Leo : సమస్యకు పరిష్కారం ఉంది... రిలీజ్‌లో ఏ మార్పు లేదు!

ABN , First Publish Date - 2023-10-17T17:04:17+05:30 IST

విజయ్‌ నటించిన ‘లియో’ సినిమా తెలుగు రిలీజ్‌కి ఊహించని షాక్‌ తగిలింది. ఈ సినిమా విడుదలపై స్టే విధిస్తూ హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 20వ తేదీ వరకు ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదని కోర్టు ఆదేశించింది.

Leo : సమస్యకు  పరిష్కారం ఉంది... రిలీజ్‌లో ఏ మార్పు లేదు!

విజయ్‌ నటించిన ‘లియో’ (Leo) సినిమా తెలుగు రిలీజ్‌కి ఊహించని షాక్‌ తగిలింది. ఈ సినిమా విడుదలపై స్టే విధిస్తూ హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 20వ తేదీ వరకు ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదని కోర్టు ఆదేశించింది. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలకు సిద్దమైంది. చిత్ర బృందం ప్రమోషన్స్  జోరుగా చేస్తోంది. మరో పక్క అడ్వాన్స్ బుకింగ్స్‌ కూడా ఓపెన్‌ అయ్యాయి. ప్రారంభం నుంచి ఈ చిత్రానికి ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే తమిళనాడు మార్నింగ్‌ షో వివాదం ఎదురు కాగా.. తాజాగా తెలుగు విడుదలపై కోర్టు స్టే  ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాను అక్టోబర్‌ 20 వరకు రిలీజ్‌ చేయోద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగులో లియో టైటిల్‌ను మరో నిర్మాత రిజిష్టర్‌ చేసుకోవడం కారణంగా ఈ చిత్రం విడుదలకు ఆగినట్లు తెలిసింది. ఈ మేరకు నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. టైటిల్‌ సమస్యను తొలగించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 19న సినిమాను విడుదల చేస్తామని తెలిపారు.

ఈ చిత్రానికి హిందీలోనూ మల్టీప్లెక్స్‌ సమస్యతో థియేటర్స్‌ దొరకలేదు. తమిళనాడులోనూ మార్నింగ్‌ షోలకు అనుమతి దక్కలేదు. కన్నడలో అయితే అసలే థియేటర్లే సరిగ్గా దొరకలేదు. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన ఈ చిత్రానికి ఇప్పుడు తెలుగులోనూ అడ్డంకి ఏర్పడింది.

దీనిపై నిర్మాత నాగవంశీ ఏమన్నారంటే ...

తెలుగులో టైటిల్ విషయంలో చిన్న సమస్య వచ్చింది. తెలుగులో లియో టైటిల్ ని ఒకరు రిజిస్టర్ చేసుకున్నారు. వారు మమ్మల్ని సంప్రదించకుండా నేరుగా కోర్టుని ఆశ్రయించారు. ఈ విషయం నాకు కూడా మీడియా ద్వారానే తెలిసింది. టైటిల్ రిజిస్టర్ చేసుకున్నవారితో మాట్లాడుతున్నాం. సమస్య పరిస్కారం అవుతుంది. విడుదలలో ఎలాంటి మార్పు ఉండదు. అక్టోబర్ 19నే తెలుగులో కూడా లియో విడుదల అవుతుంది.

- తెలుగు టైటిల్ ని కూడా తమిళ నిర్మాతలే రిజిస్టర్ చేయించారు. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది. కాబట్టి విడుదలకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఇక్కడ తెలుగులో లియో టైటిల్ ని వేరొకరు కూడా రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి.. వాళ్ళకి గానీ, మాకు గానీ ఎటువంటి నష్టం జరగకుండా సమస్యని పరిష్కరించుకుంటాం.

- థియేటర్ల సమస్య లేదు. ఏ సినిమాకి తగ్గట్టుగా ఆ సినిమా విడుదలవుతుంది. లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు ఎటువంటి సమస్య లేకుండా ఏ సినిమాకి కావాల్సినన్ని థియేటర్లు ఆ సినిమాకి కేటాయించారు. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. భగవంత్ కేసరి ఘన విజయం సాధించాలని, అంతకంటే పెద్ద హిట్ సినిమా బాలకృష్ణ గారితో మేము తీయాలని కోరుకుంటున్నాను.

- మేము నిర్మించిన వాతి(సార్) చిత్రాన్ని తమిళ్ లో లలిత్ కుమార్ గారు విడుదల చేశారు. ఆ సమయంలో ఏర్పడిన అనుబంధంతో ఇప్పుడు తెలుగులో మేము లియో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.

- గుంటూరు కారం మొదటి పాట విడుదల ఎప్పుడనేది దసరా సమయంలో తెలియజేస్తాం.

Updated Date - 2023-10-17T17:06:56+05:30 IST