Prakash Raj - National Awards : గర్వించాల్సిన సమయంలో ఇండస్ట్రీ ఎందుకు కలిసిరావడం లేదు.. అదే నా బాధ! 

ABN , First Publish Date - 2023-10-22T17:25:41+05:30 IST

తెలుగు చిత్ర పరిశ్రమలో అర్హత ఉన్న వారికి జాతీయ అవార్డులు దక్కడం అందరూ గర్వించదగ్గ విషయమని విలక్షణ నటుడు ప్రకాశ రాజ్‌ అన్నారు. ఇలాంటి సాధనలు చేసినప్పుడు మన సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఎందుకు కలిసి రావడం లేదు ఎందుకు? అంటీఅంటనట్టు ఎందుకు ఉంటున్నారు అని ఆయన ప్రశ్నించారు.

Prakash Raj - National Awards : గర్వించాల్సిన సమయంలో ఇండస్ట్రీ ఎందుకు కలిసిరావడం లేదు.. అదే నా బాధ! 

తెలుగు చిత్ర పరిశ్రమలో అర్హత ఉన్న వారికి జాతీయ అవార్డులు దక్కడం అందరూ గర్వించదగ్గ విషయమని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) అన్నారు. ఇలాంటి సాధనలు చేసినప్పుడు మన సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఎందుకు కలిసి రావడం లేదు ఎందుకు? అంటీఅంటనట్టు ఎందుకు ఉంటున్నారు అని ఆయన ప్రశ్నించారు. శనివారం రాత్రి మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ జాతీయ పురస్కారాలు (national Awards) అందుకున్న సినీ ప్రముఖులను పార్టీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నేషనల్‌ అవార్డు విలువేంటో నాకు తెలుసు. నాకు ఐదు వచ్చాయి. ఇప్పుడు తెలుగు పరిశ్రమలో అవార్డు అందుకున్న వారిని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. 25 ఏళ్ల క్రితం అంతఃపురం చిత్రానికి నాకు జాతీయ పురస్కారం దక్కింది. అయితే అప్పట్లో సంభ్రమించేవారు లేరు. కానీ ఇప్పుడు నాకెంతో గర్వంగా ఉంది. అలాగే ఓ బాధ కూడా ఉంది. ఇలాంటి సాధనలు చేసినప్పుడు మన సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఎందుకు కలిసి రావడం లేదు? అల్లు అర్జున ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డు అందుకోవడం అంటే తెలుగులో ఉన్న నటులందరి గౌరవమిది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని రాజమౌళి ఆస్కార్‌కి తీసుకెళ్లడం మన గౌరవం. దేవిశ్రీ ప్రసాద్‌ ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ చిత్రంగా ఉప్పెన అవార్డు అందుకోవడం అనేది మనందరకి గర్వం. ఇలాంటి సందర్భంలో మన వాళ్లు ఎందుకని సంభ్రమించడం లేదు. ఈ వేదికపై యంగర్‌ డైరెక్టర్‌ అంతా ఉండడం ముచ్చటగా ఉంది’’ అని అన్నారు.

ఇంకా మాట్లాడుతూ "ఖడ్గం చేస్తునప్పుడు దేవిశ్రీ ప్రసాద్‌ని ఒక యాక్టర్‌గా తీసుకుందామని పిలిపించిన కృష్ణ వంశీ మ్యూజిక్‌ చేస్తావా అని అడిగితే ఓకేనన్నాడు. ఆ సినిమా మ్యూజిక్‌ జర్నీ చూసి ఈ పిల్లోడు పైకొస్తాడు అనుకున్న సమయంలో వాళ్ల నాన్న సత్యమూర్తి వీడు పెద్ద స్థాయికి చేరుకుంటాడు అన్న ఆనందంతో ఎదురుచూశారు. ఇవాళ్ల దేవిశ్రీ ప్రసాద్‌ ఒక రాక్‌స్టార్‌. బన్ని తన మొదటి సినిమా చేస్తున్న సమయంలో 'ప్రకాష్ రాజ్ దగ్గరకు వెళ్లు’ అని అరవింద్‌ చెప్పగా వేర్వేరు సినిమా సెట్స్‌లోకి వచ్చి కెమెరా ట్రైపాడ్‌ కింద కూర్చుని నన్ను గమనించిన క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయి. ుగంగోత్రి సినిమా చేస్తున్న సమయంలో నటన పట్ల బన్నీకి ఉన్న ఆకలి, తపన చూసి మంచి స్టార్‌ అవుతాడు అని చెప్పా. ఇప్పుడు బన్నీ నటనలో తనని తాను నిరూపించుకుని ఐకాన్  మారాడు. ఈతరం అందరికీ తనొక బెస్ట్‌ ఎగ్జాంపుల్‌గా నిలిచాడు. బన్నీ నేషనల్‌ అవార్డు అందుకోవడం నా కూమారుడే అవార్డు అందుకున్నంత ఆనందంగా ఉంది. 25 ఏళ్ల క్రితం నేను నేషనల్‌ అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ వెళ్తే తెలుగు సినిమా నుంచి వచ్చారా? అనడిగారు. తెలుగు సినిమా చరిత్ర చూస్తే జాతీయ పురస్కారాలు చాలా తక్కువ ఉన్నాయి. నేషన్స్  బెస్ట్‌ యాక్టర్‌, డైరెక్టర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ తెలుగువాళ్లే అంటుంటే మనం ఎంత గర్వపడాలి. మనకొస్తేనే అవార్డు కాదు.. మనవాళ్లకు వచ్చింది కూడా మనదే అవుతుంది. ఇక్కడ యంగ్‌ డైరెక్టర్స్‌ అంతా ఉన్నారు. ఇలాంటి వేదికమీద పెద్దవాళ్లంతా ఎక్కడా? ఎందుకు మిస్‌ అవుతుంది. ఎందుకు కలిసి రావట్లేదు. మన ప్రతిభ, మన కంటెంట్‌ బౌండరీలు దాటేస్తుంటే.. మన ఇంట్లో మనమే గౌరవించుకోకపోతే ఎలా? నేను ఇక్కడికి వచ్చి బన్నీని హగ్‌ చేసుకోగానే 'ఈ జర్నీ ఇంకా ఎన్నో మైల్స్‌ వెళ్లాలి సర్‌’ అన్నాడు. అదీ అతనిలో ఉన్న స్పిరిట్‌. ఇది ఆరంభం మాత్రమే ముగింపు కాదు. ఒకప్పుడు లోకల్‌ సినిమాగా భావించిన తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. మేమంతా గర్వపడేలా చేసిన జాతీయ పురస్కార గ్రహీలకు థ్యాంక్స్‌. ఈ వేదికపై ఎంతోమంది పెద్దలు ఉంటే బాగుండేది. వారందరి తరఫున నేను క్షమాపణ చెబుతున్నా’’ అని అన్నారు.

Updated Date - 2023-10-22T17:25:41+05:30 IST