సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Eswari Rao: రూ.100 చీర ధరించి నిరాడంబరంగా ఆడిషన్‌కి వెళ్లిన నటి

ABN, First Publish Date - 2023-02-18T15:02:52+05:30

ఈశ్వరీరావు వెండితెర నటిగానే కాక బుల్లితెర నటిగా కూడా ఎన్నో సీరియల్స్‌లో నటించి కాదేదీ నటనకనర్హం అన్నట్లు నటనా కౌశలం ఉంటే ఏదైనా ఒకటే అని నిరూపించారు. ఆమె నటించిన

Actress Eswari Rao
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళలకు లింగ వివక్ష లేదు. స్త్రీ, పురుష వ్యత్యాసమూ లేదు. ఆ రంగం పట్ల అభిరుచి, అంకితభావంతో పాటు దృఢ సంకల్పం, పరిశ్రమ తోడైతే విజయం వెన్నంటే ఉంటుంది. లలిత కళల్లో ఆరి తేరిన మహిళామణులు కోకొల్లలు. వెండి తెరను ఏలే నటీమణులకు కొదవలేదు. మనోరంజనం కలిగించే చిత్రరంగంలో తమ హావభావాలతో పాత్రలకు జీవం పోసి నటించి చరిత్ర సృష్టించిన వారెందరో ఉన్నారు. నిత్యనూతనమైన సినీరంగంలో, పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుని పేరు ప్రతిష్టలు సంపాదించడం కష్టసాధ్యమైనా అలవోకగా సాధించిందామె. నటన ఆమె వారసత్వం కాదు. తల్లి అభిరుచి, అభీష్టం మేరకు ఆమె సినీరంగంలో కాలుమోపింది. తరుణ వయసులోనే సినిమాలలో అరంగ్రేటం చేసింది. అంచెలంచెలుగా ఎదిగింది. పది సంవత్సరాలపాటు హీరోయిన్‌గా వెలుగులు విరజిమ్మింది. ఆమె నటనకు వెండితెరతో పాటు బుల్లితెర కూడా వేదిక అయింది. పాత్రలకు ప్రాణప్రతిష్ఠ గావించి, వాటిల్లో మమేకమై నటగించే ఆమె ఎవరో కాదు ‘ఈశ్వరీరావు’ (Eswari Rao). వెండితెర, బుల్లితెర నటి అయిన ఈశ్వరీరావు జీవన ప్రస్థానమిదే (Eswari Rao Life Journey)..

ఈశ్వరీరావు వెండితెర నటిగానే కాక బుల్లితెర నటిగా కూడా ఎన్నో సీరియల్స్‌లో నటించి కాదేదీ నటనకనర్హం అన్నట్లు నటనా కౌశలం ఉంటే ఏదైనా ఒకటే అని నిరూపించారు. ఆమె నటించిన ‘కస్తూరి’ (Kasturi) సీరియల్‌ 6,000 ఎపిసోడ్లు నడిచింది. ‘నిన్నే పెళ్లాడుతా’ (Ninne Pelladutha) దాదాపు 6సంవత్సరాలు, ‘అగ్నిసాక్షి’ (Agni Sakshi) సీరియల్‌ మూడేళ్లపాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించాయి. తెలుగు ఛానళ్లలోనే కాకుండా సన్‌ టీవీ, జెమిని టీవీ మొదలైన తమిళ్‌ ఛానళ్లలో కూడా పలు సీరియళ్లలో నటించారు. దూరదర్శన్‌లో మునిమాణిక్యం ‘కాంతం కథలు’లో ‘కాంతం’ (Kantham) పాత్రలో జీవించారు ఈశ్వరీరావు. ఆమె నంది అవార్డుతో పాటు పలు అవార్డులు, సత్కారాలు పొందారు.

వ్యక్తిగా...

ఈశ్వరీరావు వ్యక్తిగా విలువలను పాటిస్తారు. సంకల్పించుకొన్న పనిని అంకితభావంతో నెరవేరుస్తారు. సినిమాలో నటనను కూడా నిబద్ధతతో, నిజాయితీగా చేయడం ఆమె అలవాటు. పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకొని, సునిశితంగా పరిశీలించి దానికి అనుగుణంగా భావప్రకటనతో ఆ పాత్రలో ఆమె ఒదిగిపోతారు. ‘లవ్‌ స్టోరీ’ (Love Story) చిత్రంలో ఒక మధ్య తరగతి ‘అమ్మ’ పాత్రకు రూ.100 చీర ధరించి నిరాడంబరంగా ఆడిషన్‌కి వెళ్లడం ఆమెకే చెల్లింది. ప్రశంసలు, పురస్కారాలు ఎన్ని అందుకున్నా వినమ్రతతో ఒదిగి ఉంటారు ఈశ్వరీరావు. తన పాత్రలకు పేరు రావడం తన గొప్పదనం కాదని, వాటిని మలచిన దర్శకుల గొప్పదనమేనని అనడం ఈశ్వరీరావు వినమ్రతకు తార్కాణం. బాపుగారి దగ్గర పనిచేయడం ఒక నటనా శిక్షణాలయంలో శిక్షణ పొందడమని ఆమె భావిస్తారు. బాపు, లక్ష్మీదీపక్‌, బాలుమహేంద్ర, మణిరత్నం వంటి దర్శకుల వద్ద నటనలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని అన్నారు. 10 సంవత్సరాల పాటు కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందిన ఈశ్వరీరావుకి నాట్యం, వంట చేయడం, పుస్తక పఠనం ముఖ్యమైన అభిరుచులు. ఇంటికి, పిల్లలకు వీలైనంత సమయం కేటాయిస్తారు. ‘‘పిల్లలకు బాల్యం నుండే దృఢమైన మనస్తత్వం అలవడేట్లు చేయాలి. హఠాత్తుగా వచ్చే ఆటుపోట్లకు తట్టుకునేలా వారిని సన్నద్ధులను గావించాలి. జీవితంలో కష్టనష్టాలు వారికి తెలియజెప్పాలి. ఆత్మరక్షణ చేసుకొనే రీతిలో వారికి శిక్షణనివ్వాలి. మన సంస్కృతీ, సంప్రదాయాలను బాల్యం నుండే వారి మనస్సుల్లో నాటుకునేట్లు తల్లిదండ్రులు చేయాలి. అప్పుడే భావితరం మంచి నడవడికతో ముందుకు సాగుతారు’’ అన్నారు ఈశ్వరీరావు (Actress Eswari Rao).

నటనా ప్రస్థానం

ఈశ్వరీరావు జన్మించింది ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని తణుకు (Tanuku)లో. పాఠశాల చదువే అయినా ప్రపంచాన్ని క్షుణ్ణంగా చదివి లోకజ్ఞానం గడించారు. జీవితం పట్ల స్థిరమైన అభిప్రాయాలను ఏర్పరచుకొన్న ఆమె నైతిక విలువలకు పెద్ద పీట వేస్తారు. బాపు బొమ్మగా, దర్శకులు మలచిన శిల్పంగా, ప్రేక్షకులు మెచ్చిన నటిగా ఈశ్వరీరావు సినీరంగంలో తన ప్రస్థానం సాగిస్తున్నారు. పదేళ్ల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. 1990వ సంవత్సరంలో వెండితెరపై కాలూనిన ఈశ్వరీరావు 2000 సంవత్సరం వరకు నాయికగా నటించి అభిమానులను అలరించారు. 1990వ సంవత్సరంలో ‘కవితై పాడుమ్‌ అలైగళ్‌’ (Kavithai Paadum Alaigal) అనే తమిళ సినిమాతో వెండితెరకు శ్రీకారం చుట్టారు. ఆ సినిమా ఘనవిజయం సాధించకున్నా, ఇళయరాజా సంగీతంలో రూపుదిద్దుకున్న పాటలు ప్రేక్షకుల మనసులు దోచుకున్నాయి. తెలుగులో ‘ఇంటింటి దీపావళి’ (Intinti Deepavali) ఆమె మొదటి చిత్రం. ‘రాంబంటు’ (Rambantu) చిత్రం ఆమెను అందలం ఎక్కించింది. బాపు బొమ్మగా ఆ సినిమాలో ఆమె అభినయం అపూర్వం. ‘జగన్నాటకం’, ‘కలికాలం’ (Kalikalam) మొదలైన తెలుగు చిత్రాలతో పాటు ‘ఊటీ పట్టనమ్‌’, ‘వేదన్‌’, ‘రామన్‌ అబ్దుల్లా’, ‘సిమ్మరాణి’, ‘సుందరీ నీయుమ్‌ సుందరన్‌ నానుమ్‌’, ‘అప్పు’ మొదలైన తమిళ చిత్రాలలో కూడా నటించి ఖ్యాతిగాంచారు ఈశ్వరీరావు. దాదాపు 30 చిత్రాల్లో హీరోయిన్‌గా మెప్పించి, 2000 సంవత్సరం వరకు నటించిన ఆమె ఒక పదేళ్లపాటు వెండితెరకు విరామం ఇచ్చారు. 13 సంవత్సరాల అనంతరం రజనీకాంత్‌కు జోడీగా ‘కాలా’ (Kaala) సినిమాలో ‘సెల్వి’గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత’ (Aravinda Sametha) చిత్రంలో ‘రెడ్డెమ్మ’ (Reddamma) పాత్రకు జీవం పోశారు. పాత్ర నిడివి చిన్నదే అయినా ఆమె నటన తారాస్థాయికి చేరింది. ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) చేసిన పాత్ర చిన్నదే అయినా పెద్ద పేరు రావడం ఆమె నటనా కౌశలానికి నిదర్శనం. ‘నేను లోకల్‌’ (Nenu Local), ‘లవ్‌ స్టోరీ’ మొదలైన చిత్రాల్లో ఆమె నటనకు మంచి మార్కులే వచ్చాయి. తమిళ్‌ చిత్రం ‘గంగ’ (Ganga)లో జోగిని పాత్రలో ఈశ్వరీరావు అద్భుతమైన నటనను ప్రదర్శించారు. హీరోలకు తల్లిగా నటించే వయసు ఆమెకు లేకపోయినా ఆ పాత్రలో నటించి మెప్పించే ఘనత, నేర్పు ఆమెది. ప్రస్తుతం ప్రముఖ దర్శకుల నేతృత్వంలో భాషాభేదం లేకుండా మరెన్నో చిత్రాలలో నటిస్తున్నారు ఈశ్వరీరావు.

Updated Date - 2023-02-18T15:18:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!