Vijayakanth: నారాయణన్‌ విజయరాజ్‌ అళగర్‌స్వామి టు కెప్టెన్ విజయకాంత్ ! 

ABN , Publish Date - Dec 28 , 2023 | 11:31 AM

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ (71) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం మరణించారు.

Vijayakanth: నారాయణన్‌ విజయరాజ్‌ అళగర్‌స్వామి టు కెప్టెన్ విజయకాంత్ ! 

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ (71) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం మరణించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్‌ ఇంటర్‌నేషనల్‌ ఆస్పత్రిలో తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Vijaya-3.jpgకొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న విజయకాంత్‌ను.. కొన్ని రోజుల కిత్రం వెంటిలేటర్‌ మీద ఉంచారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం ఆయన కోలుకోవడంతో ఇటీవల డిశ్చార్జ్‌ చేశారు. పార్టీకు సంబంధించిన ఓ మీటింగ్‌లో ఆయన కనిపించి అభివాదం తెలిపారు. అంతలోనే మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. ‘కెప్టెన్‌’ మృతిపట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి  గురయ్యారు. 

Captain.webp

ఏకంగా 18 సినిమాలు... 

విజయకాంత్‌ 1952 ఆగస్టు 25న తమిళనాడు మధురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్‌ విజయరాజ్‌ అళగర్‌స్వామి. సినిమా రంగంలో అడుగుపెట్టాక విజయకాంత్‌గా మారారు. తల్లిదండ్రులు కె.ఎన్‌. అళగర్‌స్వామి, ఆండాళ్‌ అజగర్‌స్వామి. విజయకాంత్‌కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. 27 ఏళ్ల వయసులో విజయకాంత్‌ తెరంగేట్రం చేశారు. ఆయన నటించిన తొలి సినిమా ‘ఇనిక్కుమ్‌ ఇలమై’ (1979). ప్రతినాయకుడి పాత్రతో ఆయన కెరీర్‌ ప్రారంభించారు. అప్పటి నుంచి 2015 వరకు నిర్విరామంగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. మొదట్లో అన్నీ పరాజయాలే. కానీ ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ దర్శకత్వం వహించిన ‘దూరతు ఇడి ముళక్కం’, ‘సత్తం ఓరు ఇరుత్తరై’తో విజయాలు  అందుకున్నారు. 150కి పైగా చిత్రాల్ల్లో నటించారు. 1984లో ఆయన నటించిన 18 సినిమాలు  విడుదలకావడం  విశేషం. పోలీసు అధికారిగా 20కి పైగా సినిమాల్లో కనిపించారు. ఆయన నటించిన ఆఖరి సినిమా ‘సగప్తం’ (2015).

Vijaykanth.jpg

విజయకాంత్‌ నటించిన ప్రతి చిత్రంలో మంచి సందేశం ఉండేలా చూసుకునేవారు. దేశభక్తి సినిమాలైనా, గ్రామీణ నేపథ్య చిత్రాలైనా, డ్యూయల్‌ రోల్‌ చేయాలన్నా విజయకాంత్‌ ఓ అడుగు ముందుండేవారు. కమర్షియల్‌ చిత్రాలతోనూ అలరించేవారు. పారితోషికం విషయంలో ఆలోచన ఆలోచన రీతి బావుండేదని సన్నిహితులు చెబుతుంటారు. నిర్మాత ఆర్థిక పరిస్థితులు చూసి అంతా బావుంటే పారితోషికం అడిగేవారని, నిర్మాత పరిస్థితి బాగోకపోతే వారి నుంచి రెమ్యునరేషన్‌ తీసుకునేవారు కాదని ఆయన స్నేహితులు చెబుతుంటారు. విజయకాంత్‌ కేవలం తమిళ చిత్రాలే తప్ప ఇతర భాషల్లో నటించలేదు. కానీ, ఆయన నటించిన సినిమాలు తెలుగు,  హిందీ భాషల్లో ఎక్కువ అనువాదమవుతుండేవి. అవన్నీ చక్కని విజయాలు సాధించాయి. ‘శివప్పు మల్లి’ (ఎర్ర మల్లెలు రీమేక్‌), ‘జదిక్కొరు నీధి’ తదితర చైతన్యవంతమైన సినిమాల్లో నటించారు. దాంతో తమిళనాట ఆయన్ను ‘పురాచీ కళింగర్‌’ (విప్లవాత్మక నటుడు) అని పిలిచేవారు. ఆయన వందో చిత్రం ‘కెప్టెన్‌ ప్రభాకరన్‌’ సూపర్‌డూపర్‌ హిట్‌ అయింది. దాంతో అభిమానులంతా ఆయనకు ‘కెప్టెన్‌ విజయకాంత్‌’గా బిరుదు ఇచ్చారు.

Vijay 2.jpg

ఇతర స్టార్‌లతోనూ.. స్క్రీన్ షేర్‌ చేసుకున్నారు..

తమిళ చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన తొలి 3డీ చిత్రం విజయకాంత్‌ నటించిన ‘అన్నై ్ఘభూమి’. ఇందులో ఆయన రాధారవి, కన్నడ నటుడు టైగర్‌ ప్రభాకర్‌తో కలిసి నటించారు. ‘ఈట్టి’లో కన్నడ నటుడు విష్ణువర్థన్‌తో, ‘మనకనక్కు’లో విశ్వనాయకుడు కమల్‌హాసన్‌తో, ‘వీరపాండియన్‌’లో శివాజీ గణేశన్‌తో కలిసి నటించారు. ఒకానొక సమయంలో రజనీకాంత్‌, కమల్‌హాసన్‌లకు పోటీగా నిలిచారు విజయకాంత. ఆయన దర్శకుడిగానూ సత్తా చాటారు. ఆయన ఒకే ఒక చిత్రం ‘విరుధగిరి’. అందులో ఆయనే హీరో. తన బావ ఎల్‌.కె. సుదీశ్ తో కలిసి ‘వల్లారసు’, ‘నరసింహ’, ‘సగప్తం’ తదితర చిత్రాలను నిర్మించారు. 1994లో ‘తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ ఆనరరీ అవార్డు’ (ఎంజీఆర్‌ పురస్కారం), 2001లో ‘కలైమళి అవార్డు’ అందుకున్నారు. 2001లో ‘బెస్ట్‌ ఇండియన్‌ సిటిజెన్‌ అవార్డు’, 2009లో ‘టాప్‌ 10 లెజెండ్స్‌ ఆఫ్‌ తమిళ్‌ సినిమా అవార్డు’, 2011లో ‘ఆనరరీ డాక్టరేట్‌’ (ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చర్చ్‌ మేనేజ్‌మెంట్‌) పొందారు. ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలు అయితే చాలానే అందుకున్నారు. 

సేవే లక్ష్యంగా...

ప్రజలకు సేవ  చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు.  2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2016 ఎన్నికల్లో పరాజయం పొందారు. 


Updated Date - Dec 28 , 2023 | 11:52 AM