RRR - DVV Danayya: ఎవరో మతిలేక మాట్లాడిన మాటలవి.. ఆస్కార్‌ తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాత సంచలన వ్యాఖ్యలు!

ABN , First Publish Date - 2023-03-21T18:43:23+05:30 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ఆస్కార్‌ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆ చిత్ర నిర్మాత డి.వి.వి.దానయ్య చెప్పారు.

RRR - DVV Danayya: ఎవరో మతిలేక మాట్లాడిన మాటలవి.. ఆస్కార్‌ తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాత సంచలన వ్యాఖ్యలు!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)చిత్రం ఆస్కార్‌ (Oscar 95)అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆ చిత్ర నిర్మాత డి.వి.వి.దానయ్య చెప్పారు. ‘‘ఎంతోమంది గొప్ప నిర్మాతలు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించారు. వారెవరికీ దక్కని గౌరవం నాకు దక్కింది. ‘ఆస్కార్‌’ అందుకున్న తొలి తెలుగు చిత్రంగా నా సినిమా రికార్డు సృష్టించింది. ఇది మా టీమ్‌ అందరి కృషితోనే సాధ్యమైంది’’ అని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మీ సినిమా పేరు మార్మోగిపోతుంటే మీరెందురు బయట కనిపించరు అన్న ప్రశ్నకు ‘‘నా కెరీర్‌ బిగినింగ్‌ నుంచీ నేను ఇలాగే ఉన్నా. పబ్లిసిటీ నాకు నచ్చదు. నా పేరు వినబడుతుంది కానీ నేను కనిపించను. అలా ఉండటమే నాకు ఇష్టం’’ అని సమాధానమిచ్చారు. (DVV Danayya Sensational comments on RRR)

అసలు రాజమౌళితో (Danayya about Rajamouli) జర్నీ ఎలా మొదలైందో ఆయన చెప్పుకొచ్చారు.. 2006 నుంచీ రాజమౌళితో జర్నీ చేస్తున్నా. నాకో సినిమా చేయాలని అప్పట్లోనే ఓ చిన్న అమౌంట్‌ అడ్వాన్‌గా ఇచ్చా. అదే సమయంలో రాజమౌళి రెండు, మూడు సినిమాలు కమిట్‌ అయ్యారు. అయినా నాకు ఓ సినిమా చేస్తానని మాటిచ్చారు. అన్నట్లుగానే ‘మర్యాద రామన్నా’ కథ గురించి చెప్పి ఇది చేద్దామా అన్నారు. ‘నేను మీతో పెద్ద సినిమా చేయాలనుకుంటున్నా.. మంచి పేరు తెచ్చే సినిమా కావాలని చెప్పడంతో సరే అన్నారాయన. ‘బాహుబలి’ తర్వాత ఓ రోజు రాజమౌళి ఫోన్‌ చేసి ‘మీకు కొన్ని కాల్స్‌ రావచ్చు’ అన్నారు. అదే సమయంలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌తో ఆయన ఇంట్లో సమావేశం అయ్యారు. అప్పుడే ముగ్గురు కలిసి ఉన్న ఫొటో బయటకు లీక్‌ చేశారు. దాని గురించే కాల్స్‌ వస్తాయని నాకు అర్థమైంది. రాజమౌళి మెగా హీరో, నందమూరి హీరోతో భారీ చిత్రమే ప్లాన్‌ చేశారని తెగ ఆనందపడిపోయా. అలా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిర్మించే అవకాశం వచ్చింది’’ అని అన్నారు.

చిరంజీవి డేట్స్‌ ఇస్తారు కానీ డబ్బులెందుకు ఇస్తారు... (Danayya comments on Chiranjeevi)

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు నిర్మాత ఆయనే అయినప్పటికీ ఇన్వెస్టర్‌ చిరంజీవి అని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌ బడ్జెట్‌ ఇంత అంతా అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. నిజానికి రూ. 400 కోట్ల నుంచి రూ. 450 కోట్ల వరకు అయింది. ఈ చిత్రానికి చిరంజీవిగారు పెట్టుబడి పెట్టారు అన్న వార్తలో నిజం లేదు. అలాంటి గాలి వార్తలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కుటుంబానికి నాకు మంచి అనుబంధంది. నేను సినిమా తీస్తాను అంటే డేట్స్‌ ఇస్తారు కానీ డబ్బులిస్తారా? అసలు చిరంజీవి గారికి ఆ అవసరం ఏముంది. నిర్మాతలకు ప్రత్యేకంగా ఫైనాన్షియర్లు ఉంటారు. చిరంజీవిగారికి సొంత బ్యానర్‌ ఉంది. ఆయన చిత్రాలతో ఆయన బిజీగా ఉంటున్నారు. ఎవరో మతిలేక మాట్లాడిన మాటలవి. అలా మాట్లాడినవారు నా ఆఫీస్‌కి వచ్చారా? నా బ్యాంక్‌ స్టేట్‌మెంట్స్‌ చూశారా? అంటూ వదంతులను కొట్టిపారేశారు.

తిరుగులేని సినిమా ఇచ్చారు... ఇంకేం కావాలి...(Proud moment)

ఆస్కార్‌ ప్రకటించినప్పటి నుంచి బయట కనిపించకపోవడం, ఆస్కార్‌ వేడుకకు వెళ్లకపోవడంతో రాజమౌళి నిర్మాతను పక్కన పెట్టారు.. అమెరికాకు ఆహ్వానించలేదు’ అని వస్తున్న వదంతులపై కూడా దానయ్య స్పందించారు. ‘‘సింపుల్‌గా ఉండడం నాకు ఇష్టం. ఆడియో ఫంక్షన్స్‌లో కూడా నేను పెద్దగా కనిపించను. రాజమౌళి నన్ను పక్కన పెట్టడం, పిలవక పోవడం ఇవేమీ కరెక్ట్‌ కాదు. నాకు ఇలాంటివి పెద్దగా నచ్చదు. అవార్డు వచ్చింది అంతకుమించి ఆనందం ఏముంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిర్మాత ఎవరంటే దానయ్య పేరే గుర్తొస్తుంది. రాజమౌళి 2006లో ఇచ్చిన మాట తప్పకుండా మాట నిలబెట్టుకున్నారు. నా బ్యానర్‌కు తిరుగులేని సినిమా ఇచ్చారు. ప్యాన్‌ ఇండియా స్థాయి చిత్రానికి నిర్మాతగా పేరుంది. ఇంతకన్నా ప్రాధానం ఏముంటుంది... ఇంకేం కావాలి’’ అని దానయ్య అన్నారు.

Updated Date - 2023-03-21T18:55:05+05:30 IST