విరూపాక్ష సక్సెస్‌కు కారణం అదే

ABN , First Publish Date - 2023-04-25T23:31:43+05:30 IST

రెగ్యులర్‌ ఫార్మాట్‌కు భిన్నంగా వెళ్లి హారర్‌ జానర్‌ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించడం ఏటికి ఎదురీతే..

విరూపాక్ష సక్సెస్‌కు కారణం అదే

రెగ్యులర్‌ ఫార్మాట్‌కు భిన్నంగా వెళ్లి హారర్‌ జానర్‌ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించడం ఏటికి ఎదురీతే. దర్శకుడిగా తొలినాళ్లలోనే ఈ అరుదైన ఘనతను అందుకున్నారు కార్తీక్‌ దండు. సాయితేజ్‌ హీరోగా ఆయన రూపొందించిన ‘విరూపాక్ష’ చిత్రానికి తెలుగునాట ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పరిమిత బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేస్తూ, రూ. వంద కోట్ల క్లబ్‌వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ సందర్భంగా కార్తిక్‌ దండు ‘విరూపాక్ష’ విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

బాల్యం నుంచి నాకు థ్రిల్లర్‌, హారర్‌ చిత్రాలు అంటే చాలా ఇష్టం. ఈ మధ్య కాలంలో హారర్‌ కామెడీ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. వాటికి భిన్నంగా పూర్తిస్థాయి హారర్‌ మూవీ తీద్దామనిపించింది. గతంలో గుజరాత్‌లో ఓ మహిళను చేతబడి నెపంతో చంపేసిన ఘటన పేపర్‌లో చదివాను. ఆ సంఘటన స్ఫూర్తిగా ‘విరూపాక్ష’ కథను అల్లుకున్నాను.

దెయ్యాలు ఉంటేనే హారర్‌ చిత్రమని కాదు. వెన్నులో వణుకు పుట్టించే ప్రతిదీ హారర్‌ చిత్రమే. ఈ చిత్రంలో దెయ్యం ఎక్కడా కనిపించదు. కానీ ప్రేక్షకులు ఆ అనుభూతిని మాత్రం ఫీలవుతున్నారు. ఈ సినిమా సక్సెస్‌కు అదే కారణం.

ఫ కథ రాసుకున్నాక తక్కువ బడ్జెట్‌లో తీద్దామనుకున్నాను. సుకుమార్‌గారిని కలిశాక సినిమా స్థాయి పెరిగింది. ఆయన సూచన మేరకు సాయితేజ్‌, ప్రసాద్‌ గార్లు ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. నా కథకు సుకుమార్‌ స్ర్కీన్‌ప్లే రాశారు. ఆరేడు వెర్షన్లు సిద్ధం చేసి, అందులో బెస్ట్‌ ఎంపిక చేశారు. క్లైమాక్స్‌లో ప్రేక్షకులను థ్రిల్‌ చేసే విధంగా స్ర్కీన్‌ప్లేలో ఆయన మార్పులు చేశారు.

షూటింగ్‌ మొదలుపెడదాం అనుకునే సరికి సాయితేజ్‌కు యాక్సిడెంట్‌ అయింది. ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని తెలిశాక ఊపిరి పీల్చుకున్నా. మొదట్లో చిత్రీకరణ చేసేటప్పుడు సాయితేజ్‌ కొంత ఇబ్బందిపడ్డారు. కానీ త్వరలోనే పుంజుకొని మునుపటిలా ఎనర్జిటిక్‌గా నటించారు.

సంయుక్తను నేనే ఎంపిక చేశాను. హీరోయిన్‌ పాత్రకు ఆమె న్యాయం చేస్తుందనుకున్నాను.

సుకుమార్‌గారికి సినిమా బాగా నచ్చింది. మంచి సినిమా తీసినందుకు గర్వపడుతున్నారు. త్వరలో ‘విరూపాక్ష’ను ఇతర భాషల్లోనూ విడుదల చేస్తున్నాం. రవితేజ, కల్యాణ్‌రామ్‌, దిల్‌రాజు తదితరులు మెచ్చుకున్నారు.

Updated Date - 2023-04-26T10:18:07+05:30 IST