Naveen Polishetty : అసలు ఈ కథ మేమే ఎందుకు చేశామంటే..!

ABN , First Publish Date - 2023-09-05T13:10:55+05:30 IST

ఈ సినిమాలో నేను అనుష్కతో (Anushka) కలిసి నటిస్తున్నాని తెలిసినప్పుడు పైకి పెద్దగా స్పందించలేదు కానీ, లోలోపల ఆనందంతో మాటల్లో వర్ణించలేదు. ఆమె నటించిన ‘అరుంధతి’ నాకు ఇష్టమైన సినిమా. అలాంటిది ఆమెతో కలిసి నటించడం చాలా సంతోషాన్నిచ్చింది.

Naveen Polishetty : అసలు ఈ కథ మేమే ఎందుకు చేశామంటే..!

‘‘ఈ సినిమాలో నేను అనుష్కతో (Anushka) కలిసి నటిస్తున్నాని తెలిసినప్పుడు పైకి పెద్దగా స్పందించలేదు కానీ, లోలోపల ఆనందంతో మాటల్లో వర్ణించలేదు. ఆమె నటించిన ‘అరుంధతి’ నాకు ఇష్టమైన సినిమా. అలాంటిది ఆమెతో కలిసి నటించడం చాలా సంతోషాన్నిచ్చింది. మేమే ఈ చిత్రం ఎందుకు చేశామన్నది సినిమా చూశాక మీకు తెలుస్తుంది’’ అని నవీన్‌ పోలిశెట్టి (Naveen polishetty) అన్నారు. ఆయన కథానాయకుడిగా అనుష్క కథానాయికగా నటించిన చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. (Miss Shetty Mr. Polishetty) పి.మహేష్‌బాబు దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. ఈ నెల 7న విడుదల కానుందీ సినిమా. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘

‘‘జాతిరత్నాలు సక్సెస్‌ని ముందే ఊహించాం. అయితే అంత భారీ విజయం సాధిస్తుందని ఏమాత్రం అనుకోలేదు. దీంతో ఆ తర్వాత ఎంచుకునే కథ ప్రేక్షకుల అంచనాలకు మించేలా ఉండాలన్న బాధ్యత నాపై పడింది. ఈ క్రమంలో చాలా కథలు విన్నా. అదే సమయంలో కొవిడ్‌ ప్లాన్‌లు అన్ని నాశనం చేసింది. ఇక ఆ ఏడాది ఏ సినిమా జోలికి వెళ్లలేదు. అప్పటికే ఈ కథ లాక్‌ అయింది. ఓ కథ విని వారాలు గడుస్తున్నా.. మళ్లీ మళ్లీ అదే గుర్తొస్తుందంటే అందులో ఓ మ్యాజిక్‌ ఉందని అర్థం. మహేష్‌ ఈ కథ వినిపించాక నాకు అదే అనుభూతి కలిగింది. తను రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ జానర్‌లోనే ఇంతవరకు రాని ఓ విభిన్నమైన కథను సిద్థం చేశాడు. అది నాకు బాగా నచ్చింది. అలాగే మా జోడీ యూనిక్‌గా అనిపించింది. సినిమాలో నాకు, అనుష్కకి మధ్య నాన్‌స్టాప్‌ కామెడీ ఉంటుంది. తెరపై చూస్తేనే ఆ కిక్‌ తెలుస్తుంది. విజిల్స్‌ మోత మోగుతుంది. భావోద్వేగాలతో కలగలిపిన చిత్రమిది. కృష్ణాష్టమి రోజు విడుదల కానున్న ఈ చిత్రం కృష్ణుడు ఎలా అల్లరి చేస్తాడో.. మా చిత్రం కూడా అంతే అల్లరిగా ఉంటుంది. ఇందులో స్టాండప్‌ కమెడియన్‌గా కనిపిస్తా ప్రేక్షకులకు తెలుగు స్టాండప్‌ కమెడియన్‌ను పరిచయం చేేస ప్రయత్నం చేస్తున్నాం. ఈ పాత్ర కోసం చాలా రిసెర్చ్‌ చేశాను. నిజమైన స్టాండప్‌ కామెడీ స్టూడియోలో చిత్రీకరణ జరిపాం. ట్రైలర్‌లో ఓ బోల్డ్‌ డైలాగ్‌ ఉంది. దానికి ఓ కారణం ఉంది. తెరపై చూసినప్పుడు మీరు దాన్ని ఎంజాయ్‌ చేస్తారు. గత ఏడాది ప్రారంభించిన ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలనుకున్నాం. సినిమా నాణ్యత కోసం కాస్త టైమ్‌ తీసుకోవలసి వచ్చింది. దాని వల్లే గ్యాప్‌ వచ్చింది’’ అని అన్నారు.

ఆఫర్‌ వస్తే వెళ్తా...

నా దృష్టిలో కథే సినిమాకు నిజమైన హీరో. అదే అందరి కన్నా పెద్దది. అలాంటి పెద్ద కథల కోసమే నేనెప్పుడూ వెతుకుతుంటా. మంచి స్ర్కీన్‌ప్లే, వినోదం.. ప్రేక్షకుల్ని ఆకర్షించే కొత్త అంశం.. ఇలాంటి అంశాలతో నిండిన కథ కుదిరినప్పుడు దర్శకుడికి అనుభవం ఉందా? కొత్త వాడా, సీనియర్‌ దర్శకుడా కాదా అన్నది ఆలోచించను. కథతో కనెక్ట్‌ అయితే చాలనుకుంటా. చాలా మంది తెలుగు సినిమా నుంచి హిందీ సినిమాకు వెళ్తుంటారు. నేను అక్కడి సినిమాలు చేసిన ఇక్కడికి వచ్చా. మంచి కథ దొరికితే మళ్లీ హిందీలో సినిమా చేస్తా. ప్రస్తుతం తెలుగు సినిమా లెక్క మొత్తం మారిపోయింది. దానికి తెలుగు ప్రేక్షకులు సినిమాపై చూపించే ప్రేమే కారణం. కథ బాగుండి.. అందులో నా పాత్ర వైవిధ్యభరితంగా ఉంటే మరో స్టార్‌తో కలిసి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’ అని నవీన్‌ పోలిశెట్టి.

Updated Date - 2023-09-05T13:11:59+05:30 IST