Chandramohan: నా ఫేవరెట్ యాక్టర్ చంద్రమోహన్: జయసుధ

ABN , First Publish Date - 2023-11-11T12:01:37+05:30 IST

సీనియర్ నటి జయసుధ చంద్రమోహన్ తో చాలా సినిమాలు చేశారు. చంద్రమోహన్ తన ఫేవరెట్ నటుడు అని కూడా చెప్పారు, అలాగే తాను నిర్మాతగా ఏడు సినిమాలు చేస్తే, అందులో ఐదు సినిమాల్లో చంద్రమోహన్ నటించారని చెప్పారు జయసుధ. ఆమె చంద్రమోహన్ గురించి కొన్ని సరదా విశేషాలు పంచుకున్నారు.

Chandramohan: నా ఫేవరెట్ యాక్టర్ చంద్రమోహన్: జయసుధ
Chandramohan is my favourite actor, says Jayasudha

సీనియర్ నటుడు చంద్రమోహన్ (Chandramohan passed away on Saturday in Hyderabad) శనివారం ఉదయం హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 80 ఏళ్ల చంద్రమోహన్ 1966 లో 'రంగులరాట్నం' #RangulaRatnam అనే సినిమా ద్వారా చిత్రపరిశ్రమకి పరిచయం అయ్యారు. తన మొదటి సినిమా నుండే చంద్రమోహన్ ఒక మంచి నటుడిగా అనిపించుకుని కొన్ని దశాబ్దాల పాటు కొన్ని వందల సినిమాల్లో వివిధ రకాలైన, వైవిధ్యం వున్న ఎన్నో పాత్రలు చేశారు.

అప్పట్లో చంద్రమోహన్ పక్కన ఏ నటీమణి చేసిన ఆమె అచిరకాలంలోనే పెద్ద స్థాయికి వెళ్ళిపోయేవారు. జయసుధ (Jayasudha), జయప్రద (Jayaprada), శ్రీదేవి (Sridevi), రోజారమని (Rojaramani), ప్రభ (Prabha), రాధిక (Radhika), విజయశాంతి (Vijayashanthi) ఒకరేంటి చాలామంది ముందుగా చంద్రమోహన్ తో నటించి తరువాత చాలా పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళు. అందులో జయసుధ అయితే చంద్రమోహన్ తో చాలా ఎక్కువ సినిమాల్లో నటించారు, అలాగే అతన్ని తన కుటుంబలో ఒకరుగా భావించేవారు.

jayasudha4.jpg

'చాలాసార్లు నేను చెప్పాను నా ఫేవరెట్ నటుడు చంద్రమోహన్ అని. అతను ఎటువంటి పాత్ర అయినా చాలా సునాయాసంగా చెయ్యడమే కాకుండా, ఆ పాత్రకి గొప్ప ఔన్నిత్యాని తెచ్చేవారు. నేను నిర్మాతగా మారి సుమారు ఏడు సినిమాలు చేసాను, అందులో అయిదు సినిమాల్లో చంద్రమోహన్ వున్నారు, అతను ఒక అద్భుత నటుడు. అటువంటి నటుడుని ఈరోజు మనం కోల్పోయాం, అది దురదృష్టం," అని చెప్పారు జయసుధ.

సెట్స్ లో ఎంతో సరదాగా ఉండేవారు చంద్రమోహన్, ఎప్పుడూ తన పని తాను చేసుకు పోయేవారు, వేరే వాళ్ళ జీవితంలోకి ఎప్పుడూ కలుగచేసుకోలేదు. వేరేవాళ్లకి సలహాలు ఇవ్వడం కానీ, తీసుకోవటం కానీ ఎప్పుడూ చేసేవారు కాదు, ఎందుకంటే అతను ఎప్పుడూ తన పని మీదే దృష్టి పెట్టేవారు, వేరే వాళ్ళ విషయాలు పట్టించుకునేవారు కాదు, అని చెప్పారు జయసుధ.

"నన్ను అతను ఎప్పుడూ తన కుటుంబ సభ్యురాలిగానే చూసేవారు. అతను మంచి భోజన ప్రియుడు. మా సొంత బ్యానర్ లో అతను నటించినప్పుడు మాత్రం, చంద్రమోహన్ కి ఏది ఇష్టమో, అతను ఏది కావాలంటే అది చెయ్యమని చెప్పేవాళ్ళం. అలాగే నన్ను వంట బాగా చేస్తావు, ఇంటిదగ్గర చేసినవి తీసుకురా అని చెపుతూ ఉండేవారు," అని జయసుధ చెప్పారు. అలాగే అప్పట్లో విమానాల్లో ప్రయాణం చేసేటప్పుడు ఫుడ్ కూడా ఇచ్చేవారు. మేము అందరం ఒకే విమానంలో ప్రయాణం చేసేటప్పుడు నేను విమానంలో ఇచ్చిన ఫుడ్ ఎక్కువ తినేదానిని కాదు, అప్పుడు చంద్రమోహన్ అలా వేస్ట్ చెయ్యడం ఎందుకు, నాకు ఇవ్వు అని తాను తీసుకునే వారు. ఇవన్నీ సరదాగా ఉండేది అప్పట్లో, అని అప్పటి జ్ఞాపకాలని నెమరు వేసుకున్నారు జయసుధ.

నేను, చంద్రమోహన్ చాలా సినిమాలు చేసాము. మా సినిమాల్లో పాటలు కూడా చాలా పెద్ద హిట్ అయ్యేవి. 'ఇంటింటి రామాయణం', 'ప్రాణం ఖరీదు', 'పక్కింటి అమ్మాయి', 'గోపాలరావుగారి అమ్మాయి', 'అమ్మాయిమనసు', 'శ్రీమతి ఒక బహుమతి, 'స్వర్గం', 'కలికాలం', ఒకటేమిటి ఎన్నో సినిమాలు ఇద్దరం కలిసి చేసాం. అన్నీ సినిమాలు అద్భుతమైనవే, అన్నీ చాలా బాగా ఆడినవే. అతను చాలా గొప్ప నటుడు, మొదటి సినిమా నుండి ఈరోజు వరకు ఎక్కడా బ్రేక్ లేకుండా సినిమాలలో వివిధ రకాలైన పాత్రలు చేస్తున్న నటుడు చంద్రమోహన్. అందుకే అతను నా ఫేవరెట్ నటుడు, అని చెప్పారు జయసుధ. నా మొదటి హీరో కూడా అతనే అని చెప్పారు జయసుధ.

Updated Date - 2023-11-11T12:04:00+05:30 IST