Sukumar: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దాసరి తరువాత సుకుమార్ కే ఆ గౌరవం అంటున్నారు

ABN , First Publish Date - 2023-04-26T14:49:19+05:30 IST

దాసరిని 'గురువుగారు' అని పరిశ్రమలో పిలుచుకునేవారు. ఎందుకంటే అతని దగ్గర పనిచేసిన ఎంతోమందికి అతను ప్రోత్సాహం ఇచ్చి ముందుకు నడిపించాడు. మరి ఈ తరంలో ఇప్పుడు సుకుమార్ కూడా అదే కోవలో వెళుతూ...

Sukumar: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దాసరి తరువాత సుకుమార్ కే ఆ గౌరవం అంటున్నారు

దివంగత దర్శక రత్న దాసరి నారాయణ రావు (Dasari Narayana Rao) తెలుగు సినిమా పరిశ్రమలో మర్చిపోలేని పేరు. ఎందుకంటే 150కి పైగా సినిమాలకి దర్శకత్వం వహించటమే కాకుండా, సినిమా క్రాఫ్ట్స్ అన్నిటిమీద కమాండ్ వున్న ఏకైక వ్యక్తి అతను. దర్శకత్వంతో పాటు నటన, రచన, మాటలు, పాటలు, సంగీతం, ఒకటేమిటి అన్నీ చెయ్యగల సత్తా వున్న మనిషి దాసరి. ఎంతోమంది నటీనటులను తెలుగు తెరకి పరిచయం చేసిన వ్యక్తి కూడా దాసరే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దాసరి శిష్యులు కూడా చాలామంది తెలుగు పరిశ్రమలో దర్శకులుగా స్థిరపడ్డారు, అందులో కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) లాంటి దర్శకుడు వంద సినిమాలకి పైగా కూడా దర్శకత్వం వహించారు. దాసరిని అందుకే ప్రేమగా అందరూ గురువుగారు (Guruvugaaru) అని పిలుచుకుంటూ ఉండేవారు.

pushpa2sukumar2.jpg

అయితే మళ్ళీ అలాంటి వైభవం అగ్ర దర్శకుడు సుకుమార్ (Sukumar) కి దక్కింది అని పరిశ్రమలో అంటున్నారు. అతను అగ్ర దర్శకుల్లో ఒకడుగా ఎదగడమే కాకుండా, తన శిష్యులను కూడా ఎంతో ప్రోత్సహిస్తూ తనలాగే ఎదగడానికి చేయూత నిస్తున్న దర్శకుడు సుకుమార్. తన శిష్యులనే కాదు, కొత్తవారు ఎవరైనా ప్రోత్సాహం ఇస్తూ ముందుకు నడిపించే వ్యక్తి సుకుమార్. అందులో విరూపాక్ష దర్శకుడు ఒకడు. గత వారం విడుదల అయిన 'విరూపాక్ష' (Virupaksha) దర్శకుడు కార్తీక్ దండు (Karthik Dandu), ఇది ఇతనికి రెండో సినిమా. సుకుమార్ అతని కథ వినగానే ఇది హిట్ అవుతుంది అని నమ్మి అతనికి ప్రోత్సాహం ఇవ్వటమే కాకుండా, తనే స్క్రీన్ ప్లే కూడా అందించాడు, నిర్మాతల్లో కూడా భాగం అయ్యాడు. ఈ సినిమా అయిదు రోజుల్లో ఎంత కలెక్షన్ల వర్షం కురిపించిందో అందరికీ తెలిసిందే.

karthikdandu.jpg

లెక్కల మాష్టారుగా అతని శిష్యులకు పరిచయం అయిన సుకుమార్ అతడిని ఒక్కడినే కాదు చాలామందిని ఇలా దర్శకులుగా పరిచయం చేస్తూనే వున్నాడు. కొన్ని రోజుల క్రితం విడుదల అయిన నాని (Nani) నటించిన 'దసరా' (Dasara) సినిమా విజయవంతం అయిన సంగతి తెలిసిందే కదా. ఆ చిత్రానికి దర్శకుడు అయిన శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కూడా మన లెక్కలు మాష్టారి శిష్యుడే. ఇది శ్రీకాంత్ మొదటి సినిమా దర్శకుడిగా.

srikanthodela.jpg

ఆమధ్య 'ఉప్పెన' (Uppena) అనే సినిమా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరగదీసింది కదా. ఇందులో లీడ్ పెయిర్ వైష్ణవ తేజ్ (Vaishnav Tej), కృతి శెట్టి (Krithy Shetty) ఇద్దరూ కొత్తవారే, ఆ ఇద్దరినీ పరిచయం చేసిన దర్శకుడు బుచ్చిబాబు (Buchibabu) కి కూడా అదే మొదటి సినిమా. మరి ఈ బుచ్చిబాబు కూడా దర్శకత్వం ఎక్కడ చదివాడు అనుకుంటున్నారు, మన లెక్కల మాష్టరు సుకుమార్ దగ్గరే. సుకుమార్ ఎంత ఎత్తుకి ఎదిగినా, అంత కిందకి వంగి ఎలా ఉంటాడో, ఈ బుచ్చిబాబు కూడా అంతే. అంత పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు అయినా గురువుకు మల్లే చాలా సౌమ్యంగా, వినయంగా, తక్కువ మాట్లాడుతూ మామూలుగా ఉంటాడు.

buchibabu.jpg

ఇంకో సినిమా '18 పేజెస్' (18Pages) అని వచ్చింది. ఇందులో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran) కథానాయకుడు, నాయక లుగా వేశారు. ఈ సినిమా కూడా బాగానే ఆడింది, మంచి ప్రాఫిట్స్ తెచ్చి పెట్టింది. ఈ సినిమాకి దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ (Palnati Surya Pratap). ఇది ఇతనికి మొదటి సినిమా కాదు, కానీ ఇతను కూడా సుకుమార్ శిష్యుడే. ఇతని సినిమా 'కుమారి ఎఫ్21' (Kumari F21) అందరికీ గుర్తుంది కదా, ఆ సినిమాని ఈ సూర్య ప్రతాప్ దర్శకత్వం చేసిందే. ఆ సినిమాని నిర్మించింది ఆ దర్శకుడి గురువుగారు సుకుమార్. అది ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే.

palnatisuryapratap.jpg

ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వుంటారు. ఒక దర్శకుడు తాను ఎదగడం కాదు, తన దగ్గర పని చేసిన వాళ్ళని కూడా ప్రోత్సహించినప్పుడే ఆ దర్శకుడి పేరు మారుమోగుతోంది, అతనంటే పరిశ్రమలో ఒక గౌరవ భావం ఏర్పడుతుంది. ఈరోజు ఎంతమంది ఇలా పెద్ద దర్శకుల దగ్గర పనిచేసిన వాళ్ళు ఇంతటి హిట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అంటే, ఒక్క సుకుమార్ తప్ప ఇంకెవరూ కనిపించటం లేదనే చెప్పాలి. సుకుమార్ తన దగ్గర పని చేసే దర్శకులు కొత్త కథతో వచ్చి తాము మొదటి సినిమాకి దర్శకత్వం చేస్తున్నాం అని చెప్పినపుడు, 'అల్ ది బెస్ట్' అని చెప్పటమే కాదు, వాళ్ళకి సరి అయిన గైడెన్స్, సూచనలు ఇచ్చి అవసరం అయితే కథలో కూడా తగు సూచనలు చెప్పి, ప్రోత్సహిస్తున్న సుకుమార్ 'గురువుగారు' పదానికి నిజమైన నిదర్శనం. ఇలా చాలామంది అతని శిష్యులు మరిన్ని మంచి సినిమాలతో వస్తారని ఆశిస్తూ..

Updated Date - 2023-04-26T14:51:36+05:30 IST