Shiva Rajkumar : నా భార్య ఆశ్చర్యపోయింది.. అసలు ఏం చేశావని అంటూ...

ABN , First Publish Date - 2023-10-24T13:14:39+05:30 IST

‘జైలర్‌’ (Jailer) చిత్రంతో నరసింహగా నటించడం ఊహించని విషయమని, దానికి వచ్చిన స్పందన చూసి తన భార్య ఆశ్చర్యపోయిందని కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ (Shivarajkumar( తెలిపారు.

Shiva Rajkumar : నా భార్య ఆశ్చర్యపోయింది.. అసలు ఏం చేశావని అంటూ...

‘జైలర్‌’ (Jailer) చిత్రంతో నరసింహగా నటించడం ఊహించని విషయమని, దానికి వచ్చిన స్పందన చూసి తన భార్య ఆశ్చర్యపోయిందని కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ (Shivarajkumar( తెలిపారు. తాజాగా ఆయన నటించిన ‘ఘోస్ట్‌’ సినిమా ప్రచారంలో భాగంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'జైలర్‌' గురించి మాట్లాడారు. ఆ చిత్రంలో కీలక పాత్ర పోషించి మెప్పించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ‘‘జైలర్‌’లో నేను పోషించిన నరసింహ క్యారెక్టర్‌కు అంత గుర్తింపు వచ్చిందంటే దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌ కారణం. నా రోల్‌కు సంబంధించి జైలు నేపథ్యంలో ఓ సీక్వెన్స్‌ చిత్రీకరించాల్సి ఉంది. కానీ, ఆ సన్నివేశం అంతగా అవసరం లేదని దర్శకుడు తర్వాత నిర్ణయం తీసుకున్నారు. గ్రే క్యారెక్టర్లను నెల్సన్‌ బాగా చూపిస్తారు. వాస్తవానికి నరసింహలాంటి రోల్‌ని నేను ఊహించలేదు. ఇదొక సర్‌ప్రైజ్‌. ఈ చిత్రంలో ‘మీరేం చేశారు?.. ఎందుకింత స్పందన?’ అంటూ ఓ రోజు నా భార్య ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నాకూ తెలియదని జవాబు చెప్పా. ప్రేక్షకులకు ఎప్పుడు, ఏది నచ్చుతుందో చెప్పలేం. ఈ సినిమా కథ, నెల్సన్‌ టేకింగ్‌, అనిరుధ్‌ సంగీతం ప్రేక్షకులకు  కొత్త అనుభూతి పంచాయి. ఈ సినిమా ఘన విజయంతో తదుపరి ప్రాజెక్టు విషయంలో నెల్సన్‌కు బాధ్యత డబుల్‌ అవుతుంది. యాక్షన్‌ సినిమాలు చేయడంలో నాకు ఫన్‌ ఉంటుంది. నెగెటివ్‌ రోల్‌లో నటించాల్సి వస్తే యాక్షన్‌ నేచురల్‌గా వస్తుంది’’ అని అన్నారు.

తలైవా రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన ‘జైలర్‌’ సినిమాపై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. ఊహించినట్టుగానే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 600 కోట్లకుపైగా వసూళ్లు చేసింది. ఇందులో రజనీకాంత్‌ టైగర్‌ ముత్తువేల్‌ పాండియన్‌గా కనిపించగా, ఆయనకు సాయం చేసే  నరసింహగా శివ రాజ్‌కుమార్‌ నటించారు. అయన  హీరోగా దర్శకుడు ఎంజీ శ్రీనివాస్‌ తెరకెక్కించిన ‘ఘోస్ట్‌’ కన్నడలో ఈ నెల 19న విడుదలైంది. 27న తెలుగులో విడుదల కానుంది.

Updated Date - 2023-10-24T13:15:32+05:30 IST