Hunt Film Review: ఇది ఇంకో పేలవమయిన రీమేక్, ఫలించని 'హంట్'

ABN , First Publish Date - 2023-01-26T16:28:36+05:30 IST

నటుడు సుధీర్ బాబు పెద్ద విజయం కోసం చూస్తున్నాడు. అతని ముందు సినిమాలు నాలుగు వరసగా పరాజయాలు చవి చూశాయి, ఇప్పుడు 'హంట్' (Hunt) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో అతను మరోసారి ('వి' అనే సినిమాలో కూడా పోలీస్ పాత్ర వేసాడు) పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

Hunt Film Review: ఇది ఇంకో పేలవమయిన రీమేక్, ఫలించని 'హంట్'
A still from the film 'Hunt'

సినిమా రివ్యూ : హంట్

నటీనటులు : సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్ నివాస్, చిత్రా శుక్లా, 'మైమ్' గోపి, మంజుల ఘట్టమనేని, మౌనికా రెడ్డి, గోపరాజు రమణ తదితరులు

ఛాయాగ్రహణం : అరుల్ విన్సెంట్

సంగీతం : జిబ్రాన్

నిర్మాత : వి. ఆనంద ప్రసాద్

రచన, దర్శకత్వం : మహేష్

-- సురేష్ కవిరాయని

నటుడు సుధీర్ బాబు పెద్ద విజయం కోసం చూస్తున్నాడు. అతని ముందు సినిమాలు నాలుగు వరసగా పరాజయాలు చవి చూశాయి, ఇప్పుడు 'హంట్' (Hunt) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో అతను మరోసారి ('వి' అనే సినిమాలో కూడా పోలీస్ పాత్ర వేసాడు) పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇది ఒక మలయాళం సినిమా 'ముంబై పోలీస్' కి రీమేక్. మహేష్ (Director Mahesh) దీనికి దర్శకుడు, కాగా సీనియర్ నటుడు శ్రీకాంత్ (Srikanth) ఒక ప్రధాన పాత్ర పోషిస్తే , 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ (Premiste fame Bharath) కూడా ఒక ముఖ్య పాత్రల్లో కనిపిస్తాడు.

Hunt film story: కథ:

అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ అర్జున్ (సుధీర్ బాబు) తన కారు నడుపుకుంటూ వస్తూ ఫోన్ లో కమిషనర్ మోహన్ తో (శ్రీకాంత్) మాట్లాడుతూ ఆర్య (భరత్)ని ఎవరు చంపారో కనిపెట్టానని చెపుతూ పేరు చెప్పబోయేలోపల కారుకు యాక్సిడెంట్ అవుతుంది. ఆ సంఘటనలో అర్జున్ తన గతాన్ని మరిచిపోతాడు (partial memory loss). అయినా కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే అర్జున్ నే ఆర్య కేసుని సాల్వ్ చెయ్యడానికి మోహన్ నియమిస్తాడు. గతం కొంచెం మరిచిపోవటంతో, వున్న ఎవిడెన్స్ తోనే అర్జున్ ని మళ్ళీ మొదటి నుండి ఆర్య కేసు దర్యాపు చెయ్యమని చెప్తాడు మోహన్, ఎందుకంటే ఆర్య మనిద్దరికీ కూడా మంచి మిత్రుడు అందుకని చంపింది ఎవరో కనిపెట్టాలి అని చెప్తాడు. యాక్సిడెంట్ అవక ముందు అనుమానితులుగా రాయ్ (మైమ్ గోపి), కల్నల్ విక్రమ్ (కబీర్ సింగ్), ఒక టెర్రరిస్ట్ గ్రూప్ నాయకుడు ల మీద నిఘా ఉంచుతారు. అయితే కేసును మళ్ళీ కొత్తగా దర్యాపు చేయడం మొదలు పెట్టిన అర్జున్ కి హంతకుడు ఈ ముగ్గురిలో ఉన్నదా? లేక ఇంకొకరు వున్నారా ఎవరు హంతకుడు అనే విషయం ఎలా తెలిసింది? ఆర్య ని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

hunt1.jpg

విశ్లేషణ:

సుధీర్ బాబును ఒక విషయం లో మెచ్చుకోవాలి. తన సినిమాలు విజయం సాధిస్తున్నాయో లేదో అనే విషయం పక్కన పెట్టి, వైవిధ్య భరితమయిన కథలతో, పాత్రలతో ప్రేక్షకులను మెప్పించటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అవి ప్రేక్షకులు అంగీకరిస్తారా, లేదా అన్నది తరువాత విషయం. ఇప్పుడు ఈ 'హంట్' సినిమా కూడా అలాంటి ఒక ప్రయత్నమే. ఇది మలయాళం సినిమా 'ముంబై పోలీస్' కి రీమేక్. అయితే దర్శకుడు మహేష్ మలయాళం సినిమాలో ఉన్నంత ఉత్కంఠను మాత్రం తెలుగులో చూపించలేకపోయాడు. సినిమా విడుదలకి ముందు సుధీర్ బాబు ఈ సినిమా గురించి, ప్రత్యేకంగా క్లైమాక్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడేడు. అలాగే తెలుగులో ఏ నటుడూ కూడా ఇందులో తను చేసిన పాత్రను చెయ్యడానికి ముందుకు రారు అని కూడా చెప్పాడు. అతను చెప్పింది కరెక్టే, కానీ ఆ ఒక్క క్లైమాక్స్ కోసం సుధీర్ బాబు ఈ 'హంట్' సినిమాని అంగీకరించాడా అని కూడా అనిపిస్తూ ఉంటుంది ఈ సినిమా చూసాక.

దర్శకుడు మహేష్ సినిమా మొదలు పెట్టడం బాగానే చేసాడు, త్వరగానే కథలోకి కూడా తొందరగానే వెళ్ళిపోయాడు, అలాగే మొదటి పదిహేను నిముషాలు కొంచెం ఆసక్తికరంగా వుండింది. కానీ ఆ తరువాతే కథ మీద పట్టు అతనికి తప్పింది. సుధీర్ బాబు యాక్సిడెంట్ అయ్యాక, గతం మరిచిపోయి మళ్ళీ దర్యాపు చేసినప్పుడు మొదట్లో బాగుంది. కానీ ఆ తరువాత వాళ్ళ గురించి వచ్చిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, వాళ్ళ ముగ్గురి స్నేహం గురించి వచ్చిన సన్నివేశాలూ అంతగా ఆకట్టుకునేలా తీయలేకపోయాడు దర్శకుడు. మలయాళం సినిమా యథాతథంగానే తీసుకున్నా, అందులో ఆకట్టుకునేట్టు వున్న సన్నివేశాలను తెలుగులో ఇవ్వలేకపోయాడు దర్శకుడు.

ఇక క్లైమాక్స్ గురించి మాట్లాడాలంటే, అది నిజంగా సుధీర్ బాబు చెయ్యటం గొప్పదే కానీ, అది అంత ఆమోదయోగ్యమయినది (Convincing) గా తీయలేదు. అదీ కాకుండా అలాంటివి మన తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఒప్పుకుంటారు (Accept) అన్న విషయం కూడా చూడాలి. సినిమాలో భావోద్వేగాలు కూడా అంతగా లేవు. స్నేహం మీద సినిమా కథ చుట్టూ తిరుగుతున్నా వాళ్ళ ముగ్గురి స్నేహం గురించి వచ్చిన సన్నివేశాలను అంత బాగా సన్నివేశాలు (establish) చేయలేకపోయాడు అందుకే అవి అంతగా రక్తి కట్టలేదు అనిపిస్తుంది. మొత్తం మీద ఒక మంచి కథ వున్నా కూడా సరి అయిన దర్శకత్వం, కథనం లేకపోవటం వాళ్ళ 'హంట్' సినిమా అంత ఆసక్తికరంగా లేదు అనే అనిపిస్తుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే సుధీర్ బాబు చాలా బాగా చూసాడు. అతని పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయి, ఒకటి గతం మర్చిపోయినప్పుడు, దానికి ముందు, బాగానే చేసాడు. కానీ అతను ఈ సిక్స్ ప్యాక్ పేరిట ప్రతి సినిమాలో బట్టలిప్పి తన బాడీ ని చూపించటం కూడా అంతగా ఉపయోగం లేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఒక సినిమాలో ఆ పాత్రకి అవసరం మేర చూపిస్తే చాలు, ఆలా అని ప్రతి సినిమాలో తాను సాంఘీక మాధ్యమాల్లో చూపిస్తున్న వ్యాయామ వీడియోస్ అన్ని సినిమాల్లోనూ చూపించటం అనవసరం అని చాలామంది భావన. ఇక శ్రీకాంత్, భరత్ ఇద్దరూ సినిమాలో రెండు ముఖ్య పాత్రలు పోషిస్తారు కానీ వాళ్ళవి అంత బలంగా రాయలేదు అనిపిస్తుంది, అందుకని పేలవంగా ఉంటాయి. చిత్ర శుక్లా బాగా చేసింది పోలీస్ ఆఫీసర్ గా. అలాగే మైమ్ గోపి, కబీర్ సింగ్, గోపరాజు, రవి వర్మ వీళ్ళందరూ తమ పాత్రల పరిధి మేరకు చేశారు.

అరుళ్ విన్సన్ట్ (Arul Vincent) ఛాయాగ్రహణం (Cinematography) బాగుంది. అలాగే పోరాట సన్నివేశాలు (Action episodes) బాగా చిత్రీకరించారు, కొత్తగా అనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ సంగీతం అంతగా మురిపించదు. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకి అదే ఒక మూలస్థంభం, కానీ సంగీత దర్శకుడు జిబ్రాన్ (Background music is by Gibran) అది సరిగ్గా ఇవ్వలేక పోయాడు.

చివరగా, 'హంట్' సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్న సుధీర్ బాబు ఒక్క పతాక సన్నివేశం కోసమే ఈ సినిమా చేసేడు అనిపిస్తుంది. పోరాట సన్నివేశాలు బాగున్నాయి తప్పితే సినిమాలో థ్రిల్లింగ్ సన్నివేశాలు కొరవడ్డాయి. మంచి సినిమాని సరిగ్గా రీమేక్ చెయ్యలేదు అనిపిస్తుంది.

Updated Date - 2023-01-26T17:38:22+05:30 IST