Hollywood Director: ‘ఇది రాసి పెట్టుకోండి.. ఈసారి ఆస్కార్ ఆర్ఆర్ఆర్‌దే’
ABN , First Publish Date - 2023-01-09T12:18:50+05:30 IST
‘ఆర్ఆర్ఆర్’ (RRR).. ఈ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
‘ఆర్ఆర్ఆర్’ (RRR).. ఈ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రామ్‌చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR) పిరీయాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్ల వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ఓటీటీ(OTT)లో విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా ఈ చిత్రానికి ఎన్నో అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ఈ తరుణంలో తాజాగా ఈ మూవీకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఈ అవార్డుని అందుకోవడం కోసం ఈ మూవీ టీం యూఎస్‌ఏలో ఉంది. ఈ చిత్రం ప్రస్తుతం ఆస్కార్‌కి కూడా పోటీ పడుతోంది. ఈ తరుణంలో హాలీవుడ్ హార్రర్ చిత్రాల దర్శకుడు జాసన్ బ్లమ్ ఈ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

హాలీవుడ్ హార్రర్ చిత్రాలైన ‘ది పర్జ్’ సిరీస్ చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు జాసన్ బ్లమ్. ఇటీవలే ‘ఎమ్3గన్’ అనే మరో హార్రర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీకి కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ దర్శకుడు తాజాగా ఈసారి ఆస్కార్స్ అవార్డు ‘ఆర్ఆర్ఆర్’కి వస్తుందని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. జాసన్ చేసిన ట్వీట్‌లో.. ‘‘ఈసారి ఆస్కార్ అవార్డు ‘ఆర్ఆర్ఆర్’దేనని అనుకుంటున్నా. ఇది రాసి పెట్టుకోండి. నేనైతే నా సొంత ఆస్కార్‌ని ఆ సినిమాకే ఇచ్చేస్తా’ అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దీంతో ‘ఈ మూవీకే ఆస్కార్ రావాలి’ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.