SuperStarKrishna: కౌబాయ్ సినిమా మళ్ళీ విడుదల, ఎప్పుడంటే...

ABN , First Publish Date - 2023-04-01T12:25:46+05:30 IST

సూపర్ స్టార్ కృష్ణ అంటేనే సాహసం. డేరింగ్ అండ్ డేషింగ్ కృష్ణ గారు భారతదేశ సినిమా చరిత్రలో కౌబాయ్ ని సృష్టించారు. అమెరికాలో ప్రసిద్ధి చెందిన ఈ కౌబాయ్ ని 'మోసగాళ్లకు మోసగాడు' పేరుతో తెలుగుకి కూడా తీసుకొచ్చి శెభాష్ అనిపించుకున్నారు. ఇప్పటి తరం చూడటానికి ఈ కౌబాయి సినిమా మళ్ళీ విడుదల అవుతోంది. అది ఎప్పుడంటే...

SuperStarKrishna: కౌబాయ్ సినిమా మళ్ళీ విడుదల, ఎప్పుడంటే...

ఈమధ్య పాత సినిమాలు మళ్ళీ విడుదల చేస్తున్నారు. ఆ నటుల పుట్టినరోజునాడో, లేదా ఆ సినిమా ఇన్నేళ్లు పూర్తి చేసిందనో పాత సినిమాలని మళ్ళీ విడుదల చేస్తున్నారు. అలాంటిదే దివంగత సూపర్ స్టార్ కృష్ణ (SuperStar Krishna) గారి పుట్టినరోజు నాడు కూడా చేస్తున్నారు. అభిమానుల కోరిక మేరకు కృష్ణ నటించిన 'మోసగాళ్లకు మోసగాడు' (Mosagallaku Mosagadu) సినిమాని మే 31, కృష్ణ గారి పుట్టినరోజు నాడు విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

mosagallakumosagadu1.jpg

ఇది భారతీయ చలన చిత్ర సీమలో మొదటి కౌబాయి (First Cowboy Cinema) సినిమా. ఈ సినిమా షూటింగ్ థార్ (Thar) ఎడారిలో తీశారు. దీనికి దర్శకుడు కె.ఎస్.ఆర్. దాస్ (KSR Das) కాగా, కృష్ణ తన స్వంత బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించారు. కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరి రావు (Adiseshagiri Rao) ఈ సినిమాకి నిర్మాత. ఈ సినిమా షూటింగ్ కోసం కృష్ణ గారు ఒక రైలు ను మొత్తం ఆ యూనిట్ సభ్యులకు బుక్ చేశారు. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్లో (Rajasthan) ఎడారులు అలాగే బికనీర్ (Bikaneer) లోని కోట దగ్గర చేశారు. అదొక్కటే కాకుండా హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లోని సిమ్లా పరిసర ప్రాంతాల్లో కూడా ఈ సినిమాని చిత్రీకరించారు.

mosagallakumosagadu2.jpg

మొట్టమొదటి సారిగా కృష్ణ ఈ సినిమాలో కౌబాయ్ గా నటించారు. అంతవరకు భారతదేశ సినిమా చరిత్రలో ఎవరూ కూడా కౌబాయ్ సినిమా తీయలేదు. అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమ ఎక్కువగా మద్రాసు (ఇప్పుడు చెన్నై) లో ఉండేది. అప్పట్లో ఆంగ్ల సినిమా 'మెకన్నాస్ గోల్డ్' (Mackenna's Gold) చాలా బాగా నడుస్తోంది. అప్పుడు కృష్ణ గారి దృష్టి అటువంటి కౌబాయ్ సినిమాల మీద పది 'ఫర్ ఎ ఫ్యూ డాలర్స్ మోర్', (For a Few Dollars More) 'గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ' (Good Bad and Ugly) లాంటి సినిమాలను కూడా కలుపుకుని ఓ కథ తయారుచేసి తెలుగులో కౌబాయ్ సినిమా చేయాలన్న తలంపు కృష్ణ గారికి వచ్చింది. రావటమేంటి వెంటనే ప్రముఖ రచయిత ఆరుద్రకి ఆ భాధ్యని అప్పగించారు.

mosagallakumosagadu3.jpg

ఇంగ్లీష్ లో బాగా ప్రాచుర్యం పొందిన కౌబాయ్ ని తెలుగుకి పరిచయం చెయ్యడం అంటే మాటలు కాదు. కానీ రచయిత ఆరుద్ర (Arudra) చాలా కష్టపడి ఈ సినిమా కథని తాయారు చేసి, మాటలు, పాటలు అన్నీ తనే రాసాడు. మొదట్లో అతనికే దర్శకత్వం చెయ్యమని కృష్ణ అడిగారు, కానీ అతను చెయ్యను అన్నాడు, అప్పుడు కె.ఎస్.ఆర్. దాస్ కి దర్శకత్వ భాద్యతలు అప్పచెప్పారు. ఈ సినిమా విడుదలయి విజయడంకా మోగించింది. ఎన్నో భాషల్లోకి తర్జుమా చేసి విడుదల చేశారు. అంత పెద్ద విజయం సాధించింది ఇది.

ఇందులో కృష్ణ(Krishna), విజయనిర్మల (Vijayanirmala), జ్యోతిలక్ష్మి, నాగ భూషణం, ప్రభాకర్ రెడ్డి, త్యాగరాజు, గుమ్మడి, సత్యనారాయణ (Kaikala Satyanarayana) లాంటి పెద్ద పెద్ద నటులు వున్నారు. వి. ఎస్. ఆర్. స్వామి (VSR Swami) దీనికి ఛాయాగ్రహణం అందించగా, పి. ఆదినారాయణరావు సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో పాటలన్నీ చాలా పెద్ద విజయం సాధించాయి.

Updated Date - 2023-04-01T12:32:31+05:30 IST