Kamal Haasan: ఏళ్ల క్రితమే చెప్పా.. వ్యతిరేకించారంటూ వ్యాఖ్యలు!
ABN , First Publish Date - 2023-05-29T14:59:24+05:30 IST
ప్రస్తుతం ఓటీటీ మాధ్యమానికి ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే!. ప్రజెంట్ వాటి హవానే ఎక్కువగా కొనసాగుతోంది. ఓటీటీ కోసమే కొందరు మేకర్స్ తక్కువ బడ్జెట్‌లో సినిమాలు, సిరీస్‌లు తీసి సక్సెస్ సాధిస్తున్నారు. అలాగే థియేటర్‌లో అంతంత మాత్రంగా ఆడిన చిత్రాలు ఓటీటీలో చక్కని ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.

ప్రస్తుతం ఓటీటీ మాధ్యమానికి (OTT platform)ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే!. ప్రజెంట్ వాటి హవానే ఎక్కువగా కొనసాగుతోంది. ఓటీటీ కోసమే కొందరు మేకర్స్ తక్కువ బడ్జెట్‌లో సినిమాలు, సిరీస్‌లు తీసి సక్సెస్ సాధిస్తున్నారు. అలాగే థియేటర్‌లో అంతంత మాత్రంగా ఆడిన చిత్రాలు ఓటీటీలో చక్కని ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. కొన్ని చిత్రాలు డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. అయితే తాజాగా దీనిపై కమల్‌హాసన్ (Kamal Haasan) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 2013లో ఆయన తీసిన ‘విశ్వరూపం’(Viswaroopam DTH) ను డీటీహెచ్ తరహాలో డబ్బు చెల్లించి ఇంట్లో కూర్చొని చూేసలా ఏర్పాటు చేయాలని కమల్ అప్పట్లోనే ప్రయత్నించారు. థియేటర్‌లో కన్నా ముందే డీటీహెచ్‌లో విడుదల చేస్తే థియేటర్, టీవీ బిజినెస్ పోతుందని థియేటర్ యాజమాన్యం, కొందరు సినీ ప్రముఖులు దీన్ని వ్యతిరేకించడంతో డైరెక్ట్-టు-హోమ్ ప్రోగ్రామ్‌ను పక్కన పెట్టారు. ఇప్పుడు ఆ విషయాన్నే మరోసారి తెరపైకి తెచ్చారు కమల్‌హాసన్. ఓటీటీల గురించి సంవత్సరాల క్రితమే చెప్పానని, అప్పట్లో నా మాట ఎవరూ పట్టించుకోలేదని విశ్వనాయకుడు అన్నారు. దుబాయ్‌లో జరిగిన ‘ఐఫా’ అవార్డు వేడుకలో లైఫ్ టైమ్ ఎఛీవ్‌మెంట్ అవార్డు అందుకున్న ఆయన ఓటీటీల గురించి మాట్లాడారు.. (Kamal haasan about OTT)
‘‘ఓటీటీ మాధ్యమం అందుబాటులోకి వస్తుందని నేను ఎప్పుడో చెప్పాను. దాని కోసం ఒక ప్రణాళిక కూడా రెడీ చేశా. కానీ అప్పుడు సినిమా పరిశ్రమలో నా మాట ఎవరూ పట్టించుకోలేదు. నా ఆలోచనలను అంగీకరించలేదు. నామాటను వినే సమయం కూడా ఇవ్వలేదు. ఆరోజున నన్ను వ్యతిరేకించిన వారందరికీ ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ప్రేక్షకులు ఎక్కడి నుంచైనా అన్ని భాషల్లోని సినిమాలు చూసి ఆస్వాదిస్తున్నారు. నేను చిన్న సినిమాలకు పెద్ద అభిమానిని.. అలాంటి సినిమాలు చేసే నేను పెద్ద స్టార్ అయ్యాను. కథలు విన్నప్పుడు.. కొన్నింటిలో నటించాలనుకుంటాను.. మరికొన్నింటిని నిర్మించాలనుకుంటాను. ప్రస్తుతం కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాను. ఆ కథలకు కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తాను మిగతా విషయాల్లో జోక్యం చేసుకోను’’ అని అన్నారు. ప్రస్తుతం ఆయన ‘ఇండియన్-2’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కాజల్, రకుల్‌ప్రీత్ సింగ్ నాయికలు.