2023 Year ender: ఈ ఏడాదిలో చిన్న సినిమాలవే పెద్ద విజయాలు

ABN , First Publish Date - 2023-12-11T13:39:04+05:30 IST

2023 సంవత్సరంలో ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి, కానీ ఈసారి చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తమ ప్రతాపాన్ని చూపించాయి. కొన్ని సినిమాలు డబ్బులతో పాటు అవార్డులను కూడా గెలుచుకున్నాయి. ఆ చిన్న సినిమాలు ఏవీ, ఎలాంటి విజయాలు సాధించాయి అన్న విషయం చదవండి.

2023 Year ender: ఈ ఏడాదిలో చిన్న సినిమాలవే పెద్ద విజయాలు
Some of the small films created sensation at Box office in the year 2023

2023 సంవత్సరం పూర్తి కావొస్తోంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈ సంవత్సరం ఎన్నో పెద్ద సినిమాలు విడుదలయ్యాయి, అలాగే వాటితో పాటుగా చాలా చిన్న బడ్జెట్ సినిమాలు కూడా విడుదలయ్యాయి. ఈసారి ఆశ్చర్యకరంగా చిన్న సినిమాలు చాలా పెద్ద విజయాల్ని నమోదు చేసుకున్నాయి. అందులో ఎక్కువమంది దర్శకులుగా ఆరంగేట్రం చేసిన వాళ్ళే ఎక్కువగా కనిపించారు. ఆలా ఏఏ చిన్న సినిమాలు ఈ సంవత్సరం పెద్ద విజయాల్ని నమోదు చేసుకున్నాయో చూద్దాం.

balagam-awards.jpg

బలగం (మార్చి 3, 2023):

'జబర్దస్తు' కామెడీ షోలో అందరికీ సుపరిచయం అయిన నటుడు వేణు యెల్దండి. అతను మంచి భావోద్వేగాలతో కూడిన 'బలగం' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించే వేణు, 'బలగం' తో భావోద్వేగాలకు కూడా గురి చెయ్యగలడు అని నిరూపించాడు ఈ సినిమాతో. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, కొత్తగా దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించి తన తదుపరి జెనరేషన్ పిల్లలు హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి లు నిర్మాతగా ఈ సినిమాని మొట్ట మొదటగా నిర్మించారు. ఇందులో ప్రియదర్శి , కావ్య కళ్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, కోట జయరామ్, మైమ్ మధు మరియు మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ 'బలగం' మార్చి 3, 2023 న విడుదలైంది. విడుదలైన మొదటి రెండు రోజుల్లో పెద్దగా ప్రేక్షకులు రాకపోయినా, తరువాత ఒక పాజిటివ్ టాక్ తో ఈ సినిమా విపరీతమైన ప్రేక్షకాదరణ పొందింది. వేణు యెల్దండి దర్శకత్వం, రచన, ఈ కథలో వున్న భావోద్వేగ సన్నివేశాలు, కథనం వీటన్నిటికీ తోడు ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ ఎంతో సహజంగా నటిస్తూ ఈ సినిమాకి ప్రత్యేక ప్రశంసలు తీసుకువచ్చారు. డబ్బులతో పాటుగా ఈ సినిమా ఎన్నో అవార్డులు కూడా గెలుచుకుంది. అంతర్జాతీయ చలన చిత్ర పోటీల్లో ఈ చిత్రం చాలా ప్రశంసలు పొందింది. తెలంగాణా రాష్ట్రంలోని ఒక గ్రామంలో జరిగిన కథని, సజీవంగా చూపించటమే కాకుండా, తెలంగాణ పల్లె సంస్కృతి, సంప్రదాయాలను ఎంతో గొప్పగా చిత్రీకరించి ఇందులో చూపించే విధానం అందరినీ మెప్పించింది. ఎంతోమంది రాజకీయ నాయకులు ఈ సినిమాని తమ ప్రసంగాల్లో ఉదాహరించారు అంటే ఈ సినిమా ఎంత గొప్పగా ఉందొ అర్థం చేసుకోవచ్చు. చాలా కాలం తరువాత తెలుగు చలన చిత్ర సీమలో అరుదుగా వచ్చే చిత్రాల్లో ఒకటి 'బలగం' అయింది. ఈ చిత్రంలో పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

samajavaragamana6.jpg

సామజవరగమన (జూన్ 29, 2023):

నటుడు శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన చిత్రం 'సామజవరగమన' ఈ సంవత్సరం జూన్ 29 న విడుదలైంది. దీనికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాకి సమర్పకులుగా వ్యవహరిస్తే, రాజేశ్‌ దండా నిర్మించారు. ఈ సినిమా వినోదాత్మకంగా కడుపుబ్బా నవ్విస్తుంది. నవ్వుకోడానికి మాత్రమే తీసారా అన్నట్టుగా ఈ సినిమా మొదటి నుండీ చివరి వరకూ అలానే సాగుతుంది. ఈ సినిమాలో శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ తో పాటు వెన్నెల కిశోర్, నరేశ్, శ్రీకాంత్ అయ్యంగార్ లు కూడా ప్రధాన పాత్రల్లో కనపడతారు. శ్రీవిష్ణు, నరేష్ తండ్రీ కొడుకులుగా వేసిన ఈ సినిమాలో తండ్రి డిగ్రీ పరీక్షలకి హాజరవటం ఆసక్తికరం. తండ్రి డిగ్రీ పాసయితే కోట్ల రూపాయలు వారసత్వ ఆస్తి వస్తుందని ప్రతి ఏడూ పరీక్షకి కట్టడం, తప్పటం జరుగుతూ ఉంటుంది. ఈలోగా కథానాయకుడు అయిన శ్రీవిష్ణు తన ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా వున్న రెబాతో ప్రేమలో పడటం, ఆమె తల్లిదండ్రులకి ప్రేమ వివాహం ఇష్టం లేకపోవటం, అప్పుడు విష్ణు ఏమి చేసాడు, ఎలా ఆమె తల్లిదండ్రులను ఒప్పించాడు అనేది ఎంతో వినోదాత్మకంగా చెప్పిన కథ ఇది. తాను ప్రేమించే అమ్మాయి తనకి వరసకి చెల్లెలు అవుతుంది అని అమ్మాయి తండ్రి చెప్పినప్పుడు ఆ సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించే విధంగా చూపించే విధానం బాగుంది. ఈ సినిమా ఒక చిన్న సినిమా అయినా, కలెక్షన్స్ మాత్రం చాలా భారీగా వసూలు చేసింది, నిర్మాతకి చాలా లాభాలను ఆర్జించి పెట్టింది.

babymovie.jpg

బేబీ (జులై 14, 2023)

ఈ సంవత్సరం సంచలనం సృష్టించిన ఇంకో సినిమా 'బేబీ' సినిమాని చెప్పుకోవచ్చు. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలుగా చేశారు. జులై 14 న విడుదలైన ఈ సినిమాకి ఎస్కెఎన్ నిర్మాత. ఇది ముగ్గురు మధ్య నడిచే ఒక ప్రేమ కథా చిత్రం. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చిన్నప్పటి నుంచే స్నేహితులు, కానీ వైష్ణవి కాలేజీ చదువుకు పట్నానికి వెళ్లిన తరువాత ఆమె జీవనశైలి మారిపోతుంది, ఆ సమయంలోనే విరాజ్ అశ్విని పరిచయం అవుతాడు. బస్తీ నుండి వచ్చే అమ్మాయి పబ్ లకి వెళ్లి అధునాతనంగా మారిపోయి, చిన్నప్పటి నుండి తనని ప్రేమిస్తున్న వ్యక్తిని కాదని, కాలేజీలో పరిచయం అయిన వ్యక్తితో ప్రేమలో పడుతుంది. ఇలా ఈ ముగ్గురి మధ్య జరిగే ప్రేమని సాయి రాజేష్ ఒక బలమైన సంఘర్షణ ప్రధానాంశంగా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులని, విమర్శకులని ఆకట్టుకుంది. ఈ చిన్న సినిమా వందకోట్ల క్లబ్ లో చేరటం సంచలనమే సృష్టించింది. ఇందులో పాటలు అన్నీ బాగా ప్రాముఖ్యం చెందాయి, ఈ సినిమా యువతని బాగా ఆకట్టుకుందని చెప్పాలి. ఈ సంవత్సరం విడుదలైన సినిమాలలో 'బేబీ' ఒక సంచలనమే. చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి నటులు ఈ సినిమాని ఎంతో ప్రశంసించారు. ఈ సినిమాకి కాకినాడకు చెందిన తెలుగు అబ్బాయి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించాడు.

bedurulankareview1.jpg

బెదురులంక 2012 (ఆగస్టు 25, 2023):

'ఆర్ఎక్స్ 100' అనే సినిమాతో 2018లో విజయం సాధించిన నటుడు కార్తికేయ గుమ్మకొండ, తరువాత వరసగా ఫ్లాపులు చవిచూశాడు. అటువంటి సమయంలో ఈ సంవత్సరం ఆగస్టు 25న ఈ 'బెదురులంక' అనే సినిమాతో మళ్ళీ ఒక పెద్ద విజయం సాధించాడు. దీనికి క్లాక్స్ దర్శకుడు, ఇది అతని మొదటి సినిమా దర్శకుడిగా. ఇందులో నేహా శెట్టి కథానాయిక. రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ సినిమా నిర్మాత. ఈ సినిమా కథ యుగాంతం జరగబోతోంది అని 2012 లో బెదురులంక అనే గ్రామంలో ప్రజలు భయభ్రాంతులు అవుతుంటే, ఆ భయాన్ని డబ్బులు చేసుకుందుకు అదే గ్రామంలో ఒక ముగ్గురు కుట్ర పన్నుతారు. వుద్యోగం మానేసి తిరిగి గ్రామానికి వచ్చిన కార్తికేయ ఆ ముగ్గురినీ ఎదిరించి ప్రజలకు ఎలా నిజం చెప్పగలిగాడు అనేది కథ. సినిమాలో కొన్ని వినోదాత్మక సన్నివేశాలు, కార్తికేయ, నేహా శెట్టి ల మధ్య వచ్చే కొన్ని పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించే అంశాలుగా చెప్పొచ్చు. అలాగే మూఢనమ్మకాల మీద ఒక చిన్న సందేశం కూడా ఉంటుంది. ఈ సినిమా కార్తికేయ గుమ్మకొండ కి ఒక మంచి బ్రేక్ తెచ్చింది, అలాగే నిర్మాతకి డబ్బులు కూడా బాగా వచ్చేట్టు చేసింది. ఇది ఈ సంవత్సరం ఒక ఆశ్చర్యంగా హిట్ అయిన సినిమా అని చెప్పొచ్చు.

MADmovie.jpg

మ్యాడ్ (అక్టోబర్ 6, 2023):

ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్ టైనమెంట్స్ ఈ చిన్న సినిమాని నిర్మించారు. దీనికి కళ్యాణ్ శంకర్ దర్శకుడు, ఇది అతనికి మొదటి సినిమా. ఇందులో ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్, ఇంకా మరికొంతమంది నటులు తెలుగు తెరకి పరిచయం అయ్యారు. కాలేజీ నేపథ్యంలో వచ్చే కథ ఇది, సరదాగా సాగిపోతుంది. నలుగురు స్నేహితులు, వాళ్ళ నేపధ్యం, కాలేజీలో వాళ్ళు చేసే హంగామా, వాళ్ళ ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కలిపి వినోదాత్మకంగా తీసిన సినిమా ఇది. కాలేజీలో జరిగే అల్లరి, స్నేహం వాళ్ళ మధ్య వచ్చే సంభాషణలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి, ఇందులో చాలామంది కొత్తవాళ్లు అయినా, ఎంతో బాగా కాలేజీ కుర్రాళ్ళుగా ఒదిగిపోయి మెప్పించారు. ఈ సినిమా కూడా మంచి హిట్ అయి, నిర్మాతకి బాగా డబ్బులు వచ్చేట్టు చేసింది, అలాగే దర్శకుడికి మంచి పేరు తీసుకు వచ్చింది. ఈ సినిమాలో పరిచయం అయిన కొంతమంది నటులు వేరే సినిమాల్లో కూడా చేస్తూ ఉండటం ఒక మంచి పరిణామం. పరభాషా కథానాయికలతో పాటు పర భాషా నటులను దిగుమతి చేసుకుంటున్న తెలుగు పరిశ్రమలో, ఈ సినిమాతో చాలామంది తెలుగు నటులు పరిచయం అవటం శుభ పరిణామం అనే చెప్పొచ్చు. ఇది ఒక చిన్న సినిమా, కానీ దీని విజయం మాత్రం చాలా పెద్దది.

-- సురేష్ కవిరాయని

Updated Date - 2023-12-11T14:10:37+05:30 IST