Oscar Winner RRR: తెలుగు సినిమా కల నెరవేరింది!

ABN , First Publish Date - 2023-03-13T09:29:29+05:30 IST

91 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో లిఖించుకోదగ్గ రోజు ఇది. భారతీయ సినీ చరిత్రలో మరపురాని ఘట్టం.

Oscar Winner RRR: తెలుగు సినిమా కల నెరవేరింది!

91 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో లిఖించుకోదగ్గ రోజు ఇది. భారతీయ సినీ చరిత్రలో మరపురాని ఘట్టం. ఇండియన్‌ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ‘ఆస్కార్‌’ (acadamy award for RRR) అవార్డును ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రం సాకారం చేసింది. ఆస్కార్‌ అడుగుదూరంలో కాదు.. అరచేతిలోనే ఉందని విశ్లేషకులు చెప్పిన మాట నిజమైంది. (India Shines At Oscars)

ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ప్రేక్షకును అలరించిన తెలుగు పాట ‘నాటు నాటు...’ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఉత్తమ పాటగా అకాడమీ అవార్డును సొంతం చేసుకుని అంతర్జాతీయ వేదికపై తెలుగువాడి సత్తాచాటింది. అకాడమీ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చరిత్ర సృష్టించింది. తెలుగు సినిమా కల నెరవేరింది. (Natu natu wins oscar)

లాస్‌ ఏంజిల్స్‌లో డాల్బీ థియేటర్‌ వేదికగా 95వ ఆస్కార్‌ వేడుకగా ఘనంగా జరిగింది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగీరిలో పోటీ పడిన ‘అప్ల్లాజ్‌’ (టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమెన్‌), ‘లిఫ్ట్‌ మి అప్‌’ (బ్లాక్‌ పాంథర్‌: వకాండా ఫెరవర్‌), దిస్‌ ఈజ్‌ ఎ లైఫ్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’, ‘హోల్డ్‌ మై హ్యాండ్‌’ (టాప్‌గన్‌ మావెరిక్‌) పాటలను పక్కకు నెట్టి ‘నాటు నాటు’ ఆస్కార్‌ దక్కించుకుంది. అవార్డును ప్రకటించగానే డాల్జీ థియేటర్‌ చప్పట్లతో మార్మోగిపోయింది. ఆస్కార్‌ అవార్డును అందుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఆనందోత్సాహల్లో మునిగిపోయింది. అంతకుముందు కాలభైౖరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ లైవ్‌ ప్రదర్శనతో డాల్బీ థియేటర్‌లో ఉన్న సినీతారలను, ఆహుతులను ఉర్రూతలూగించారు.

Untitled-1.jpg

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గతేడాది మార్చి 24న విడుదలైంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకొని రూ.1000కోట్లకు పైగా వసూళ్లను రాబ్టటింది. అంతే కాదు ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ వేదికగా గోల్డెన్‌ గ్లోబ్‌, హాలీవుడ్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ , క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డు ఇలా పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని వీక్షించిన హాలీవుడ్‌ దిగ్గజాలు జేమ్స్‌ కామెరూన్‌, స్పీల్‌ బర్గ్‌ ప్రశంసవర్షం కురిపించారు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్నారు. రాజమౌళితో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నామని చెప్పారు. భాసతో సంబంధం లేకుండా ‘నాటు నాటు’ పాట ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కించుకుంది. వివిధ విభాగాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌కు పోటీ పడగా బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ‘నాటు నాటు...’కు ఆస్కార్‌ నామినేషన్స్‌ తుది జాబితాలో చోటు దక్కించుకుంది. కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. కీరవాణి తనయుడు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ గానం చేశారు. ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట బయటకు వచ్చినప్పటి నుంచే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే! ఆ ఆదరణే ఆస్కార్‌ వరకూ తీసుకెళ్లింది. భారతీయ సినీ పరిశ్రమకు ఆస్కార్‌ అవార్డు వరించేలా చేసింది. అకాడమీ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చరిత్ర సృష్టించింది.

Updated Date - 2023-03-13T09:36:43+05:30 IST