NTR: యాక్షన్ అనగానే ఎన్టీఆర్ నిజంగానే అందరినీ చితకబాదేశారు

ABN , Publish Date - Dec 25 , 2023 | 10:30 AM

ఎన్టీఆర్ కి మొదటి పారితోషికం ఇచ్చిన నిర్మాత కృష్ణవేణి గారు నిన్న తన 100వ జన్మదినం ఘనంగా జరుపుకున్నారు. 'మనదేశం' సినిమా ద్వారా ఎన్టీఆర్ ని పరిచయం చేసిన ఆమె ఆ సినిమా గురించి ఇప్పటికీ గుర్తుపెట్టుకొని అప్పటి విషయాలు చెప్తారు.

NTR: యాక్షన్ అనగానే ఎన్టీఆర్ నిజంగానే అందరినీ చితకబాదేశారు
NTR, Krishnaveni, Narayanarao from Manadesam film

స్వర్గీయ నందమూరి తారకరామారావు (NT Rama Rao) 'మనదేశం' #Manadesam సినిమాతో తెలుగు చలన చిత్రసీమలోకి ఆరంగేట్రం చేశారు. ఆ సినిమాలో అయన ఒక పోలీసు ఇనస్పెక్టర్ పాత్ర వేశారు. అయితే ఆ సినిమాకి నిర్మాత ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు, మీర్జాపురం రాజుగారి సతీమణి కృష్ణవేణి (Krishnaveni). ఆమె నిన్న తన నూరవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. 'మనదేశం' సినిమాకి నిర్మాతగానే కాకుండా, ఆ సినిమాలో కథానాయికగా కూడా నటించి మెప్పించిన నటి కృష్ణవేణి. అప్పట్లో ఆమె అగ్ర నటీమణి. నిర్మాత, గాయని, నటి, స్టూడియో అధినేత అయినా కృష్ణవేణి 1949లో ఈ 'మనదేశం' చిత్రాన్ని నిర్మించారు. ఆమెకి అప్పట్లో శోభనాచల స్టూడియో ఉండేది. ఆ స్టూడియోలోనే ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

manadesam.jpg

ఈ చిత్రం 24-11-1949న విడుదలైంది. ఈ సినిమాకి ఎల్వీ ప్రసాద్ (LV Prasad) దర్శకుడు, ఇది ఒక బెంగాలీ నవల 'విప్రదాసు' ఆధారంగా నిర్మించిన రాజకీయ చిత్రం. బెంగాలీ రచయితే శరత్ చంద్ర చటోపాధ్యాయ రచించిన ఈ నవలని అనేక మార్పులు చేసి తెలుగులో 'మనదేశం' పేరిట నిర్మించారు. సముద్రాల ఈ సినిమాకి చిత్రానువాదం, పాటలు, మాటలు రాశారు.

ఈ చిత్ర దర్శకులు ఎల్వీ ప్రసాద్ ఈ చిత్రం ప్రారంభోత్సవం సమయంలో ఎన్టీఆర్ ని తీసుకువెళ్లి కృష్ణవేణి గారికి పరిచయం చేసి, 'ఈ కుర్రాడు మన సినిమాలో పోలీసు ఇనస్పెక్టర్ పాత్రకి సరిపోతాడు' అని చెప్పడంతో కృష్ణవేణి గారు వెంటనే అంగీకరించారు. నాగయ్య, నారాయణరావు, కృష్ణవేణి లాంటి అనుభవం వున్న నటీనటులతో అప్పట్లో ఎన్టీఆర్ నటించి నటనలో మెళకువలు నేర్చుకున్నారు. ఈ సినిమా సన్నివేశ చిత్రీకరణలో ఒక సంఘటన కూడా జరిగింది.

manadesamstill.jpg

ఎన్టీఆర్ ఇందులో ఇనస్పెక్టర్ పాత్రలో కొంతమందిని లాఠీచార్జి చెయ్యాలి. దర్శకుడు ఎల్వీ ప్రసాద్, యాక్షన్ అనగానే, ఎన్టీఆర్ నిజంగానే లాఠీతో అక్కడవున్న జూనియర్ ఆర్టిస్టులను చితకబాదారు. నిజంగా దెబ్బలు పడటంతో వాళ్ళందరూ కేకలు వెయ్యగానే, ఎల్వీ ప్రసాద్ షూటింగ్ ఆపేసారు, ఎన్టీఆర్ తో 'ఆలా కొట్టేసావేమిటయ్యా' అని అడిగితే, 'మీరే కదా యాక్షన్ అనగానే కొట్టమన్నారు సార్' అని ఎన్టీఆర్ బదులిచ్చారు. అప్పుడు ఎల్వీ ప్రసాద్, ఎన్టీఆర్ కి కొట్టినట్టు ఎలా నటించాలో చేసి చూపించారు. ఆ జూనియర్ ఆర్టిస్టులకు ఎన్టీఆర్ చేతులు జోడించి తప్పు క్షమించమని చెప్పారు. వాళ్ళు కూడా అర్థం చేసుకొని సహకరించారు. అది ఎన్టీఆర్ మొదటి సినిమా సంఘటన ఆలా జరిగింది.

krishnaveni100thbirthday.jpg

ఆ సినిమా ద్వారా ఎన్టీఆర్ ని పరిచయం చేసిన నిర్మాత కృష్ణవేణి, నిన్న తన 100వ పుట్టినరోజుని ఘనంగా జరుపుకున్నారు. తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు కృష్ణవేణి పుట్టినరోజు సందర్భంగా నిన్న ఆమెని ఇంట్లో కలిసి ఘనంగా సత్కరించారు.

Updated Date - Dec 25 , 2023 | 10:31 AM