Vijay: ‘కస్టడీ’ దర్శకుడితో దళపతి విజయ్ కొత్త చిత్రం ప్రారంభం

ABN , First Publish Date - 2023-10-24T15:15:44+05:30 IST

దళపతి విజయ్ 68వ చిత్రం సోమవారం చెన్నైలో అట్టహసంగా ప్రారంభమైంది. ఏజీఎస్ బ్యానర్లో కళాపతి అగోరం నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళ నాట క్రేజీ దర్శకుడిగా పేరున్న వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనుండగా.. తెలుగులో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న పొడుగుకాళ్ల సుందరి మీనాక్షి చౌదరి ఈ సినిమాతో తమిళనాట కథానాయికగా అడుగు పెట్టనుంది.

Vijay: ‘కస్టడీ’ దర్శకుడితో దళపతి విజయ్ కొత్త చిత్రం ప్రారంభం
vijay68 film launch

దళపతి విజయ్ (Thalapathy Vijay) 68వ (Vijay68) చిత్రం సోమవారం చెన్నైలో అట్టహసంగా ప్రారంభమైంది. ఏజీఎస్ బ్యానర్లో కళాపతి అగోరం నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళ నాట క్రేజీ దర్శకుడిగా పేరున్న వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహించనుండగా.. తెలుగులో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న పొడుగుకాళ్ల సుందరి మీనాక్షి చౌదరి ఈ సినిమాతో తమిళనాట కథానాయికగా అడుగు పెట్టనుంది. చాలాకాలం తర్వాత యువన్ శంకర్ రాజా, విజయ్ చిత్రానికి సంగీతం అందించనుండడం ఈ చిత్రానికి మరో స్పెషల్ అట్రాక్షన్.

దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం పూజా కార్యక్రమాలతో చిత్ర షూటింగ్‌ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj), విజయ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘లియో’ (Leo) బ్లాక్ బస్టర్ విజయం సాధించి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రూ.500 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. తెలుగులో ఎన్నడూ లేని విధంగా నాలుగు రోజుల్లోనే రూ.20 కోట్ల కలెక్షన్లు రాబట్టి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది. దీంతో విజయ్ తదుపరి చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ క్రమంలో తెరమీదకు వచ్చిన ఈ క్రేజీ కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దానికి తగ్గట్లుగానే నిర్మాతలు ఈ సినిమాకు భారీ బడ్జెట్‌ను కేటాయించగా.. తమిళ అగ్ర నటీనటులు పెద్ద ఎత్తున ఈ చిత్రంలో కనిపించనున్నారు.


Vijay.jpg

తమిళ హీరోలు ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, యోగిబాబు, ప్రేమ్ జీలతో పాటు.. మళయాళ స్టార్ జయరాం, ‘రంగం’ ఫేమ్ అజ్మల్ వంటి స్టార్లు.. స్నేహ, లైలా వంటి సీనియర్ నటీమణులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించనున్నారు. ఫాంటసీ, కామెడీ జోనర్లో ఈ చిత్రం తెరకెక్కనుండగా 2024 వేసవిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే వెంకట్ ప్రభు దర్శకత్వంలో చివరగా నాగచైతన్య, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా వచ్చిన ‘కస్టడీ’ చిత్రం తీవ్ర నిరాశను మిగిల్చిన విషయం తెలిసిందే. (Vijay 68th Film Launched)

Updated Date - 2023-10-24T15:15:44+05:30 IST