RRR: బాఫ్టా రేసులో ‘ఆర్ఆర్ఆర్’

ABN , First Publish Date - 2023-01-07T15:57:05+05:30 IST

దర్శకధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పురస్కారాలను ఈ చిత్రం గెలుచుకుంది. తాజాగా ఈ మూవీ అరుదైన ఘనతను సాధించింది.

RRR: బాఫ్టా రేసులో ‘ఆర్ఆర్ఆర్’

దర్శకధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పురస్కారాలను ఈ చిత్రం గెలుచుకుంది. తాజాగా ఈ మూవీ అరుదైన ఘనతను సాధించింది. బాఫ్టా (బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్) రేసులో నిలిచింది. నాన్ ఇంగ్లిష్ కేటగిరిలో ఉత్తమ చిత్రంగా పోటీ పడనుంది. శౌనక్ సేన్ తెరకెక్కించిన ‘ఆల్ దట్ బ్రీత్‌స్’ కూడా ఉత్తమ డాక్యుమెంటరీ కేటగిరిలో బాఫ్టా రేసులో ఉంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం తమ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘‘బాఫ్టా ఫిలిం అవార్డ్స్‌ లాంగ్ లిస్ట్‌లో ‘ఆర్ఆర్ఆర్’ చోటు దక్కించుకుందనే విషయాన్ని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. ఈ ప్రయాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని సోషల్ మీడియాలో ‘ఆర్ఆర్ఆర్’ బృందం తెలిపింది. బాఫ్టా ఓటింగ్ మెంబర్స్ అందరు ఓటును వేసి నామినేషన్స్, విజేతలను త్వరలోనే నిర్ణయించనున్నారు. బాఫ్టా నామినేషన్స్‌ను జనవరి 19న ప్రకటిస్తారు. విజేతలకు పురస్కారాలను ఫిబ్రవరి 19న అందజేస్తారు.

కొన్ని రోజుల క్రితమే ఆర్ఆర్ఆర్ సినిమా గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్‌ను సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పురస్కారం కోసం బెస్ట్ ఫిలిం నాన్ ఇంగ్లిష్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిల్లో పోటీపడుతుంది. లాస్ ఏంజెలెస్‌లో జనవరి 11న ఈ పురస్కారాలను అందజేయనున్నారు. అస్కార్ అవార్డ్స్ రేసులోను ‘ఆర్ఆర్ఆర్’ నిలిచిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరి కింద నాటు నాటు పాట ఇప్పటికే అకాడమీ అవార్డ్ కోసం షార్ట్‌లిస్ట్ అయింది. ఆస్కార్స్ నామినేషన్స్‌ను జనవరి 24న ప్రకటిస్తారు.

ఆర్ఆర్ఆర్ సినిమా 1920ల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. స్వాతంత్ర్య సమరయోధులైన అల్లూరి సీత రామ రాజు, కొమరం భీమ్‌లను స్ఫూర్తిగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.1200కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, అలిసన్ డూడీ, ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2023-01-07T15:58:20+05:30 IST