Chiranjeevi: నాకు నచ్చితేనే చేస్తాను. నాకు నచ్చితేనే చూస్తాను

ABN , First Publish Date - 2023-08-07T10:07:07+05:30 IST

చిరంజీవి రీమేక్‌ సినిమాలకే పరిమితమవుతున్నారంటూ కొందరు చేస్తున్న కామెంట్స్‌కు చిరంజీవి స్పందించారు. తనదైన శైలిలో దీటైన సమాధానమిచ్చారు. తాజాగా ఆయన నటించిన చిత్రం భోళా శంకర్‌ తమన్నా కథానాయిక. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహించారు. రాంబ్రహ్మం సుంకర నిర్మాత. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా

Chiranjeevi: నాకు నచ్చితేనే చేస్తాను. నాకు నచ్చితేనే చూస్తాను

చిరంజీవి(Chiranjeevi) రీమేక్‌ సినిమాలకే పరిమితమవుతున్నారంటూ కొందరు చేస్తున్న కామెంట్స్‌కు చిరంజీవి స్పందించారు. తనదైన శైలిలో దీటైన సమాధానమిచ్చారు. తాజాగా ఆయన నటించిన చిత్రం భోళా శంకర్‌(Bhola Shankar). తమన్నా కథానాయిక. మెహర్‌ రమేశ్‌ (meher ramesh) దర్శకత్వం వహించారు. రాంబ్రహ్మం సుంకర నిర్మాత. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో చిరంజీవి మాట్లాడారు.

‘నాకు నచ్చితేనే చేస్తాను. నాకు నచ్చితేనే చూస్తాను’ అని నా ‘ఖైదీ నం. 150’లో డైలాగ్‌ ఉంది. ‘భోళాశంకర్‌’ నాకు నచ్చింది కాబట్టే చేశాను. నాకు నచ్చింది కాబట్టే చూశాను. ఈ సినిమా మీకూ నచ్చుతుందని ఆశిస్తున్నా. ‘రీమేకులే చేస్తారేంటి’ అని చాలామంది కామెంట్స్‌ చేస్తున్నారు. మంచి కంటెంట్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నం చేస్తే తప్పేంటో నాకు అర్థం కావట్లేదు. ఓటీటీ అందుబాటులోకి వచ్చాక ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా మాతృక చిత్రం ‘వేదాళం’ ఏ ఓటీటీలోనూ లేదు. ఎవరూ చూసి ఉండరనే ధైర్యంతోనే దర్శకుడు మెహర్‌ రమేశ్‌, నిర్మాత అనిల్‌ సుంకర నా దగ్గరకు వచ్చారు. ‘ఇటీవల ‘లూసిఫర్‌’ కమిట్‌ అయ్యా. మళ్లీ రీమేక్‌ అంటే ఫ్యాన్స్‌ గొడవ చేస్తారు’ అని చెప్పా. ‘మంచి కథని ఎందుకు రీమేక్‌ చేయకూడదు. మీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దాన్ని అందించకూడదా?’ అని సందేహం వ్యక్తం చేశారు. ఏ ఓటీటీలోనూ ‘వేదాళం’ లేదని తెలుసుకున్నాకే, ఎందుకు చేయకూడదని అనిపించింది. కొన్ని సినిమాలు చేసేటప్పుడు అవుట్‌పుట్‌ ఎలా వస్తుందోనని టెన్షన్‌ ఉంటుంది. కానీ, ఈ సినిమా విషయంలో అలా కాదు. ప్రతి రోజూ సరదాగా ఉన్నాం. ‘ఈ సినిమా సూపర్‌హిట్‌’ అని మా అందరి మనసులో నాటుకుపోయింది. ఆ ఫీలింగే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మెహర్‌ చిన్నప్పటి నుంచీ తెలుసు. నన్ను గమనిస్తూ తను చిత్ర పరిశ్రమలోకి వచ్చాడు. ‘చిరంజీవి అన్నయ్య, పవన్‌ కల్యాణ్‌ తెలుసు’ అనే రికమెండేషన్లు లేకుండా స్వయంకృషితో దర్శకుడి మారాడు. ‘ఈ ఇండస్ర్టీ ఏ ఒక్కరి సొత్తు కాదు. టాలెంట్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ ఇక్కడ స్థానం ఉంటుంది’ అని తమ్ముడు కల్యాణ్‌ ‘బ్రో’ సినిమా వేడుకలో అన్నాడు. నేనూ అదే చెబుతున్నా. మా ఇంటి హీరోలను మేం పుష్‌ చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. కష్టపడండి అని చెప్పామంతే! యంగ్‌ టాలెంట్‌ వస్తుందంటే దాన్ని ప్రేక్షకులకు చేరువ చేేసందుకు మా ఇమేజ్‌ ఉపయోగపడుతుందంటే సపోర్ట్‌ చేయడానికి ముందుంటాం. అలాంటి వారికి చేయూతనివ్వడాన్ని బాఽధ్యతగా భావిస్తా. సిననిమాల్లోకి కొత్తతరం రావాలి. వారి ఆలోచనలతో సినిమా పరిశ్రమ మరింత ఎత్తుకు ఎదగాలి. మా సీనియర్ల వల్ల కాదు యంగ్‌స్టర్స్‌ వల్లే ఇండస్ర్టీ కొత్త పుంతలు తొక్కుతోంది. నమ్మి అడుగుపెడితే ఈ పరిశ్రమ మీకు గొప్ప జీవితాన్ని అందిస్తుంది. చిత్రపరిశ్రమ ఒక పుష్పక విమానం, అక్షయ పాత్రలాంటిది. ఎంతమంది వచ్చిన అక్కున చేర్చుకుంటుంది’’ అని అన్నారు.


2.jpg

ఈతరం వారు కూడా...

‘‘అమ్మ ప్రేమ ఎప్పటికీ బోర్‌ కొట్టదు. అభిమానుల ప్రేమ కూడా అంతే. సినిమా అయినా, సామాజిక కార్యక్రమం అయినా నా ఫ్యాన్స్‌ గర్వపడేలా ఉండాలనుకుంటా. వారి కోసం నా వ్యక్తిత్వాన్ని, నడవడికను మార్చుకుంటూ వచ్చా. నాలుగు దశాబ్దాల నుంచి నాతో ప్రయాణిస్తున్న ఫ్యాన్స్‌తోపాటు ఈతరం యువత నా సినిమా వేడుకకు వచ్చారంటే ఆ ప్రేమని ఏమని వర్ణించను. అభిమానుల వల్లే ఈ స్థాయిలో ఉన్నాను’’అని చిరంజీవి చెప్పారు.

Updated Date - 2023-08-07T10:07:07+05:30 IST