Mrunal Thakur: వాళ్ళకి దూరం.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా

ABN , First Publish Date - 2023-07-02T15:08:34+05:30 IST

'సీతారామం’తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సీతగా చెరగని ముద్ర వేసిన భామ మృణాల్‌ ఠాకూర్‌. టాలీవుడ్‌లో చేసింది ఒక్క సినిమానే అయినా తన అందం, అభినయంతో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ బుల్లెట్‌లా దూసుకుపోతోంది. ప్రస్తుతం యంగ్‌ హీరోలు నాని, విజయ్‌ దేవరకొండతో జత కడుతూ... టాలీవుడ్‌లో పర్మనెంట్‌గా బెర్త్‌ కన్ఫామ్‌ చేసుకునే పనిలో ఉన్న ఈ సొగసరి చెబుతున్న విశేషాలివి...

Mrunal Thakur: వాళ్ళకి దూరం.. డిప్రెషన్‌లోకి  వెళ్లిపోయా

'సీతారామం’తో (Sitaramam) తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సీతగా చెరగని ముద్ర వేసిన భామ మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal thakur). టాలీవుడ్‌లో చేసింది ఒక్క సినిమానే అయినా తన అందం, అభినయంతో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ బుల్లెట్‌లా దూసుకుపోతోంది. ప్రస్తుతం యంగ్‌ హీరోలు నాని, విజయ్‌ దేవరకొండతో జత కడుతూ... టాలీవుడ్‌లో పర్మనెంట్‌గా బెర్త్‌ కన్ఫామ్‌ చేసుకునే పనిలో ఉన్న ఈ సొగసరి చెబుతున్న విశేషాలివి... (Sita ramam Fame)

ఫొటోలు కత్తిరించి దాచుకునేదాన్ని..

చిన్నప్పట్నుంచీ ఆటలంటే చాలా ఇష్టం. క్రికెట్‌, బాస్కెట్‌బాల్‌ ఎక్కువగా ఆడేదాన్ని. నా సోదరుడి కారణంగానే నాకు క్రికెట్‌పై ఇష్టం ఏర్పడింది. ఐదేళ్ల క్రితమే మేమిద్దరం బ్లూ జెర్సీ వేసుకుని స్టేడియంలో మ్యాచ్‌ని ఎంజాయ్‌ చేశాం. కట్‌చేస్తే ‘జెర్సీ’ లాంటి క్రికెట్‌ ఆధారిత సినిమాలో భాగమయ్యే అవకాశం వచ్చింది. విరాట్‌ కోహ్లీకి నేను పెద్ద అభిమానిని. అలాగే షాహిద్‌కపూర్‌ నటనంటే చాలా ఇష్టం. అతడే నా ఫస్ట్‌ క్రష్‌. నేను, అక్క అతడి ఫొటోలను కత్తిరించి పుస్తకాల్లో దాచుకునేవాళ్లం. ఈ విషయం తెలిసి ఇంట్లోవాళ్లు తిట్టేవారు. అయినా సరే మా పని మాదే. అలాంటిది షాహిద్‌తో నటించే అవకాశం రాగానే ఎగిరి గంతేశా. (Mrunal First crush)

డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా...

నన్ను డెంటిస్ట్‌గా చూడాలనేది అమ్మానాన్నల కోరిక. కానీ మీడియా రంగంపై ఉన్న ఆసక్తితో ఇంట్లో వాళ్లని ఒప్పించి బీఎమ్‌ఎమ్‌ (బ్యాచిలర్స్‌ ఇన్‌ మాస్‌ మీడియా)లో చేరా. కొన్నిరోజుల తర్వాత ఎందుకో నాకది సెట్‌ కాదనిపించింది. మరోవైపు కుటుంబానికి దూరంగా ఉండి చదువుకుంటున్నాననే బాధ. దాంతో కొన్నిరోజులు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. ఆ సమయంలో క్రేజీ ఆలోచనలు తట్టేవి. లోకల్‌ ట్రైన్‌లో డోర్‌ దగ్గర నిలబడి కాలేజీకి వెళుతుంటే కిందకి దూకేయాలనిపించేది.

WhatsApp Image 2023-07-02 at 2.46.25 PM.jpeg

బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తుంటా...

నేను క్లాసికల్‌ డ్యాన్సర్‌ని. ఆ అనుభవమే ‘సీతారామం’లో బాగా ఉపయోగపడింది. నన్ను, నా వృత్తిని పూర్తిగా అర్థం చేసుకునే వాడినే పెళ్లి చేసుకుంటా. హైదరాబాద్‌ బిర్యానీ, వడపావ్‌ ఇష్టంగా తింటా. నాకు బీచ్‌ సైడ్‌ డెస్టినేషన్‌ స్పాట్స్‌ అంటే చాలా ఇష్టం. బికినీ, కఫ్తాన్‌, షార్ట్స్‌ ధరించి బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తుంటా. కొత్త ప్రదేశాలకు వెళ్తే ఫొటోలు తీసి ఆల్బమ్‌లు చేయించడం అలవాటు. మధుబాల, సావిత్రి గారి నటనంటే చాలా ఇష్టం.

బాడీ షేమింగ్‌ చేసేవాళ్లు

కెరీర్‌ ఆరంభంలో కాస్త బొద్దుగా ఉండేదాన్ని. నా శరీరాకృతి మట్కా(కుండ)లా ఉందని చాలామంది కామెంట్‌ చేసేవారు. దాంతో సోషల్‌ మీడియాలో ఫొటోలు పోస్ట్‌ చేయాలంటేనే భయమేసేది. ఒకసారి నేను ఏదో పని మీద అమెరికా వెళ్లా. అక్కడ కొందరు ‘ఇండియన్‌ కర్దాషియన్‌’ అన్నారు. దాంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అప్పటినుంచి ట్రోల్స్‌ని పట్టించుకోవడం మానేసి, ధైర్యంగా ఫొటోలను పోస్ట్‌ చేయడం మొదలుపెట్టాను.

Untitled-2.jpg

ఎన్నో తిరస్కరణలు

మా కుటుంబంలో ఎవరికీ సినిమా పరిశ్రమపై అవగాహన లేదు. అందుకే సినీ ఇండస్ట్రీకి వెళ్తానంటే మొదట్లో ససేమిరా అన్నారు. అప్పుడు వాళ్లకి ‘త్రీ ఇడియట్స్‌’ సినిమా చూపించా. ‘నచ్చిన పని చేస్తే వచ్చే ఆనందమే వేరు’ అన్న సందేశాన్ని అర్థం చేసుకుని నన్ను ప్రోత్సహించారు. ఓ వైపు సీరియల్స్‌ చేస్తూనే, మరోవైపు సినిమా అవకాశాల కోసం ఆడిషన్స్‌కి వెళ్లేదాన్ని. ఎన్నో తిరస్కరణలు నా జీవితంలో ఓ పాఠంలా మిగిలిపోయాయి.

‘సుల్తాన్‌’ మిస్సయ్యా...

సల్మాన్‌ఖాన్‌ ‘సుల్తాన్‌’లో అనుష్కశర్మ పోషించిన పాత్రలో నిజానికి నేనే నటించాలి. ఆ పాత్ర కోసం దర్శక నిర్మాతలు కొన్ని రోజులు మల్లయుద్ధంలో శిక్షణ ఇప్పించారు. మూడు నెలల్లో పదకొండు కిలోల బరువు తగ్గా. ఏమైందో ఏమోగానీ చివరికి ఆ అవకాశం అనుష్కశర్మ చెంతకి చేరింది. ‘బహుశా.. నేను ఎక్కువ బరువు తగ్గడంతో వాళ్లకి మల్లయోధురాలిగా కనిపించలేదేమోన’ని నాకు నేను సర్దిచెప్పుకుని మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టా.

Updated Date - 2023-07-02T15:08:34+05:30 IST