Rajinikanth: అందువల్లే 'జైలర్' హిట్ అయింది, లేకపోతే....

ABN , First Publish Date - 2023-09-19T12:01:54+05:30 IST

చెన్నైలో 'జైలర్' సినిమా విజయోత్సవాలు ఘనంగా చేశారు. దీనికి ఆ సినిమాలో నటించిన రజినీకాంత్, దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత మిగతా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. ఈ ఉత్సవంలో రజినీకాంత్ మాట్లాడిన వీడియోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Rajinikanth: అందువల్లే 'జైలర్' హిట్ అయింది, లేకపోతే....
Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటించిన 'జైలర్' #Jailer సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సుమారు రూ.600 కోట్లకి పైగా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. నెల్సన్ (NelsonDileepKumar) దీనికి దర్శకుడు కాగా అనిరుధ్ రవిచందర్ (AnirudhRavichander) దీనికి సంగీత దర్శకుడు. ఈ సినిమాని కళానిధి మారన్ (KalanidhiMaran) నిర్మించారు. ఈ సినిమా ఘన విజయం సాధించటంతో ఈ సినిమా విజయోత్సవాలు చెన్నైలో నిర్వహించారు. ఈ సినిమా విజయం తెలిసిన వెంటనే నిర్మాత కళానిధి, ఇందులో నటించిన రజినీకాంత్ కి, దర్శకుడికి, సంగీత దర్శకుడికి ఖరీదైన కార్లను బహూకరించారు.

ఈ సినిమా విజయోత్సవాల ఉత్సవంలో రజినీకాంత్ తనదైన రీతిలో మాట్లాడారు. నిర్మాత కళ సర్ నాకు కారు గిఫ్ట్ గా ఇచ్చారు, ఆ కారులోనే ఇప్పుడు వచ్చాను. అలాగే ఈ సినిమా కోసం పని చేసిన వారందరికీ గోల్డ్ కాయిన్స్ ఇచ్చారు నిర్మాత, ఇది చాలా మంచి పద్ధతి, ఒక్క తమిళ నాటే కాదు, భారతదేశ చిత్ర పరిశ్రమకే అతని చేసిన పరి గర్వకారణము అవుతుంది అని రజినీ అన్నారు.

jailerreview1.jpg

ఇక ఈ 'జైలర్' సినిమా ఎబోవ్ యావరేజ్ అవుతుందని నేను అనుకున్నాను. కానీ ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ నేపధ్య సంగీతం చాలా బాగా ఇవ్వటంతో, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అతను తన సంగీతంతో ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాడు, తన స్నేహితుడు, దర్శకుడు నెల్సన్ కి హిట్ ఇవ్వాలని నేపధ్య సంగీతం బాగా అందించాడు, సినిమా హిట్ అయింది అని చెప్పారు రజిని.

అలాగే ఈ సినిమాలో మోహన్ లాల్ (MohanLal), శివరాజ్ కుమార్ (ShivRajkumar) లను దర్శకుడు చూపించిన తీరు చాలా బాగుంది అని కూడా ప్రశంసించారు రజినీకాంత్. ఈ సినిమా విడుదల తరువాత చాలా ఆనందంగా వున్నాను అని, కానీ ఇప్పుడు మళ్ళీ టెన్షన్ వచ్చిందని తనదైన శైలిలో చెప్పారు. ఎందుకంటే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యాక, తన తరువాతి సినిమా ఇంతకన్నా పెద్దగా ఎలా ఇవ్వాలని టెన్షన్ మొదలైందని చెప్పారు. ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ (AmazonPrimeVideo) లో స్ట్రీమింగ్ అవుతోంది, అక్కడ కూడా రికార్డు స్థాయిలో చూస్తున్నారు.

Updated Date - 2023-09-19T12:01:54+05:30 IST