Brahmanandam: 1254 సినిమాలు చేశాను, కానీ ఇలాంటిది ఇంతవరకు...

ABN , First Publish Date - 2023-03-16T13:12:01+05:30 IST

కమెడియన్ గా బ్రహ్మానందం అందరికీ సుపరిచయమే. కానీ అదే బ్రహ్మానందం లో ఇంకో కోణాన్ని దర్శకుడు కృష్ణవంశి తన 'రంగమార్తాండ' లో ఆవిష్కరించాడు. అది ఎలా వుంది అన్న విషయం బ్రహ్మానందం మాటల్లోనే...

Brahmanandam: 1254 సినిమాలు చేశాను, కానీ ఇలాంటిది ఇంతవరకు...

దర్శకుడు కృష్ణవంశీ (Director Krishna Vamsi) చాలా కాలం తరువాత అంటే ఇంచుమించు ఒక అయిదు సంవత్సరాల తరువాత 'రంగమార్తాండ' (Rangamarthanda) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. మణిరత్నం (Mani Ratnam) సినిమాలకోసం ఎలా అయితే ఎదురు చూస్తారో, అలాగే కృష్ణ వంశీ సినిమాలు అంటే కూడా ఎదురు చూసే ప్రేక్షకులు కూడా చాలామంది వున్నారు. ఈసారి ఒక రీమేక్ చెయ్యాలని నిర్ణయించుకొని మరాఠీ లో పెద్ద హిట్ అయిన సినిమా 'నటసామ్రాట్' (Natsamrat) ని తెలుగులో 'రంగమార్తాండ' గా తెలుగుతనం ఉండటం కోసం చిన్న చిన్న మార్పులు చేసి తీసాడు.

rangamaarthanda.jpg

మరాఠీ సినిమాకి మహేష్ మంజ్రేకర్ (Mahesh Manjrekar) దర్శకత్వం వహిస్తే, నానా పటేకర్ (Nana Patekar) అందులో ప్రధాన పాత్ర పోషించాడు. తెలుగులో ప్రకాష్ రాజ్ (Prakash Raj), బ్రహ్మానందం (Brahmanandam), రమ్యకృష్ణ (Ramya Krishnan) ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాని కొంతమంది సెలెక్ట్ ప్రేక్షకులకు వేసి చూపిస్తున్నారు దర్శకుడు కృష్ణ వంశీ. ఈ సినిమా మార్చి 22 న విడుదల అవుతోంది.

rangamaarthanda1.jpg

బ్రహ్మానందం ఇందులో ఒక సీరియస్ పాత్రలో కనపడతారు. బ్రహ్మానందాన్ని ఒక కమెడియన్ గా మాత్రమే చూసారు ప్రేక్షకులు, కానీ ఈ 'రంగమార్తాండ' లో మాత్రం ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. "ఇలాంటి పాత్ర నేను ఇంతకు ముందెన్నడూ చెయ్యలేదు," అని బ్రహ్మానందమే అన్నారు. "సుమారు 1254 సినిమాలు చేసాను ఇంతవరకు. కానీ 'రంగమార్తాండ' లో వేసినటువంటి పాత్ర ఎన్నడూ వెయ్యలేదు," అని చెప్పారు బ్రహ్మానందం.

ఇన్ని సినిమాలు బ్రహ్మానందం చేసినా ఎప్పుడూ ప్రేక్షకులకి కమెడియన్ గా మాత్రమే కనిపించారు ఎక్కువగా. అప్పట్లో జంధ్యాల (Director Jandhyala) 'బాబాయ్ హోటల్' (Babai Hotel) సినిమా తీసినా అందులో పాత్ర కూడా ఈ 'రంగమార్తాండ' లా కాదు అని చెప్పారు. "ఇప్పుడు ఈ పాత్ర వచ్చింది చేసాను, ఇంతకు ముందు ఎవరూ ఇలాంటింది ఇవ్వలేదు అందుకే చెయ్యలేదు," అని చెప్పారు బ్రహ్మానందం, ఎందుకు ఇంతవరకు ఇలాంటి పాత్ర చెయ్యలేదు అని అడిగితే.

brahmanandam1.jpg

ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్ర పోషించినా, బయటకి వచ్చిన ప్రేక్షకులు మాత్రం బ్రహ్మానందం ఈ సినిమాకి హీరో అని అంటున్నారు. అన్ని సన్నివేశాలను తన అత్యద్భుత నటనతో బ్రహ్మానందం మెప్పించారు అని అన్నారు. హాస్పిటల్ కర్ణ, దుర్యోధన డైలాగ్స్ చెప్పినప్పుడు, అలాగే ప్రకాష్ రాజ్ కొడుకు, కోడలు దగ్గరికి వచ్చి వాళ్ళని తిట్టి ఉమ్మేసినప్పుడు, ఇంకో సన్నివేశం లో 'నాకు పిల్లలు లేరు కాబట్టి నేను అదృష్టవంతుడిని' అని అనుకుంటున్నావా అన్న సన్నివేశం ఒకటేమిటి ఎన్నో వున్నాయి ఇలా చెప్పడానికి.

brahmanandam2.jpg

'నాకు కన్నీళ్లు ఎందుకు రావటం లేదురా రంగా' అని తన భార్య పోయినప్పుడు బ్రహ్మానందం చేసే సన్నివేశం హృదయాలను హత్తుకొంటుంది. "నాకు ఇప్పుడు దర్శకుడు ఇలాంటి పాత్ర ఇచ్చాడు, చేసాను, అంతే కానీ నేను ఇంతకు ముందు ఎందుకు ఇలాంటివి చెయ్యలేదు అంటే, నాకు రాలేదు. వస్తే ఇలాంటివి చేస్తాను తప్పకుండా," అని చెప్పారు బ్రహ్మానందం, ఇలాంటి సీరియస్ పాత్రల్లో చూడాలనివుంది అంటే.

బ్రహ్మానందం తన ఆటోబయోగ్రఫీ రాస్తున్నారు. అది ఎంతవరకు వచ్చింది అని అడిగినప్పుడు, "పూర్తి కావొచ్చింది. ఆ పుస్తకం పని మీదే వున్నాను. త్వరలోనే అది విడుదల అవుతుంది. అందులో ఎన్నో విషయాలు ఉంటాయి," అని చెప్పారు బ్రహ్మానందం.

సురేష్ కవిరాయని

Updated Date - 2023-03-16T13:13:32+05:30 IST