Nandi awards controversy: నందులను పంచలేదు.. ప్రతిభకే ఇచ్చారు

ABN , First Publish Date - 2023-04-07T18:57:13+05:30 IST

పోసాని కృష్ణమురళీ వైసీపీ కోసం పని చేస్తున్నాయనీ, పార్టీలో తన మనుగడ కోసం సినిమాను వాడుకోవడం సరికాదని నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్‌ అన్నారు.

Nandi awards controversy: నందులను పంచలేదు.. ప్రతిభకే ఇచ్చారు

పోసాని కృష్ణమురళీ (Posani krishna Murali) వైసీపీ కోసం పని చేస్తున్నాయనీ, పార్టీలో తన మనుగడ కోసం సినిమాను వాడుకోవడం సరికాదని నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్‌ అన్నారు. నంది అవార్డులపై పోసాని చేసిన వ్యాఖ్యలు అతని వ్యక్తిగమని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఏపీ ఫైబర్‌నెట్‌ ఫస్ట్‌ డే ఫస్ట్‌షో పోస్టర్‌ లాంచ్‌ కార్యక్రమంలో పోసాని నంది అవార్డుల గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. (Nandi awards controversy)

‘‘నంది కమిటీలో ఉన్న 12 మంది సభ్యుల్లో 11 మంది కమ్మ, కాపువారే, వాళ్లు ఇచ్చేవి నంది అవార్డులు కాదు.. కమ్మ, కాపు అవార్డులు, నంది పురస్కారాల అంశంలో అనేక అపోహలున్నాయి, గ్రూపులు, కులాలవారీగా అవార్డులను పంచుకున్నారు అంటూ పోసాని చేసిన వ్యాఖ్యలపైౖ ప్రసన్నకుమార్‌ స్పందించారు. (Prasanna kumar counter to Posani krishna murali)

‘ఏపీ ఫైబర్‌నెట్‌ అనేది ఆంధ్రాకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి పార్టీ పరంగా పోసాని అలా మాట్లాడి ఉండవచ్చు. నంది అవార్డుల ఎంపిక చాలా పారదర్శకంగా ఉంటుంది. జాతీయ అవార్డుల విషయంలోనూ ఇలాంటి విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ కులాలవారీగా అవార్డులు ఇవ్వరు. దమ్మున్న సినిమా, ప్రతిభ గల ఆర్టిస్ట్‌లకు అవార్డులు వస్తాయి. సినిమాకు కులం, మతం, జాతి, ప్రాంతం అనేది ఉండదు. సినిమాలో సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయా? అవి సినిమాకు ఉపయోగపడ్డాయా అన్నది కూడా పరిగణలోకి తీసుకుని అవార్డులు ఇస్తారు. పోసానికి కృష్ణమురళికి టెంపర్‌లో అవార్డు వచ్చిందంటే ఆయన కులం, మతం చూసి ఇచ్చింది కాదు. నటనలో ఆయనకున్న ప్రతిభ చూసి ఇచ్చారు. అప్పుడు నంది అవార్డు కమిటీలో జీవితా రాజశేఖర్‌, పరుచూరి బ్రదర్స్‌ ఉన్నారు. పరుచూరి సోదరులు కమ్యూనిస్ట్‌ భావజాలం ఉన్నవ్యక్తులు. అసలు కులాన్ని పరిగణనలోకి తీసుకోరు. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్‌నే పరిగణలోకి తీసుకుంటారు’’ అని అన్నారు.

దీనిపై సీనియర్‌ నటుడు, నిర్మాత మురళీమోహన్‌ (murali mohan) కూడా మాట్లాడారు. ‘‘ఇండస్ర్టీలోకి అనవసరంగా కులాలను తీసుకువస్తున్నారని మండిపడ్డారు. ఏ రోజూ ఇండస్ర్టీలో కులాల ఆధారంగా అవార్డులు ఇవ్వలేని స్పష్టం చేశారు. ఎవరి టాలెంట్‌ బాగుంటే వారికే అవార్డులు దక్కాయని చెప్పారు. ‘అన్నదమ్ముల్లా ఉండే కళాకారుల మధ్య వివాదాలు తెచ్చిపెడుతున్నారు. మాది సినిమా కులం. కులాల వారీగా అవార్డులు ఇస్తున్నారనడం బాధాకరం’’ అని మురళీమోహన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-04-07T18:57:44+05:30 IST