వీరిద్దరికీ పెళ్లయిందని ప్రచారం జరిగింది

ABN , First Publish Date - 2023-02-14T03:05:10+05:30 IST

హీరోయిన్ల వృత్తిపరమైన విషయాలకంటే వారి వ్యక్తిగత విషయాలే జనానికి ఆసక్తి కలిగిస్తుంటాయి...

వీరిద్దరికీ పెళ్లయిందని ప్రచారం జరిగింది

హీరోయిన్ల వృత్తిపరమైన విషయాలకంటే వారి వ్యక్తిగత విషయాలే జనానికి ఆసక్తి కలిగిస్తుంటాయి. తెలుగమ్మాయి, బాలీవుడ్‌కి వెళ్లి ఓ వెలుగు వెలిగిన రేఖ వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ ఏదోక విషయం బయటకు వచ్చి వైరల్‌ అవుతుంటుంది. అమితాబ్‌, రేఖ ప్రేమించుకుంటున్నారనీ, పెళ్లి చేసుకుంటారనీ కొంత కాలం, సంజయ్‌దత్‌ ఆమెను పెళ్లి చేసుకున్నాడని మరి కొంత కాలం, రాజ్‌బబ్బర్‌తో రేఖ ప్రేమలో ఉందని ఇంకొంత కాలం వార్తలు వినిపించాయి. అలాగే 1973లో నటుడు వినోద్‌ మెహ్రా, రేఖ పెళ్లి చేసుకున్నారని కొన్ని పత్రికలు రాశాయి.

బాలీవుడ్‌ నటుడు, నిర్మాత వినోద్‌ మెహ్రా వందకు పైగా చిత్రాల్లో నటించారు. 1958లో ‘రాగిణి’ చిత్రంతో బాల నటుడిగా పరిచయమైన వినోద్‌ ఆ తర్వాత హీరో అయ్యారు. వృత్తి పరంగా ఎంతో మంది హీరోయిన్లతో ఆయన కలసి నటించారు కానీ తెరపై రేఖతో కెమిస్ట్రీ పండినంతగా మరో హీరోయిన్‌తో పండలేదనే చెప్పాలి. ‘ఘర్‌’, ‘ఔరత్‌ ఔరత్‌ ఔరత్‌’’ వంటి ఎన్నో చిత్రాల్లో వీరిద్దరూ కలసి నటించారు. వీరి అనుబందాన్ని గమనించిన కొందరు పెళ్లి చేసుకుంటారని అని ప్రచారం చేస్తే, రహస్యంగా పెళ్లి చేసేసుకున్నారని మరి కొందరు చెప్పేవారు. బాలీవుడ్‌లో కొన్ని పత్రికలు అప్పట్లో వీరి పెళ్లి వార్తను ప్రముఖంగా ప్రచురించాయి కూడా. ఆ రోజుల్లో ఈ పెళ్లి వార్త గురించి రేఖ కానీ, వినోద్‌ మెహ్రా కానీ పెదవి విప్పకుండా మౌనం వహించడంతో వాస్తవం ఏమిటన్నది సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. అయితే చాలా కాలం తర్వాత అంటే 2004లో సిమీ గారేవాల్‌ టాక్‌ షోకు హాజరైన రేఖ తొలి సారిగా మౌనం విడనాడి, తమ పెళ్లి వార్త నిజం కాదని చెప్పారు. ‘1973లో మీరు, వినోద్‌ మెహ్రా పెళ్లి చేసుకున్నారు. రెండు నెలలు కాపురం కూడా చేశారు కదూ’ అని సిమీ ప్రశ్నిస్తే, ‘ఎవరు ఎలాంటి ప్రశ్నలైనా వేయవచ్చు. కానీ సమాధానం చెపాల్సిన అవసరం నాకు లేదు. ఇదంత ముఖ్యమైన విషయం కాదు కూడా’ అని చెప్పి, విషయాన్ని దాట వేయబోయారు రేఖ. కానీ సిమీ వదిలి పెట్టేలేదు. మళ్లీ మళ్లీ అదే ప్రశ్న వేసే సరికి ‘వినోద్‌ మెహ్రా నా శ్రేయోభిలాషి. మేమిద్దరం చాలా చాలా సన్నిహితంగా ఉండేవాళ్లం’ అని అంత వరకే చెప్పి ఊరుకున్నారు రేఖ. ఇన్నేళ్ల తర్వాత ఈ పెళ్లి వార్తను వినోద్‌ మెహ్రా క్లోజ్‌ ఫ్రెండ్‌, టీవీ వ్యాఖ్యాత తబస్సమ్‌ వెలుగులోకి తెచ్చి, అది నిజం కాదని తేల్చేశారు. ‘వినోద్‌, రేఖ చాలా చిత్రాల్లో కలసి నటించారు. రేఖను వినోద్‌ ప్రేమించాడు. వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు కానీ బ్యాడ్‌ లక్‌. అది జరగలేదు’ అని తన షో తబస్సమ్‌ టాకీ్‌సలో వెల్లడించారామె.

Updated Date - 2023-02-14T16:03:21+05:30 IST