Mega Star Chiranjeevi: నేనున్నాను మిత్రమా నీకు, సుధాకర్ కి అండగా చిరంజీవి

ABN , First Publish Date - 2023-06-20T13:23:32+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి తనని ఎన్నోసార్లు ఆదుకున్నారని, అతను తనకి మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి అని, ఇప్పుడు తన కుమారుడి విషయంలో కూడా చిరంజీవే అన్నీ చూసుకుంటారు అని ఒకప్పటి కమెడియన్ సుధాకర్ అన్నారు.

Mega Star Chiranjeevi: నేనున్నాను మిత్రమా నీకు, సుధాకర్ కి అండగా చిరంజీవి
Actor Sudhakar

తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా, మిగతా చిత్ర పరిశ్రమలో కూడా చాలామందిని ఆదుకున్న నటుడు మెగా స్టార్ చిరంజీవి (MegaStarChiranjeevi). ఎన్నో ఏళ్లుగా పరిశ్రమలో నటుడిగానో, సాంకేతిక నిపుణుడుగానో పనిచేసి రిటైర్ అయ్యే పరిస్థితిలో ఆర్థికంగా ఇబ్బంది పడే ఎంతోమందికి చిరంజీవి వ్యక్తిగతంగా వాళ్ళని ఆదుకున్న సంఘటనలు ఎన్నో వున్నాయి. ఇప్పుడు అదే విషయంలో తన చిరకాల మిత్రుడు సుధాకర్ (Sudhakar) కి కూడా అదే చేస్తున్నారు చిరంజీవి.

sudhakar-chiranjeevi.jpg

సుధాకర్, చిరంజీవి రూమ్ మేట్స్, అలాగే వాళ్ళిద్దరూ ఒకే సంస్థలో నటనలో శిక్షణ తీసుకున్నారు. అప్పటినుండి ఇద్దరూ మంచి స్నేహితులు. #Telugu Comedian సుధాకర్, (Comedian Sudhakar) చిరంజీవి కన్నా ముందే పరిశ్రమలోకి అడుగుపెట్టాడు, కొన్ని వందల సినిమాలు చేసాడు. అయితే ఆమధ్య అతని ఆరోగ్యం క్షీణించి కోమాలోకి వెళ్ళినప్పుడు, చిరంజీవి అతనికి ఆర్థికంగా ఎంతో తోడ్పడ్డారు. #TFI కోమా నుండి బైటికి వచ్చి మెల్లగా కోలుకుంటున్న సుధాకర్ ని మొన్న జరిగిన ఫాదర్స్ డే రోజు ఒక ప్రైవేట్ ఛానల్ వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్ళాడు.

ఆ ఫంక్షన్లో సుధాకర్ ని సన్మానించారు, మాటలు మాట్లాడటానికి ఓపిక లేకపోయినా, 'చాలా సంతోషంగా వుంది, అబ్బబ్బ' అంటూ చెప్పారు సుధాకర్. అతనితో పాటు అతని కుమారుడు బెనెడిక్ మైకేల్ కూడా వచ్చారు. అతన్ని త్వరలోనే సినిమాల్లో ఇంట్రడ్యూస్ చేయిస్తానని చెప్పాడు సుధాకర్. తండ్రికి 'హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా' అని చెపుతూ 'ఇప్పుడు ఇంకా నటిస్తావా నాన్నా' అని అడిగితే, 'నేను ఇక నటించను, నువ్వు నటించు' అని కొడుక్కి చెప్పాడు సుధాకర్.

sudhakar-comedian1.jpg

అదే సమయంలో తన కొడుకు ఆరంగేట్రం గురించి సుధాకర్ కొన్ని విషయాలు పంచుకున్నారు. #Megastar చిరంజీవి తనకి మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి అని, ఇంతకు ముందు ఎన్నో సార్లు చిరంజీవి తనకి సహాయం చేసాడని, ఇప్పుడు తన కొడుకుని కూడా చిరంజీవే చూసుకుంటాడు అని సుధాకర్ చెప్పారు. నరేష్ అనే కొత్త దర్శకుడు సుధాకర్ కొడుకు సినిమా మీద స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని తెలిపారు.

Updated Date - 2023-06-20T13:23:32+05:30 IST