Mahar Yodh 1818: బ్రీటిష్ కాలంలో జరిగిన యధార్థ గాధతో భారీ చిత్రం
ABN , First Publish Date - 2023-10-27T10:56:09+05:30 IST
అధునాతన సాంకేతికత, అత్యుత్తమ నిర్మాణ విలువలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు మాయపేటిక, శ్రీవల్లి వంటి చిత్రాల్లో నటించిన యువ నటుడు రజత్ రాఘవ్, ఐశ్వర్య రాజ్ హీరోయిన్‌గా, రాజు గుడిగుంట్ల దర్శకత్వంలో సోషల్ థ్రిల్లర్, యాక్షన్, ఫాంటసీ తో రూపొందనున్న మహర్ యోధ్ 1818 చిత్రం షూటింగ్ గురువారం ప్రారంభమైంది.

తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పుడూ వైవిధ్యం కోరుకుంటారు. కంటెంట్ బాగుంటే అది చిన్నా-పెద్దా అనే తేడా లేకుండా ఆ సినిమాను నెత్తిన పెట్టుకునే అభిమానం వారి సొంతం. ఇప్పటికే చాలా సినిమాల విషయంలో ఈ విషయం రుజువైంది. ప్రస్తుతం తెలుగులో యువ దర్శకులు, నటులు సాధిస్తున్న విజయాలే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే సినిమాపై మక్కువతో అధునాతన సాంకేతికత, అత్యుత్తమ నిర్మాణ విలువలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు ఓ కొత్త జోనర్లో సరికొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. ఔత్సాహిక దర్శక, నిర్మాతలు.
డి.ఎస్.ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై మాయపేటిక, శ్రీవల్లి వంటి పలు చిత్రాల్లో నటించిన యువ నటుడు రజత్ రాఘవ్, ముంబయ్ అందాల భామ ఐశ్వర్య రాజ్ హీరోయిన్స్ గా.. రాజు గుడిగుంట్ల దర్శకత్వంలో సువర్ణ రాజు దాసరి నిర్మిస్తున్న సోషల్ థ్రిల్లర్, యాక్షన్, ఫాంటసీ తో రూపొందనున్న మహర్ యోధ్ 1818" చిత్రం షూటింగ్ గురువారం భద్రకాళీ పీఠం పీఠాదీశ్వరి శ్రీశ్రీశ్రీ డాక్టర్ సింధు మాతాజీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హజరైన ఏపీ ఎస్సీ సెల్ కమీషనర్ విక్టర్ ప్రసాద్ హీరో, హీరోయిన్లపై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అగ్ర దర్శకుడు నక్కింటి త్రినాథరావు గౌరవ దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొని, సినిమా విశేషాలను మీడియాకు వెల్లడించారు.
అయితే ఈ సినిమాను బ్రీటిష్ కాలంలో జరిగిన ఓ యధార్థ గాధ ఆధారంగా తీస్తున్నరని సమాచారం. 1818వ సంవత్సరంలో 800 మంది సైనికులతో ఉన్న బఈందం 28,000 మంది సైనిక బలగం ఉన్న పీష్వా బాజీరావ్ II ను భీమా-కోరేగావ్ వద్ద ఓడించింది. అయితే బ్రిటీష్ సైన్యంలో ఉన్న వారిలో దాదాపు 500 మంది మహర్ కమ్యూనిటీకి చెందిన వారే ఉండడంతో వారిని మహర్ యోధులు అని పిలుస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను మీదనే తెరకెక్కిస్తున్నారు.