KS Ramarao Comments: సినీ పరిశ్రమ కాదు.. ప్రభుత్వాలు చేయాల్సిన పని!

ABN , First Publish Date - 2023-04-08T18:03:28+05:30 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం అంతర్జాతీయ వేదికపై ఆస్కార్‌ పురస్కారం అందుకోవడం దేశానికే గర్వకారణం. అందులోనూ తెలుగు సినిమాకు దక్కిన తొలి ఆస్కార్‌ కావడం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో ప్రత్యేకం.

KS Ramarao Comments: సినీ పరిశ్రమ కాదు.. ప్రభుత్వాలు చేయాల్సిన పని!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)చిత్రం అంతర్జాతీయ వేదికపై ఆస్కార్‌ పురస్కారం అందుకోవడం దేశానికే గర్వకారణం. అందులోనూ తెలుగు సినిమాకు దక్కిన తొలి ఆస్కార్‌ కావడం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో ప్రత్యేకం. తెలుగు సినిమాను ఆస్కార్‌ వేదిక వరకూ తీసుకెళ్లిన రాజమౌళి బృందాన్ని ఘనంగా సన్మానించాలి. ఇది చిత్ర పరిశ్రమ ఒకటే చేయాల్సిన పని కాదు.. తెలుగు సినిమాకు దక్కిన గౌరవంగా భావించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చేయాల్సిన పని’’ అని సీనియర్‌ నిర్మాత కె.ఎస్‌.రామారావు (Ks ramarao) అన్నారు. తెలుగు సినిమాకు ఆస్కార్‌ తీసుకొచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ను ఫిల్మ్‌ ఛాంబర్‌, నిర్మాతల మండలి, సినిమా పరిశ్రమకు చెందిన పలు శాఖల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించనున్నారు. ఆదివారం జరగనున్న ఈ వేడుకకు శిల్పకళావేదిక వేదిక కానుంది. ఈ సందర్భంగా సీనియర్‌ నిర్మాత కె.ఎస్‌.రామారావు శనివారం ఫిల్మ్‌ చాంబర్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. చిత్ర పరిశ్రమకు చెందిన అసోసియేషన్లు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి కట్టుగా ఈ వేడుక చేయాలని ఆయన కోరారు. ఈ వేడుకను గొప్పగా చేయడానికి పరిశ్రమలో కొన్ని సంస్థలకు ఆర్థిక వనరులు లేవు. ఫిల్మ్‌ నగర్‌ కల్చరర్‌ సెంటర్‌ (ఎఫ్‌ఎన్‌సీసీ)లో ఆర్థిక వనరులు బాగా ఉన్నాయి. దానితో కలిసి ఈ వేడుక నిర్వహిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. Ks ramarao comments on Governments)

ఆ మేరకు ఆయన మాట్లాడుతూ ‘‘మనదేశంలో ఆస్కార్‌ (RRR Oscar) అందుకున్నవారి సంఖ్య చాలా తక్కువ. పలు విభాగాల్లో సత్యజిత్‌ రే, భాను అథియా, ఎ.ఆర్‌.రెహమాన్‌ వంటి వారు ఎన్నో ఏళ్ల క్రితం ఆస్కార్‌ అందుకున్నారు. ఇప్పుడు ఆ ప్రతిష్ఠాత్మక అవార్డు తెలుగు సినిమాను వరించింది. మన సినిమాకు మొదటిసారి అంతర్జాతీయ వేదికపై దక్కిన గౌరవమిది. పద్మా అవార్డుల కన్నా గొప్పది. సినిమా పరిశ్రమ వరకూ ఇంత గొప్ప అవార్డు తెచ్చిన మేకర్స్‌ ఇంతకుముందు లేరు. ఇంతకుముందు ఎవరికీ ఈ అవార్డు దక్కలేదు. రాజమౌళి వల్ల తెలుగు సినిమాకు ఆ గౌరవం దక్కింది. ఆస్కార్‌ అనేది దాదాపు 200 దేశాలకు సంబంధించి పోటీ. అందులో తెలుగు సినిమా స్థానం సాధించడం అంత సులభం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోటీలో తెలుగు సినిమా ఆ అవార్డు దక్కించుకోవడం గొప్ప విషయం. ఎలాంటి అవార్డు అయినా కమిటీ దృష్టికి వెళ్లడం, మెప్పించడం చాలా కష్టం. ఆర్‌ఆర్‌ఆర్‌ కమిటీని మెప్పించింది. దీని వెనక రాజమౌళితోపాటు అతని టీమ్‌ కృషి ఎంతో ఉంది. ఈ గౌరవాన్ని తెచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ని చిత్ర పరిశ్రమే కాకుండా ప్రభుత్వాలు (Two telugu states) పూనుకుని గౌరవించుకోవాలి. వివిధ రంగాల్లో చిన్న అవార్డు, గుర్తింపు సాధిస్తేనే ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు వంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం చేస్తుంటాయి. అలా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కళాకారులకు ప్రభుత్వాలు ఏమన్నా చేయాలి. ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలను పక్కనపెట్టి ఆస్కార్‌ విజేతలను సన్మానించాలి’’ అని అన్నారు.

Updated Date - 2023-04-08T18:08:19+05:30 IST