HBD Pawan kalyan : అవి పాత్రలు మాత్రమే కాదు.. ఆయనలో గుణాలు!

ABN , First Publish Date - 2023-09-02T10:42:35+05:30 IST

పవన్‌కల్యాణ్‌.. ఆ పేరు ఓ బ్రాండ్‌... అవుట్ ఆఫ్‌ ద సినిమా ఇండస్ట్రీ ఆయన క్రేజే వేరు... జయాపజయాలతో ఆయనకు పనిలేదు... పదేళ్లపాటు వరుస పరాజయాలు చూసిన ఇంచు కూడా తగ్గని అభిమానగణం.. ప్రేమను పంచడంలో ‘బద్రి’ స్నేహానికి ‘బంగారం’ విలువలు - అనుబంధానికి ‘అన్నవరం’... అవినీతిపరుల గుండెల్లో బెంబెలేత్తించే గబ్బర్‌సింగ్‌

HBD Pawan kalyan : అవి పాత్రలు మాత్రమే కాదు.. ఆయనలో గుణాలు!

పవన్‌కల్యాణ్‌.. ఆ పేరు ఓ బ్రాండ్‌...(Pawan kalyan)

అవుట్ ఆఫ్‌ ద సినిమా ఇండస్ట్రీ ఆయన క్రేజే వేరు...

జయాపజయాలతో ఆయనకు పనిలేదు...

పదేళ్లపాటు వరుస పరాజయాలు చూసిన ఇంచు కూడా తగ్గని అభిమానగణం..

ప్రేమను పంచడంలో ‘బద్రి’ (badri)

స్నేహానికి ‘బంగారం’

విలువలు - అనుబంధానికి ‘అన్నవరం’...

అవినీతిపరుల గుండెల్లో బెంబెలేత్తించే గబ్బర్‌సింగ్‌

న్యాయ సాధనకు ‘వకీల్‌సాబ్‌’

సమాజంలో నలుగురి మంచి కోరే ‘భీమ్లానాయక్‌’

దేశభక్తిని చాటి చెప్పే ‘భగత్‌సింగ్‌’

తత్వాన్ని బోధించే ‘బ్రో’..

ఇవి పవన్‌కల్యాణ్‌ సినిమా పేర్లే కావచ్చు..

కానీ ఆయన నిజజీవితానికి దగ్గరగా ఉండే పాత్రలు.. కూడా.

సినిమా ఇండస్ట్రీలో నంబర్‌వన్‌ పొజిషన్‌లో ఉండి, కోట్లు సంపాదన ఉన్నా... వాటిలో ఆయనకు సంతృప్తి లేదు. జనాలకు ఏదో చేయాలని తపనతో ‘జనసేన’ పార్టీ ద్వారా జనాల్లో తిరుగుతున్నారు పవన్‌కల్యాణ్‌. శనివారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు...

స్నేహం, జనసేన పార్టీ కార్యకలాపాలు ఇవన్నీ పక్కన పెడితే పవన్‌కు మరో అలవాటు ఉంది. అదే పుస్తకం పఠనం. మంచి రచనలతో చెలిమి చేస్తుంటారాయన. పుస్తకాలను స్నేహితులుగా భావిస్తారు పవన్‌కల్యాణ్‌. జీవితం గురించి అర్థమయ్యేలా చెప్పేది ఈ పుస్తకాలే అంటుంటారాయన. ఖాళీ సమయం దొరికిందీ అంటే పుస్తకాలు తిరగేస్తూనే ఉంటారు. పవన్‌కల్యాణ్‌ఉపన్యాసాల్లో తరచూ వినిపించే కవిత్వం గుంటూరు శేషేంద్రశర్మదే. ఆధునిక మహాభారతం, జనవంశం పుస్తకాలు పట్టుకుని పవన్‌ కనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. గుంటూరు శేషేంద్రశర్మ కోరిక మేరకు కొన్ని పుస్తకాలను మళ్లీ ముద్రించేందుకు పూనుకొని శేషేంద్రపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు పవన్‌. నేటి యువతకు గుంటూరు శేషంద్ర శర్మను పరిచయం చేసింది పవన్‌ కళ్యాణ్‌ అనొచ్చు.

1.jpg

పవన్‌కల్యాణ్‌ను ప్రభావితం చేసిన పుస్తకాలెన్నో ఆయన లైబ్రరీలో ఉన్నాయి. దాదాపు రెండు లక్షలకు పైగా విలువున్న పుస్తకాలు ఆయనతో ఉన్నాయి. అయితే ఈ మాటను చాలామంది వక్రీకరించారు కూడా. ‘పవన్‌కల్యాణ్‌ రెండు లక్షల పుస్తకాలు చదివేశాడట. అది సాధ్యమా.. విడ్డూరం కాకపోతే.. 50 ఏళ్లున్న ఓ వ్యక్తి నిత్యం షూటింగ్‌లు, సినిమాలు అంటూ బిజీగాఉండే మనిషి అన్ని పుస్తకాలు ఎలా చదివేస్తాడు’ అంటూ చాలామంది కామెంట్లు చేశారు. అయితే ఆయన చెప్పింది.. రెండు లక్షల పుస్తకాలు చదివానని కాదు.. రెండు లక్షల రూపాయలు విలువ గల పుస్తకాలు ఆయనతో ఉన్నాయని’ ఇటీవల నిర్మాత ఎ.ఎంరత్నం వివరించారు. చిన్నతనం నుంచే పవన్‌కు పుస్తకాల మీద ఆసక్తి. ఓ రోజు బడికి వెళ్తుండగా ఆ సమీపంలో ఓ గోడ మీద ‘తాకట్టులో భారతదేశం’ టైటిల్‌ కనిపించిందట. దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టిన పవన్‌ ఇంటర్‌లో ఉండగా వాళ్ల నుంచి ఆ పుస్తకాన్ని తీసుకొని చదివారు. ఈ సమాజాన్ని ఆ పుస్తక రచయిత తరిమెల నాగిరెడ్డి విశ్లేషించిన తీరు ఆలోచింపజేసిందని చెప్పారు. అందులో చర్చించిన అంశాలు ఇప్పటికీ వర్తిస్తాయని అభిప్రాయాన్ని పవన్‌కల్యాణ్‌ ఓ వేదికపై తెలిపారు. పవన్‌ కల్యాణ్‌కు నచ్చిన మరో పుస్తకం ‘అతడు అడవిని జయించాడు’. జీవనాధారం కోల్పోయినప్పుడు మనిషి పడే ఆవేదనను, కష్టం కళ్లకు కట్టినట్లు చూపించారు రచయిత కేశవరెడ్డి. ఆయన రచనా ప్రభావంతోనే రైతులు, చేనేత కార్మికులు, ఉద్దానం కిడ్నీ బాధితులు సాయం కోరగానే స్పందించానని ఆయన చెబుతుంటారు.

జపాన్‌కు చెందిన పర్యావరణవేత్త మసనోబు పురుగుల మందులు, కెమికల్స్‌తో వ్యవసాయం చేయడం కన్నా ఆర్గానిక్‌ పద్థతిలో వ్యవసాయం చేసి అధిక దిగుబడి సాధించవచ్చని నిరూపించారు. ఆయన పరిశోధనలు, అభిప్రాయాలను ‘గడ్డి పరకతో విప్లవం’ అనే పుస్తకంలో రాసుకొచ్చారు. ఆ పుస్తకానికి ప్రభావితమైన పవన్‌ ఆ పుస్తకాన్ని అందరూ చదివి అవగాహన పెంచుకోవాలని ఎన్నో వేదికలపై వెల్లడించారు.

ఫ్రీడమ్‌ కోసం 25 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన నెల్సన్‌ మండేలారాసిన ‘లాంగ్‌ వాక్‌ టు ఫ్రీడమ్‌’.. పవన్‌ కల్యాణ్‌ను ప్రభావితం చేసిన పుస్తకాల్లో ఒకటి. ‘బద్రి’ సమయంలో మండేలా జైలు శిక్ష అనుభవించిన గదిని ఆయన స్వయంగా వెళ్లి చూశారు. ఆయనలోని పోరాట పటిమ కూడా పవన్‌కు ఓ స్ఫూర్తిగా నిలిచింది. ‘గబ్బర్‌ సింగ్‌’ షూటింగ్‌ చేస్తున్న సమయంలో ‘వనవాసి’ పుస్తకం చదవాలని పవన్‌కు ఆసక్తి కలిగింది. ఎంత ప్రయత్నం చేసినా అది పుస్తకం దొరకలేదు. అదే విషయాన్ని తనికెళ్ల భరణికి చెప్పగానే ఆ బుక్‌ పవన్‌ చేతుల్లోకి చేరింది. ‘గబ్బర్‌ సింగ్‌’ హిట్‌ కన్నా ‘వనవాసి’ పుస్తకం దొరికిన క్షణంలోనే ఎక్కువ ఆనందపడ్డానని పవన్‌ చెబుతుంటారు.

2.jpg

పుస్తక పఠనంతో పాటు పవన్‌లో ఉన్న మరో కళ గానం. ఆయనలో మంచి గాయకుడు కూడా ఉన్నాడు. ఇప్పటి వరకూ ఆయన పాడిన పాటలన్నీ సూపర్‌హిట్టే! ‘తమ్ముడు’ సినిమాలో పవన్‌ రెండు పాటలు పాడారు. అవి బిట్స్‌ సాంగ్సే అయినా ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తున్నాయి. మల్లికార్జునరావును ఆటపట్టిస్తూ పాడే ‘తాటి చెట్టు ఎక్కలేవు.. తాటి కల్లు దింపలేవు.. మల్లి నీకెందుకు రా పెళ్లి’ సాంగ్‌ ఎంతగా ఆకట్టుకుంటో చెప్పక్కర్లేదు. అలాగే ఆయన పాడిన మరో పాట ‘ఏం పిల్లా మాట్లాడవా’ కూడా అదరగొట్టిందనే చెప్పాలి. పవన్‌ కెరీర్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్టైన ‘ఖుషి’లో ‘బై బయ్యే బంగారు రమణమ్మ..’ కూడా అప్పట్లో ట్రెండ్‌ అయింది. తాగిన మత్తులో పవన్‌ వేసిన స్టెప్పులు.. భూమిక పోస్టర్‌ చింపే సీన్‌ నెక్ట్స్‌ లెవల్‌ అనుకోవాలి. అలాగే ఆయన దర్శకత్వం వహించిన ‘జానీ’లో ఒక బిట్‌ సాంగ్‌, ఓ పూర్తిస్థాయి పాటను పవన్‌ ఆలపించారు. ఎమ్మెస్‌ నారాయణ తాగుడు గురించి సెటైరికల్‌గా ‘నువ్వు సారా తాగకు..’ అంటూ పాడిన పాటకు అప్పట్లో మామూలు రియాక్షన్‌ రాలేదు. సమాజం లోని కొంతమంది మోసగాళ్ల మీద సెటైర్లతో పాడిన ‘రావోయి మా ఇంటికి’ పాట ఆలరించింది. ఆలోజింపచేసింది. ‘గుడుంబా శంకర్‌’ ‘కిల్లీ కిల్లీ..’ అంటూ పవన్‌ గొంతెత్తితే పాడిన ఐటెమ్‌ సాంగ్‌ కు ప్రేక్షకులు ఊగిపోయారంతే! ఆ తర్వాత కొంతకాలంఆ చిత్రం తర్వాత మళ్లీ ‘పంజా’లో ఆయన గొంతు సవరించుకున్నారు. బ్రహ్మానందంపై ‘పాపారాయుడు’ అంటూ పాడి ఓ కిక్‌ ఇచ్చారు. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ‘అత్తారింటికి దారేది’లో కూడా పవన్‌ పాడారు. ఆ చిత్రంలో బద్దం భాస్కర్‌ పాత్రధారి బ్రహ్మానందంను టార్గెట్‌ చేసి ‘కాటమ రాయుడా కదిరి నరసింహుడా’ అంటూ పాడితే యూట్యూబ్‌ షేక్‌ అయింది. ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో ‘కొడకా కోటేశ్వరరావు..’ అంటూ పవన్‌ గొంతెత్తితే.. యూట్యూబ్‌లో వ్యూస్‌ రికార్డులు సృష్టించాయి.

రీడర్‌, సింగర్‌ ఇవే కాదు.. పవన్‌కల్యాణ్‌లో స్టంట్‌ కో-ఆర్టినేటర్‌ కూడా ఉన్నారు. పవన్‌కు కరాటేలో మంచి ప్రావీణ్యం ఉంది. చిన్నతనంలోనే మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నారు. తమ్ముడు సినిమా కోసం వాటిని బయటకు తీసుకొచ్చారు. ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ఖుషి’, ‘డాడీ’, ‘గుడుంబా శంకర్‌’, ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’, ‘అజ్ఞాతవాసి’ చిత్రాలకు ఆయన స్టంట్‌ కోఆర్టినేటర్‌గా పనిచేశారు.

Updated Date - 2023-09-02T11:00:05+05:30 IST