అదృష్టానికి సరికొత్త నిర్వచనం
ABN, First Publish Date - 2023-06-01T00:01:22+05:30
మే 31 అనగానే చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఎందుకంటే అది హీరో కృష్ణ పుట్టినరోజు. ఆ రోజు కోసం నాలాంటి కృష్ణ అభిమానులంతా ఆశగా ఎదురు చూసేవాళ్లం.....
మే 31 అనగానే చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఎందుకంటే అది హీరో కృష్ణ పుట్టినరోజు. ఆ రోజు కోసం నాలాంటి కృష్ణ అభిమానులంతా ఆశగా ఎదురు చూసేవాళ్లం. మరో విషయం ఏమిటంటే మా హీరో పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో 30 -40 పేజీలతో సప్లిమెంట్ వేసేవారు. అందులో కృష్ణగారు నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అడ్వర్‌టైజ్‌మెంట్సే కాకుండా ఆయన అంగీకరించిన కొత్త చిత్రాల వివరాలు ఉండేవి. అందుకే మే 30 తేదీ సాయంత్రం నుంచే అభిమానుల్లో హడావిడి మొదలయ్యేది. ఈవెనింగ్ ఎడిషన్ కోసం షాపుల ముందు క్యూ కట్టిన వాళ్లలో నేనూ ఒకడిని.
ఒకరకంగా చెప్పాలంటే మే 31 కృష్ణ అభిమానులకు పండగ రోజు. ఆ రోజు కోసం వారంతా ఎంతో ఆశగా ఎదురు చూసేవారు. హీరోగా చాలా బిజీగా ఉన్న రోజుల్లో మే నెల వస్తోందంటే చాలు నెల, నెలన్నర రోజులు ఊటీలో ఉండేలా కృష్ణగారు తన చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకునేవారు. పుట్టిన రోజున ఆయన అక్కడే ఉండడంతో అభిమానులు బస్సులు వేసుకుని ఊటీ చేరుకొనేవారు. దాదాపు పాతికేళ్ల పాటు ఇంత వైభవంగా, వేడుకగా ఆయన పుట్టిన రోజు జరిగేది. కృష్నగారు లేకుండా అభిమానులు జరుపుకొంటున్న ఆయన తొలి పుట్టిన రోజు ఇదే అని తలుచుకుంటే మనసు అంతా ఎంతో వెలితిగా అనిపిస్తుంది.
సాహసం.. ఆత్మవిశ్వాసం
తెలుగు చలనచిత్ర చరిత్రలో అదృష్టానికి ఒక సరికొత్త నిర్వచనం చెప్పి, సాహసానికి అంతులేని బలం ఇచ్చిన హీరో కృష్ణ. ఆయనకు తన మీద తనకు ఎంతో భరోసా. ఏది ఏమైనప్పటికీ బాధ లేదనే ఆత్మ విశ్వాసం ఆయన అభరణం. ఆ ఆత్మవిశ్వాసంతోనే తెరపై ఎన్నో సాహసాలు చేశారు కృష్ణ. ఇక నిర్మాతగా ఆయన చేసిన సాహసాలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కృష్ణలో సినిమా తీసి వ్యాపారం చేద్దాం అనే నిర్మాత కంటే సాహసం చేసి సంచలనం సృష్టిద్దాం అనే ప్రొడ్యూసర్ కనిపిస్తాడు. అందుకే నిర్మాతగా మరే హీరో చేయని సాహసాలు ఆయన చేశారు. సాంకేతికంగా తెలుగు సినిమాను పరుగులేత్తించారు.
సత్యచిత్ర అధినేతలు లెజెండ్ ఎన్టీఆర్ హీరోగా ‘అడవిరాముడు’ చిత్రం నిర్మించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక కృష్ణగారితో మూడు పాత్రలు వేయించి ‘కుమారరాజా’ వంటి హిట్ సినిమా తీశారు. ఆ గౌరవంతోనే ఆ సంస్థకు మరో మూడు చిత్రాలు చేశారు కృష్ణ. వాటిల్లో ‘ఉద్దండుడు’ ఒకటి. ఈ సినిమా కథ వినకుండానే సత్యచిత్ర సంస్థ మీద ఉన్న గౌరవంతో డేట్స్ ఇచ్చారు. షూటింగ్ రెండో రోజున రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆయనకు కథ వినిపించారు. విన్న వెంటనే ‘ ఈ కథ నిర్మాతలు విన్నారా?’ అని అడిగారు కృష్ణగారు. ‘వాళ్లు విన్నారు.. వాళ్లకి బాగా నచ్చింది కూడా’ అని గోపాలకృష్ణ చెప్పారు. ‘వాళ్లకు నచ్చితే ఓకే.. కానీ ఈ సినిమా ఆడదు’ అని నిర్మొహమాటంగా చెప్పారు కృష్ణ. ఆయన చెప్పినట్లుగానే ఆ సినిమా ప్లాప్ అయింది. ‘తన సినిమా ప్లాప్ అయింది’ అని అందరికంటే ముందుగానే చెప్పగలిగిన ఏకైక నటుడు కృష్ణే.
అలాగే తెలుగులో మల్టీస్టారర్ చిత్రాల్లో నటించిన హీరో కృష్ణగారే. ఇద్దరు హీరోలు ఉంటే తన పాత్ర తక్కువ అవుతుందేమోనని ఆయన సందేహించేవారు కాదు. తన సీనియర్స్‌తోనూ, సమకాలికులతోనూ, జూనియర్స్‌తోనూ మల్టీస్టారర్స్ చేసిన ఏకైక హీరో ఆయన. అలాగే ఎన్టీఆర్ తర్వాత తెలుగులో ఆ స్థాయిలో అభిమానులు ఉన్నది కృష్ణగారికి మాత్రమే. పాతికేళ్లుగా ఆయన నటనకు దూరంగా ఉన్నా అభిమానులు మాత్రం ఆయనకు దూరం కాలేదు. ఒక దైవంలా ఇప్పటికీ ఆయన్ని ఆరాధిస్తుంటారు. ‘కృష్ణుడి పేరు చెప్పగానే రామారావుగారు ఎలా గుర్తుకు వస్తారో, అల్లూరి సీతారామరాజు పేరు చెప్పగానే కృష్ణగారు గుర్తుకు వస్తారు ..’ అని మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాట నూటికి నూరుపాళ్లు నిజం. ఆయన్ని హీరో కృష్ణ అంటారు. నటశేఖర కృష్ణ అంటారు. సూపర్ స్టార్ కృష్ణ అని కూడా పిలుస్తారు. కృష్ణ పేరు చెప్పకుండానే వీటిల్లో ఏ పేరు చెప్పినా ఆయనే గుర్తుకు వస్తారు. ప్రతి ఏడాది మే 31న ఆయన్ని కలసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేవాణ్ణి. ఈ ఏడాది ఆయన లేకపోవడం దురదృష్టకరం.
బుద్దా వెంకన్న
శాసనమండలి మాజీ సభ్యుడు