SuperStarKrishna: అది స్థాపించి ఈరోజుకి 53 ఏళ్ళు, వైరల్ అవుతున్న అప్పటి ఫోటోస్

ABN , First Publish Date - 2023-07-10T16:50:54+05:30 IST

చిత్ర పరిశ్రమలో ఇటు తెలుగులోనూ, అటు హిందీలోనూ చిత్రాలు నిర్మించి విజయం సాధించటం బహు కొద్దిమందికే సాధ్యం అయింది. రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్ సంస్థ, తరువాత కృష్ణ గారు స్థాపించిన పద్మాలయ స్టూడియోస్, ఈ రెండు తెలుగు, హిందీలలో చిత్రాలు తీసి రికార్డు బ్రేక్ చేస్తారు. ఇది స్థాపించి నేటికీ 53 ఏళ్ళు

SuperStarKrishna: అది స్థాపించి ఈరోజుకి 53 ఏళ్ళు, వైరల్ అవుతున్న అప్పటి ఫోటోస్
Krishana and his brothers Hanumantha Rao, Adisehagiri Rao

సూపర్ స్టార్ కృష్ణని (SuperStarKrishna) డేరింగ్, డేషింగ్ హీరో అని అంటారు. అలా ఎవరినీ వూరికే అనరు, కానీ కృష్ణగారు వెండితెర మీద కథానాయకుడిగా ఎన్ని సాహసాలు చేస్తారో, బయట కూడా అంతే సాహసం చేస్తారు, అందుకని ఆయన్ని మాత్రమే ఆలా పిలుస్తారు. 'తేనె మనసులు' #TeneManasulu సినిమాతో పరిశ్రమలోకి అడుగు పెట్టిన కృష్ణ, ఆ తరువాత చాలా సినిమాలు చేశారు. అయితే అతనికి తాను కూడా ఎన్టీఆర్ (NTR) లా ఒక మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని ఉండేది.

krishna-padmalaya1.jpg

అప్పుడు బయట నిర్మాతలు అయితే తన మీద అంత ఖర్చు పెట్టి, భారీగా సినిమాలు చేస్తారో చేయ్యరో అని, తనే ఎందుకు ఒక స్వంత సంస్థ స్థాపించి దాని మీద తనకు నచ్చిన సబ్జెక్టులను సినిమాలుగా మలుచుకోవడానికి వీలుంటుంది అని 53 ఏళ్ళ క్రితం పద్మాలయా స్టూడియోస్ సంస్థను #PadmalayaStudios కృష్ణ గారు ప్రారంభించటం జరిగింది. కృష్ణ గారి పెద్దమ్మాయి పేరు పద్మావతి, అందుకని ఆమె పేరు మీద సంస్థను స్థాపిస్తే ఇంకా బాగుంటుంది అని కృష్ణగారు ఆలా మొదలెట్టారు.

ఆ సంస్థను స్థాపించి మొదటగా 'అగ్ని పరీక్ష' అనే సినిమా చేశారు, కానీ అది అంతగా పోలేదు. ఆ తరువాత తీసిన సినిమానే 'మోసగాళ్లకు మోసగాడు'. #MosagallakiMosagaadu భారతదేశంలో మొదటి కౌబాయ్ సినిమా ఇది. ఒక స్పెషల్ ట్రైన్లో మొత్తం యూనిట్ వాళ్లందరినీ రాజస్థాన్ తీసుకు వెళ్లి, అక్కడ షూటింగ్ చేసిన మొదటి కౌబాయ్ సినిమా ఈ సంస్థని, కృష్ణ ని ఒక్కసారిగా చాలా పైకి తీసుకెళ్లింది. సంస్థకి బాగా లాభాలు వచ్చాయి ఆ సినిమా వలన, అలాగే కృష్ణ కోరుకున్నట్టుగానే అతనికి మాస్ ఇమేజ్ తెచ్చింది ఆ 'మోసగాళ్లకు మోసగాడు'.

krishna-padmalaya2.jpg

ఆ సంస్థ మీద ఎన్నో చాటిత్రాత్మక, చిత్రసీమలో ఒక చరిత్రగా మిగిలిపోయే సినిమాలు చేశారు కృష్ణగారు. 'అల్లూరి సీతారామరాజు' #AlluriSeetharamaraju కృష్ణ గారు కెరీర్ లో ఒక మణిపూస. అటువంటి సినిమా ఈరోజుకి కూడా ఎవరూ తీయలేరు అని అంటారు. అలాగే 'సింహాసహం' #Simhasanam సినిమా కూడా. మొదటి స్కోప్, 70 ఎంఎం, అలాగే ఈ సినిమా కృష్ణగారు పద్మాలయా స్టూడియో ఫ్లోర్స్ స్టార్ట్ చేసినప్పుడు అందులో చేసిన మొట్టమొదటి సినిమా ఇది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు గారు ఈ స్టూడియో ని ఓపెన్ చేశారు.

krishna-padmalaya5.jpg

అలాగే ఈ పద్మాలయ సంస్థకి అప్పట్లో బాలీవుడ్ లో పెద్ద క్రేజ్ ఉండేది. నార్త్ లో చాలా పట్టణాల్లో పద్మాలయ ఆఫీస్ ఉండేది కూడా. శ్రీదేవి (Sridevi) ని హిందీకి పరిచయం చేసింది కృష్ణ గారే. పద్మాలయ సంస్థ మీద కృష్ణ, జయప్రద (Jayaprada) నటించిన తెలుగు హిట్ సినిమా 'ఊరుకి మొనగాడు' #OorukiMonagadu ని హిందీ లో జితేంద్ర (Jeetendra) కథానాయకుడిగా, శ్రీదేవి ని కథానాయికగా అక్కడ పరిచయం చేస్తూ 'హిమ్మత్వాలా' (Himmatwala) అనే సినిమా నిర్మించారు. ఇది అప్పట్లో ఎన్నో రికార్డ్స్ బద్దలు కొట్టడమే కాకుండా, సంగీత పరంగా కూడా పెద్ద హిట్. శ్రీదేవి ఈ ఒక్క సినిమాతో అక్కడ పెద్ద స్టార్ అయిపొయింది.

krishna-padmalaya3.jpg

అలాగే 'ఖైదీ', 'పాతాళ భైరవి', 'మవాలి', 'జస్టిస్ చౌదరి', 'సింఘాసన్', 'కన్వర్ లాల్' లాంటి చాలా సినిమాలు నిరించారు హిందీలో. అయితే తెలుగు హిట్ అయిన సినిమాలు అన్నీ పద్మాలయ సంస్థ అక్కడ హిందీలో రీమేక్ చేసేవారు. ఎక్కువగా జితేంద్ర తో చేసేవారు. ఆలా మొదలెట్టిన పద్మాలయ సంస్థ, తరువాత పద్మాలయ స్టూడియో తెలుగు చలన చిత్ర సీమలోనే కాకుండా, బాలీవుడ్ లో కూడా తనదైన మార్కు వేసుకుంటూ ఒక చరిత్ర సృష్టించుకుంది.

Updated Date - 2023-07-10T16:52:13+05:30 IST