Music Director Raj: సంగీత దర్శకుడు రాజ్‌ కన్నుమూత

ABN , First Publish Date - 2023-05-21T17:35:09+05:30 IST

సంగీత దర్శక ద్వయంలో రాజ్‌ (Raj) ఇకలేరు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు.

Music Director Raj: సంగీత దర్శకుడు రాజ్‌ కన్నుమూత

సంగీత దర్శక ద్వయంలో రాజ్‌ (Raj) ఇకలేరు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. రాజ్‌ అసలు పేరు తోటకూర సోమరాజు (Raj passed away). ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రాజ్ కు ముగ్గురు కుమార్తెలు. పెద్ద అమ్మాయి సాప్ట్ వేర్ ఇంజనీర్. రెండో అమ్మాయి నటుడు ప్రసాద బాబు తనయుడిని  ప్రేమ వివాహం చేసుకున్నారు. మూడో అమ్మాయి గాయనిగా సంగీత రంగంలో కొనసాగుతున్నారు

సినీ సంగీత ప్రపంచంలో రాజ్‌-కోటి ద్వయానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. వీరిద్దరి కలయికలో ఎన్నో విజయవంతమైన పాటలొచ్చాయి. దశాబ్దాల పాటు వీరి సంగీతం సంగీత ప్రియులను అలరించింది. రాజ్‌ మరణంతో చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. రాజ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. (Raj koti)

రాజ్‌ కోటి సంగీత సారధ్యంతో ఎన్నో మరపురాని పాటలొచ్చాయి. వీరిద్దరూ దాదాపు 180కు పైగా చిత్రాలకు సంగీతం అందించారు. 1982 ప్రళయ గర్జన’తో ప్రారంభమైన ఈ కాంబినేషన్‌ 1999 వరకూ కొనసాగింది. ‘ముఠామేస్ర్తి’, ‘బావా బావమరిది’, ‘గోవిందా గోవిందా’ ‘హలోబ్రదర్‌’ కొదమ సింహం, యముడికి మొగుడు, లంకేశ్వరుడు , కర్తవ్యం, బంగారు కుటుంబం, పోకిరి రాజా వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.

కొన్ని కారణాల వల్ల కోటి నుంచి విడిపోయిన రాజ్‌ సొంతంగా కొన్ని చిత్రాలకు సంగీతం అందించారు. ‘సిసింద్రీ’, ‘రాముడొచ్చాడు’, ‘ప్రేమంటే ఇదేరా’ (నేపథ్య సంగీతం), ‘చిన్ని చిన్ని ఆశ’ తదితర సినిమాలకు ఆయన సంగీత దర్శకుడిగా పనిచేశారు. మహేశ్ నటించిన టక్కరి దొంగ లో కామెడీ పాత్ర పోషించారు.

Updated Date - 2023-05-21T17:39:14+05:30 IST