. ఆముదాలవలసలోని ప్రగతి ఆర్ట్స్‌ పేరుతో నాటక సమాజాన్ని నెలకొల్పి నాటకాలు వేసేవారు.

పోలీస్‌ ఆఫీసర్‌ కావాలనుకుని..

ఏదో సరదాగా నాటకాలు వేస్తున్నారే కానీ సినిమాల్లో నటించాలనే కోరిక సత్యనారాయణకు మొదట్లో ఉండేది కాదు. పోలీస్‌ ఆఫీసర్‌ కావాలన్నది ఆయన కల. అయితే విజయశంకర్‌ దీక్షిత్‌కు తన కొడుకు పోలీస్‌ ఆఫీసర్‌ అవడం ఇష్టం లేదు. హోటల్‌ బిజినెస్‌లో తనకు సాయంగా ఉండమని చెప్పేవారు కానీ సత్యనారాయణ వినలేదు. ‘నేను పోలీస్‌నవుతాను’ అనేవారు. అయితే విధి లిఖితం మరోలా ఉంది. కాలేజీ రోజుల్లో కంటి చూపు దెబ్బతినడంతో పోలీస్‌ ఉద్యోగం పొందే అవకాశం పోయింది. సత్యనారాయణ చాలా హ్యాండ్‌సమ్‌గా ఉండడంతో ‘మీ అబ్బాయిని సినిమాల్లో చేర్పించకూడదా’ అని చుట్టుపక్కల వారు సత్యనారాయణ తల్లి సుశీలతో అంటుండేవారు. సత్యనారాయణకు కూడా మనసులో అదే కోరిక ఉండేది.

ఆ సమయంలోనే అంతా కొత్తవారితో ‘తేనె మనసులు’ చిత్రం తీసి సంచలనం సృష్టించారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. ఆయన కరుణిస్తే తనకు కూడా అవకాశం ఇస్తారేమోనని తన ఫొటోలు పంపించారు. అయితే తను ప్రస్తుతం తెలుగులో ఏ సినిమా తీయడం లేదనీ, కొంతకాలం ఆగమని చెప్పారు ఆదుర్తి. ఆ తర్వాత కొంతకాలానికి రామవిజేత సంస్థ అధినేత బాబూరావు ‘రామరాజ్యం’ సినిమా తీస్తూ నూతన నటుల కోసం ప్రకటన ఇచ్చారు. సత్యనారాయణ సోదరులు ఉమా బాబు, రమా రమణ తమ తమ్ముడి ఫొటోలు పంపించారు. మొత్తం మూడు వేల దరఖాస్తులు రాగా ఫిల్టర్‌ చేసి వారిలో ఐదుగురిని ఫైనల్‌ చేశారు. చివరికి వాళ్లందరిలో సత్యనారాయణ విజేతగా నిలిచారు. సత్యనారాయణ అనే పేరుని ‘శరత్‌బాబు’గా మార్చింది కూడా రామవిజేతా వారే. తొలి చిత్రంలోనే మహానటి సావిత్రి కాంబినేషన్‌లో నటించే అవకాశం శరత్‌బాబుకి లభించింది. ఆ సమయంలోనే ‘స్త్రీ’ చిత్ర నిర్మాతలు నిర్వహిస్తున్న స్ర్కీన్‌ టెస్ట్‌కు శరత్‌బాబు హాజరై అందులో కూడా అవకాశం సంపాదించారు. ఈ రెండు చిత్రాల్లో ఆయన సరసన చంద్రకళ హీరోయిన్‌గా నటించడం గమనార్హం.

రంగారావు ప్రశంస

శరత్‌బాబు తొలి సినిమా ‘రామరాజ్యం’ షూటింగ్‌ వాహినీ స్టూడియోలో మొదలైంది. తొలి రోజున సెట్లో ఉన్న ఎస్వీ రంగారావు దగ్గరకు నిర్మాత బాబూరావు తీసుకెళ్లి ‘ ఈ కుర్రాడిని మన సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నాం’ అని చెప్పారు. ఒక్క క్షణం అతని వంక ఎగాదిగా చూసి ‘వార్నీ .. యురోపియన్‌లా ఉన్నావే... తెలుగు వాడివేనా?’ అని అడిగారు రంగారావు. చిత్ర పరిశ్రమ నుంచి శరత్‌బాబుకు లభించిన తొలి ప్రశంస. అందులోనూ తను అభిమానించే ఎస్వీఆర్‌ అలా అనడంతో పొంగి పోయారు శరత్‌బాబు.

విలన్‌గానూ మెప్పించారు

హీరో పాత్రలతోనే కాదు విలన్‌గానూ మెప్పించారు శరత్‌బాబు. 1974లో వచ్చిన ‘నోము’ చిత్రంలో నెగిటివ్‌ రోల్‌ పోషించారు. ‘అభిమానవతి’, ‘సింహగర్జన’, ‘సీతాకోక చిలుక’, చిరంజీవి ‘అన్నయ్య’ వంటి చిత్రాల్లో ఆయన విలన్‌గా నటించారు. ఒకే సమయంలో వచ్చిన సినిమాల్లో ఒకదానితో ఒకటి సంబంధం లేని పాత్రలు పోషించారు. జనాన్ని మెప్పించారు. ఆయన అభిమాన నటుడు ఎస్వీ రంగారావులో కనిపించే ఈ అద్భుతమైన ఛేంజోవర్‌.. శరత్‌బాబులోనూ కనిపిస్తుంది.

బాలచందర్‌ ప్రోత్సాహం

తెలుగులో ఒకానొక ధశలో అవకాశాలు కరువై నప్పుడు దర్శకుడు బాలచందర్‌ (KBalachander) రూపంలో తమిళ చిత్ర పరిశ్రమ ఆయన్ని ఆదుకొంది. . ఒక ఫంక్షన్‌లో ఎదురైన శరత్‌బాబు పర్సనాలిటీ చూసి ముచ్చటపడ్డ బాలచందర్‌ ‘నీకు తమిళం తెలుసా?’ అని అడిగారు. చెన్నై చేరుకోగానే శరత్‌బాబు చేసిన మొదటి పని తమిళం నేర్చుకోవడం. అందుకే వెంటనే ‘తెలుసు సార్‌’ అనేశారు. దాంతో ఆయన ‘నిళిల్‌ నిజమా గిరదు’ చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో కమల్‌ హాసన్‌, అనంత్‌, శరత్‌బాబు హీరోలు. ఆ చిత్రం హిట్‌ కావడంతో తమిళంలో మరిన్ని అవకాశాలు వచ్చాయి. అలాగే తను తెలుగులో తీసిన ప్రతి చిత్రంలోనూ శరత్‌బాబుకి మంచి వేషం ఇచ్చేవారు. బాలచందర్‌. తన తొలి తమిళ చిత్రం నుంచే కమల్‌తో ’స్నేహం ఏర్పడింది శరత్‌బాబుకు. అలగే తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తోనూ ప్రత్యేక అనుబంధం ఉంది. వీరిద్దరు కలిసి నటించిన ‘ముల్లుం మలరుమ్‌’, ‘అన్నామలై’, ‘ముత్తు’ చిత్రాలు సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టాయి.. తమిళంలో శరత్‌బాబు నటించిన చివరి చిత్రం ‘వసంత ముల్లై’. శరత్‌ బాబుకు 2017లో ‘మలయన్‌’ అనే చిత్రానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అవార్డును ప్రదానం చేసింది. 1979లో మహేంద్రన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఉదిరిపూక్కల్‌’ చిత్రం ద్వారా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న శరత్‌ బాబు... తమిళంలో 120కి పైగా చిత్రాల్లో నటించారు. ఆ రోజుల్లో తెలుగులో కమల్‌ హాసన్‌కు ఎంత క్రేజ్‌ ఉండేదో, తమిళంలో అలా శరత్‌బాబు ఉండేది. శరత్‌బాబు నటన, నవ్వు, వాకింగ్‌ స్టయిల్‌, డైలాగులు చెప్పే విధానం తమిళ తంబీలకు తెగ నచ్చేశాయి. తెలుగు యాసలో ఆయన చెప్పే డైలాగుల్ని వారు ఇష్టపడే వారు.

జయ చివరి చిత్రంలోనూ..

1980లో దర్శకుడు పి.లెనిన్‌ తెరకెక్కించిన ‘నదియే తేడి వంద కడల్‌’ చిత్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితతో కలిసి శరత్‌ బాబు నటించారు. ఇది జయ నటించిన చివరి చిత్రం కావడం గమనార్హం.

నాలుగు తరాల నటులతో

ఐదు దశాబ్దాల తన నట జీవితంలో ఎన్టీఆర్‌ (NTR) ఏయన్నార్‌ (ANR), కృష్ణ (Krishna), శోభన్‌బాబు (SobhanBabu(, కృష్ణంరాజు, చిరంజీవి (Chiranjeevi), నాగార్జున (Nagarjuna), వెంకటేశ్‌ (Venkatesh) వంటి హీరోలతోనే కాకుండా నేటి యువతరం హీరోలతోనూ నటించారు శరత్‌బాబు. అక్కినేని అఖిల్‌ బాలనటుడిగా నటించిన సిసింద్రీలో తండ్రిగా శరత్‌ బాబు నటించారు. తమిళంలో శివాజీ గణేశన్‌ (SivajiGaneshan), రజనీకాంత్‌ (Rajinikanth), కమల్‌హాసన్‌లతో ఆయన నటించారు. ఆరు భాషల్లో హీరో, విలన్‌, సహాయ నటుడిగా 250 చిత్రాల్లో నటించారు శరత్‌బాబు. వచ్చిన పాత్రను కాదనకుండా చేసుకుపోయేవారు. ‘బాగా చేశాడు’ అనిపించుకోవడానికి కష్టపడేవారు. బాలచందర్‌, బాపు, విశ్వనాథ్‌, భారతీరాజా, వంశీ, జంధ్యాల వంటి దర్శకులు మెచ్చిన నటుడు శరత్‌బాబు. వారి చిత్రాల్లో తప్పకుండా ఉండేవారు. నాలుగు సార్లు నంది అవార్డ్‌ అందుకొన్నారు. తెలుగులో ఆయన నటించిన చివరి చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఇందులో ఆయన హీరో కృష్ణ పాత్రను పోషించడం విశేషం.

వారసుడు వచ్చాడు

శరత్‌బాబు సోదరుడి కుమారుడు ఆయుష్‌ రెండేళ్ల క్రితం ‘దక్ష’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ఆ రోజులు గుర్తుకొస్తున్నాయ్‌ - కమల్‌ హాసన్‌

‘ఉత్తమ నటుడు, మంచి స్నేహితుడైన శరత్‌బాబు భౌతికంగా దూరమయ్యారు. ఆయనతో కలిసి నటించిన రోజులు నాకు గుర్తుకొస్తున్నాయి. నా గురువు కె.బాలచందర్‌ (K Balachander) ద్వారా కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. కాలం చెరిపివేయలేని అనేక అద్భుతమైన కథా పాత్రల్లో నటించి ఆ పాత్రలకే వన్నె తెచ్చారు. ఒక మంచి నటుడిని చిత్ర పరిశ్రమ కోల్పోయింది’ అని విశ్వనటుడు కమల్‌ హాసన్‌ (KamalHaasan) విడుదల చేసిన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

రమాప్రభతో వివాహం.. విడాకులు

మంచి నటుడిగా, మనసున్న మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న శరత్‌బాబుకి పెళ్లి కలసి రాలేదనే చెప్లాలి. నటుడిగా నిలదొక్కుకుంటున్న తరుణంలో తనకంటే వయసులో నాలుగేళ్లు పెద్ద అయిన రమాప్రభను (Ramaprabha) 1974లో పెళ్లి చేసుకున్నారు శరత్‌బాబు. పద్నాలుగేళ్ల వైవాహిక జీవితం వారిది. మొదట్లో చాలా ఆన్యోన్యంగా ఉండేవారు. శరత్‌బాబు షూటింగ్‌ నిమిత్తం విజయవాడలో ఉంటే మద్రాసులో ఉన్న రమాప్రభ టిఫెన్‌ రెడీ చేసి, క్యారియర్‌తో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి విజయవాడ వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిద్దరూ 1988లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆసరా కోసం తను, అవసరం కోసం శరత్‌బాబు పెళ్లి చేసుకున్నామని రమాప్రభ ఎన్నో సార్లు విమర్శించినా ఆయన పట్టించుకొనేవారు కాదు. రమాప్రభ పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడేవారు కాదు. 1990లో మలయాళ నటుడు నంబియార్‌ కుమార్తె స్నేహలతను (Snehalatha) ద్వితీయ వివాహం చేసుకున్నారు స్నేహకూ ఇది ద్వితీయ వివాహమే. అప్పటికే పెళ్లయి భర్తను కోల్పోయారామె.

వీరి పెళ్లయిన ఇరవై ఏళ్ల తర్వాత శరత్‌బాబు తనని వేధిస్తున్నాడని స్నేహ ఆరోఫణలు చేస్తూ కోర్టుకు ఎక్కడంతో 2011లో వీరిద్దరి వైవాహిక బంధం ముగిసింది. ఇక అప్పటినుంచి శరత్‌బాబు ఒంటరిగానే ఉంటున్నారు. ఆయనకు పిల్లలు లేరు. కానీ ఎవరన్నా అడిగితే 26 మంది పిల్లలు ఉన్నారని చెప్పేవారు. ‘నా సోదరుల పిల్లలు, చెల్లెళ్ల పిల్లలు కూడా నా పిల్లలే కదా’ అనేవారు.

పెళ్లి అనేది ఓ సంఘటన

తన పెళ్లి గురించి, భార్యల గురించి అడిగితే శరత్‌బాబు చెప్పడానికి ఇష్టపడేవారు కాదు. ‘జీవితంలో చోటు చేసుకునే అనేక సంఘటనల్లో పెళ్లి కూడా ఒకటి. కొన్ని సంఘటనలు జీవిత కాలం గుర్తుండి పోతాయి. మరి కొన్ని కాలగర్భంలో కలసి పోతుంటాయి’ అని వేదాంత ధోరణిలో ఆయన చెప్పేవారు.

పూర్ణోదయాతో అనుబంధం

పూర్ణోదయా సంస్థతో శరత్‌బాబుకు గొప్ప అనుబంధం ఉంది. ఈ సంస్థ అధినేత ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన చిత్రాల్లో మంచి పాత్రలు పోషించారాయన. ‘సీతాకోక చిలుక’ చిత్రంలో కరడు కట్టిన విలన్‌ పాత్ర, ‘సితార’లో బతికి చెడిన రాజు పాత్ర, అలాగే ‘సాగర సంగమం’, ‘స్వాతి ముత్యం’, చిత్రాల్లో సాత్విక పాత్రలు.. చిరంజీవి ఆపద్బాంఽధవుడులో విభిన్న పాత్ర.. .. ఇవన్నీ ఒకదానితో మరొకటి సంబంధం లేనివే. శరత్‌బాబు తప్ప మరో నటుడు చేయలేడు అనిపించుకున్న వేషాలే:

శరత్‌బాబు... టాప్‌ 10

  • సాగర సంగమం

  • అభినందన

  • సీతాకోక చిలుక

  • సితార

  • సంసారం ఒక చదరంగం

  • గుప్పెడు మనసు

  • ముత్తు

  • ప్రాణస్నేహితులు

  • స్వాతి

Updated Date - 2023-05-23T12:31:47+05:30 IST