రెండు సార్లు స్క్రీన్ టెస్ట్ చేశారు
ABN , First Publish Date - 2023-04-25T23:37:49+05:30 IST
గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కలయికలో వస్తున్న మూడో చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కలయికలో వస్తున్న మూడో చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. గోపీచంద్‌కు జోడీగా డింపుల్ హయతీ నటిస్తున్నారు. మే 5న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించారు.
‘రామబాణం’ చిత్రంలో అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే వినోదం ఉంది. ఇందులో నా పాత్ర పేరు భైరవి. వ్లాగ్స్ చేస్తుంటుంది. ఆధునిక భావాలున్న యువతిగా కనిపిస్తాను. ఈ పాత్రకు నేను సూటవుతాననే నమ్మకం కుదరక రెండు సార్లు స్ర్కీన్‌టెస్ట్ చేసి, అప్పుడు తీసుకున్నారు.
నిజ జీవితంలో నేను సోషల్ మీడియాకి దూరంగా ఉంటాను. నా ప్రవృత్తికి భిన్నంగా ఇందులో నేను వ్లాగర్ పాత్ర చేశాను. నేను చేసే రీల్స్, వ్లాగ్స్ వల్ల కథలో మంచి వినోదం పండుతుంది. సినిమా కోసం సీనియర్ నటీనటులతో కలసి వ్లాగ్ చేయడం కొత్త అనుభూతినిచ్చింది.
సెట్‌లో గోపీచంద్ చాలా తక్కువ మాట్లాడతారు. ఆయన చాలా నెమ్మదస్తుడు. ఆయన గురి పనిపైనే ఉంటుంది. సీన్ సరిగా రాకపోతే ఆయన కళ్లలోనే తెలిసిపోతుంది. సెట్‌లో తోటి నటీనటులకు సహకరిస్తారు.
‘రామబాణం’ సెట్ ఎప్పుడూ పదిమంది కళాకారులతో కళకళలాడుతూ ఉండేది. ఖుష్బూగారు మా అమ్మలా అనిపించారు. నన్ను సొంత కూతురిలా చూసుకున్నారు. కెరీర్‌లో ఎదురయ్యే ఎత్తుపల్లాలను ఎలా తట్టుకోవాలో జగపతిబాబు వివరించారు. అలీ, వెన్నెల కిశోర్, రజిత గార్లతో పనిచేయడం గొప్పగా అనిపించింది.
శ్రీవాస్ గారు పాత్రకు సంబంధించిన ప్రతి విషయం వివరంగా చెప్పేవారు. విశ్వప్రసాద్, వివేక్ గొప్ప నిర్మాతలు.
డ్యాన్స్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు. సొంతంగానే నేర్చుకున్నాను. సిలికానాంద్ర సంస్థ ఏటా వేలాదిమంది కూచిపూడి డ్యాన్సర్లతో కార్యక్రమం నిర్వహించేది. అందులో డ్యాన్సర్‌గా నాకు గిన్నిస్ వరల్డ్ రికార్డు వచ్చింది.
ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనేది నా కోరిక. తమిళ, హిందీ చిత్రాలు చేయడం ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే తెలుగు అమ్మాయిలకు మన ఇండస్ట్రీలో హీరోయిన్లుగా అవకాశాలు పెరుగుతున్నాయి.