Aadikeshava: సినిమా గురించి సంచలన విషయాలు బయటపెట్టిన దర్శకుడు

ABN , First Publish Date - 2023-11-23T13:16:43+05:30 IST

'ఆదికేశవ' సినిమా దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి, ఆ సినిమా ఎలా మొదలయింది, దాని వెనకాల ఎంత కథ నడిచింది అనే ఆసక్తికరమైన విషయాలు 'చిత్రజ్యోతి' తో పంచుకున్నాడు

Aadikeshava: సినిమా గురించి సంచలన విషయాలు బయటపెట్టిన దర్శకుడు
Aadikeshava film director Srikanth Reddy

టాలీవుడ్ లో దర్శకుడిగా పేరు నమోదు చేసుకోవడం అంత సులువైన పని కాదు. ఎంతోమంది పరిశ్రమకి వస్తూ, కథలు వినిపిస్తూ, నిర్మాతలు, నటుల దగ్గరికి వెళుతూ ఎప్పుడు తమ కథ సినిమాగా రూపాంతరం చెందుతుందా అని ఎదురు చూస్తూ వుంటారు. కొందరికి తొందరగా అవకాశం వస్తుంది, కొందరికి కొంచెం ఆలస్యం వస్తుంది, కొందరికీ అన్నీ అనుకూలంగా ఉండేవిధంగా తమ మొదటి సినిమా ఉంటుంది. ఈ మూడో కోవలోకి వస్తాడు శ్రీకాంత్ రెడ్డి, 'ఆదికేశవ' సినిమా దర్శకుడు. #Aadikeshava

aadikeshavafilmdirectorsrik.jpg

పరిశ్రమకి రాకముందు షార్ట్ ఫిలిమ్స్ చేసాడు శ్రీకాంత్, అవన్నీ చాలా వైరల్ అవుతూ వున్నాయి. తిరుపతిలో ఇంజనీరింగ్ చదివాడు, కమెడియన్ నటుడు సుదర్శన్ కి ఇతను రూమ్ మేట్. తరువాత దర్శకుడు సుధీర్ వర్మ (SudheerVarma) దగ్గర సహాయ దర్శకుడిగా చేరాడు. మొదటి సినిమా 'అహం బ్రహ్మాస్మి' #AhamBrahmasmi మంచు మనోజ్ (Manchu Manoj) కథానాయకుడిగా పూజతో మొదలయింది, కానీ సినిమా జరగలేదు. ఆ కథ మీ దగ్గరే ఉందా అని శ్రీకాంత్ ని అడిగితే, "లేదు, ఆ కథ మనోజ్ అన్నకి ఇచ్చేసా, అతని దగ్గరే వుంది", అని చెప్పాడు. (Aadikehsava director Srikanth Reddy)

ఆ సినిమా ఆగిపోయిన తరువాత ఇంకో సినిమా ప్లాన్ చేసాడు శ్రీకాంత్. ఇది కొంచెం ప్రయోగాత్మకమైన కథ. ఒక వ్యక్తికీ రెండు బ్రైన్స్ ఉంటాయి, ఉదయం సాఫ్ట్ వెర్ ఉద్యోగిగా, రాత్రి అయ్యేసరికి రౌడీ లా ఉంటాడు. అయితే ఇది కొంచెం ప్రయోగాత్మకం వద్దు అన్నారు. అప్పుడు తన స్నేహితుడు నటుడు సుదర్శన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తీసుకొని ఒక కథ ప్లాన్ చేసాడు. దీనికి 'డిజాస్టరస్ వెడ్డింగ్' అని టైటిల్ కూడా అనుకున్నాం. 'బెదురులంక' #Bedurulanka నిర్మాత బెన్నీ (Benni) కథ విని చేద్దాం అన్నారు," అని చెప్పాడు శ్రీకాంత్.

aadikeshavafilm.jpg

సుదర్శన్ కి పెళ్ళైన తరువాత అతని భార్య ఒక ఫంక్షన్ కి వెళ్ళడానికి తన బ్లౌజ్ ఆల్టర్ కి ఇచ్చారు. అది సుదర్శన్ ని వెళ్లి తీసుకురమ్మని చెప్పారు. "నేను సుదర్శన్ వెళ్ళాము, నేను కారులో వున్నా, సుదర్శన్ షాపుకి వెళ్లి అడిగాడు. ఆ బ్లౌజ్ ఆల్టర్ చెయ్యడానికి అయ్యే ఖర్చు రూ.17,500 అని చెప్పాడు షాపువాడు. సుదర్శన్ షాకయ్యి, నాకు ఫోన్ చేసి 'ఏంటిరా ఇది, ఒక బ్లౌజ్ ఆల్టర్ చెయ్యడానికి రూ. 17,500. ఈ డబ్బుతో అమ్మకి ఎన్ని చీరలు కొనొచ్చు" అని చెప్పాడు. తరువాత భార్యకి ఫోన్ చేసి మాట్లాడేడు. షాపుకి వెళ్లి అడిగితే, కుడి చెయ్యి వేపు ఆల్టర్ అయింది, బ్యాక్ ఆల్టర్ అయింది, ఎడం బుజం ఇంకా పని వుంది అని చెప్పాడు బ్లౌజ్ గురించి.

srikanthdirector.jpg

సుదర్శన్ వెంటనే పదివేలు ఇచ్చేసి, ఎడమ బుజం అవకపోయినా పరవాలేదు ఇచ్చేయండి, ఎందుకంటే చీర కట్టుకొని ఆ పైట ఎడం బుజం మీద వేసుకుంటుంది, అప్పుడు అది కనపడదు, మీరు చేసింది చాలు ఇచ్చేయండి అని తీసుకున్నాడు. అతని జీవితంలో ఇలాంటి సంఘటనలు కొన్ని తీసుకొని కామెడీ కథ రాసా. కానీ నిర్మాత బెన్ని స్నేహితులు మాత్రం ఎందుకో ఆ సినిమా వద్దు అని సలహా ఇచ్చారు, దానితో ఆ సినిమా ఆగింది. వ్యాపారాత్మకమైన సినిమా చేద్దాం అని అతను చెప్పాడు, అప్పుడు ఈ 'ఆదికేశవ' #Adikeshava చెప్పాను. అతనికి నచ్చింది, వైష్ణవ తేజ్ తో చేద్దాం అని చెప్పారు.

"ముందుగా నాగవంశీ కి కథ వినిపించు అతను నాకు మంచి స్నేహితుడు అని అతని దగ్గరికి పంపాడు. నేను అప్పుడు 'భీమ్లా నాయక్' #BheemlaNayak షూటింగ్ లో వున్న నాగవంశీ కి కథ వినిపించాను, అతనికి నచ్చింది, బాబాయి (చినబాబు) కి కూడా నేరేట్ చెయ్యి అన్నాడు. చినబాబుగారికి కూడా కథ నచ్చింది, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి కూడా ఒకసారి చెప్పి చూద్దాం అన్నారు అతను," అని తన మొదటి సినిమా గురించి చెప్పాడు శ్రీకాంత్. తరువాత వైష్ణవ తేజ్ కి కూడా కథ చెపితే, అతనికి కూడా నచ్చింది.

aadikeshavafilmstill.jpg

కథ చెప్పినప్పుడే నాగవంశీ ఈ సినిమా వైష్ణవ తేజ్ (Vaishnav Tej), శ్రీలీల (Sreeleela) తో చేస్తున్నాం అని చెప్పారు. తరువాత త్రివిక్రమ్ గారిని కలిసి కథ చెప్పాను, అతను అంతా విని బాగుంది అన్నారు, చివర్లో చిన్న మార్పు చెప్పారు అని చెప్పాడు శ్రీకాంత్. "త్రివిక్రమ్ గారితో మాట్లాడుతూ ఉంటే, బయటకి రావాలనిపించదు, అతనితో మాట్లాడుతూ అక్కడే ఉండి పోవాలనిపిస్తూ ఉంటుంది," అని త్రివిక్రమ్ ని మొదటిసారి కలిసినప్పుడు తన అభిప్రాయం చెప్పాడు శ్రీకాంత్.

'ఆదికేశవ' సినిమా గురించి మాట్లాడుతూ హైదరాబాద్ లో ఒక చిన్న ఇంట్లో వున్నా కుర్రాడు, అనంతపూర్ లో వున్న కళ్యాణదుర్గం అనే ఊరుకి వస్తాడు. అక్కడ జరుగుతున్న ఒక అరాచకాన్ని ఆపుతాడు, అది ఎలా ఆపుతాడు, అనంతపూర్ అతను ఎందుకు రావాల్సి వచ్చింది, ఆ నేపధ్యం ఏమిటి అన్నదే 'ఆదికేశవ' సినిమా కథ అని టూకీగా చెప్పాడు శ్రీకాంత్. నిర్మాత నాగ వంశి ఈ సినిమాకి ఎక్కడా రాజీ పడకుండా, బడ్జెట్ విషయం కూడా ఆలోచించకుండా మొదటి సినిమా దర్శకుడు అని కూడా చూడకుండా, చాలా ఈ సినిమా మీద పెట్టి ఒక పెద్ద బడ్జెట్ సినిమాకి కావలసినంత సపోర్ట్ చేశారు అని చెప్పాడు శ్రీకాంత్. సినిమా రేపు విడుదలవుతోంది, కొంచెం టెన్షన్ గానే వుంది అని, మంచి విజయం సాధిస్తుంది అనుకుంటున్నాని చెప్పాడు శ్రీకాంత్.

-- సురేష్ కవిరాయని

Updated Date - 2023-11-23T13:21:43+05:30 IST