SuperStar Krishna: రోజుకి మూడు షిఫ్ట్ లలో పని చేసే కృష్ణకి 1975 లో ఒక్క సినిమా కూడా చేతిలో లేదు, కృష్ణ పని అయిపొయింది అన్నారు, ఎందుకలా? ఏమైంది?

ABN , First Publish Date - 2023-08-02T16:45:36+05:30 IST

1966 నుండి 1975 వరకు పదేళ్ల పాటు విరామం లేకుండా రోజుకి మూడు షిఫ్ట్ లు చేసిన కృష్ణ కి సినిమా లేకుండా అయిపొయింది. అడిగిన వాళ్లందరికీ కాదనకుండా సినిమా చేసిన కృష్ణని అడిగిన వారే కరువయ్యారు. అప్పుడు కృష్ణ ఏమి చేశారు, మళ్ళీ ఎలా పూర్వ వైభవం సాధించారో తెలుసుకోండి...

SuperStar Krishna: రోజుకి మూడు షిఫ్ట్ లలో పని చేసే కృష్ణకి 1975 లో ఒక్క సినిమా కూడా చేతిలో లేదు, కృష్ణ పని అయిపొయింది అన్నారు, ఎందుకలా? ఏమైంది?
Krishna one of the busiest actors in 1960s, 1970s and 1980s

సూపర్ స్టార్ కృష్ణ (SuperStarKrishna) తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమకి కూడా ఎంతో సేవ చేశారు. ఎందుకంటే ఎన్నో కొత్త సాంకేతికతను కృష్ణ చిత్ర పరిశ్రమకి పరిచయం చేశారు. అలాగే హిందీలో ఎన్నో చిత్రాలు నిర్మించారు, శ్రీదేవి (Sridevi) ని హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయం చేసింది కృష్ణే. 1965లో 'తేనె మనసులు' #TeneManasulu చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన కృష్ణ ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అతి చిన్న వయసులోనే పరిశ్రమలోకి వచ్చి సుమారు 350 కి పైగా చిత్రాలలో కథానాయకుడిగా నటించిన కృష్ణ డేషింగ్ అండ్ డేరింగ్ హీరో అని పిలుచుకుంటారు. ఆ మాటలు అక్షరాలా కృష్ణ కి వర్తిస్తాయి కూడా. కృష్ణ ఎప్పుడూ మొహమాటం లేకుండా వున్నది వున్నట్టుగా మాట్లాడే వ్యక్తి.

alluriseetharamaraju.jpg

'తేనె మనసులు' విజయం తరువాత కృష్ణ ఒకటి రెండు సంవత్సరాలు కొంచెం కష్టప్పడ్డారు, ఆ తరువాత అతను వెనక్కి చూసుకోలేదు. నెలకి సుమారు డజనుకు పైగా చిత్రాలు విడుదలవుతూ ఉండేవి. రోజుకి మూడు షిఫ్టులు చేస్తుండేవారు. సెట్లోనే నిద్రపోయేవారు. దానికి కూడా మా సినిమాలో పాత్రకి సరిపడా డ్రెస్ వేసుకొని నిద్రపోండి, ఆ నిద్రపోయే సన్నివేశాలు చిత్రీకరించుకుంటాం అని అనేవారట నిర్మాతలు. అంటే అంతలా ఉండేది కృష్ణ డిమాండ్ 70వ అలాగే 80 వ దశకంలో కూడాను. అయితే మరి అలంటి కృష్ణకి 75వ సంవత్సరంలో ఒక్క నిర్మాత కూడా సినిమా తీయడానికి ముందుకు రాలేదు, జాబ్ లేకుండా కృష్ణ కూర్చోవలసి వచ్చింది అంటే నమ్ముతారా? కానీ అది అక్షరాలా నిజం. అది కృష్ణ గారే చెప్పారు. ఇంతకీ ఏమి జరిగిందో చూద్దాం.

superstarkrishna-alluri.jpg

కృష్ణ గారు దగ్గరికి అక్కినేని నాగేశ్వర రావుతో(AkkineniNageswaraRao) 'దేవదాసు' #Devadasu చేసిన నిర్మాత డి ఎల్ నారాయణ వచ్చి ఒక స్క్రిప్ట్ ఇచ్చి వెళ్లారు. అదేమిటి అని చూస్తే అల్లూరి సీతారామరాజు #AlluriSeetharamaraju స్క్రిప్ట్. తను ఎన్టీఆర్ (NTR) తో ఆ సినిమా చేయాలనుకున్నాను అని, కానీ ఎన్టీఆర్ చేస్తాను అని గానీ, చెయ్యను అని గానీ చెప్పలేదని, అంత గొప్ప సినిమా తీసే ఓపిక ఇప్పుడు తనకి లేదను అందుకని ఆ స్క్రిప్ట్ కృష్ణ కి నువ్వే తీయగలవు ఇది అని ఆ స్క్రిప్ట్ ఇచ్చేసారు. కృష్ణ గారు ఆ స్క్రిప్ట్ చదివి, తమ్ముడు హనుమంతరావుకు, రైటర్ మహారధికి (Maharadhi) చదవమని ఇచ్చారు. అయితే అప్పటికే 'అసాద్యుడు' అనే సినిమాలో కృష్ణ అల్లూరి సీతారామరాజు గెటప్ వెయ్యడంతో ఆ పాత్ర ఎలా ఉండాలి, కృష్ణ సరిపోతాడా సరిపోదా అనే విషయంలో తర్జన భర్జనలు ఏమీ లేవు. తరువాత హనుమంతరావు, మహారథి ఆ స్క్రిప్ట్ బాగుంది అన్నారు. అందరికీ నచ్చడంతో ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేసి, సొంత బ్యానర్ పద్మాలయా మీద ఆ సినిమా 'అల్లూరి సీతారామరాజు' ప్రకటించారు కృష్ణ.

superstarkrishna-alluri1.jpg

అయితే అప్పుడే పరిశ్రమ నుండి చాలా నెగటివ్ వచ్చింది. కృష్ణ సినిమాలు అప్పట్లో రెగ్యులర్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నవయుగ ఫిలిమ్స్ వాళ్ళు ఈ సినిమాలో డ్యూయెట్ లు వుండవు, ఫైట్స్ వుండవు మేము చెయ్యం అని తప్పుకున్నారట. అప్పుడు తారక రామ ఫిలిమ్స్ వాళ్ళు ముందుకు వచ్చారు, అయితే వాళ్లలో కూడా అదే అభిప్రాయం వున్నా, అప్పటికే కృష్ణ, ఎన్టీఆర్ నటించిన 'దేవుడు చేసిన మనుషులు' డిస్ట్రిబ్యూట్ చేసి వున్నారు, డబ్బులు ఇంకా వాళ్ళదగ్గర వున్నాయి. అప్పట్లో సినిమా విడుదలయ్యాక రెండు మూడు సంవత్సరాల వరకు డబ్బులు వస్తూ ఉండేవి. అందుకని వాళ్ళు ముందుకొచ్చారు. ఆఖరికి ఎన్టీఆర్ కూడా ఈ సినిమా వద్దు రిస్క్ అని చెప్పారు. 'కురుక్షేత్రం' సినిమా చెయ్యి నేను కృష్ణుడు వేషం వేస్తాను అని ఎన్టీఆర్ చెప్పారట, కానీ కృష్ణ ఎవరి మాటా వినకుండా చింతపల్లి అడవుల్లో రామచంద్ర రావు దర్శకత్వంలో 'అల్లూరి సీతారామరాజు' సినిమా మొదలెట్టారు.

krishna-devadasu.jpg

ఆ సినిమాలో అగ్గి దొర పాత్రకు బాలయ్యని (Balayya)అనుకున్నారు, కానీ అయన అతని సొంత సినిమాతో బిజీ గా ఉండటం వలన చెయ్యలేను అన్నారు, తరువాత ఎస్ వి రంగారావు (SVRangaRao) దగ్గరికి వెళ్లారు, అతను కూడా బిజీ, అప్పుడు మళ్ళీ బాలయ్యనే పిలిచి పది రోజులు షూట్ చేశారు. ఒకరోజు తెల్లవారుజామున కృష్ణగారిని నిద్రలేపి దర్శకుడు రామచంద్ర రావు కి బాగోలేదు అని చెప్పారు. వైజాగ్ తీసుకెళ్లారు కారులో, కానీ అతని పరిస్థితి బాగోలేదు. కారులో కృష్ణ ని అతను ఒక కోర్కె కోరారు. ఈ సినిమా నా జీవితాశయం, కానీ తీయకుండానే వెళ్ళిపోతున్నాను, అందుకని ఈ సినిమా వేరేవాళ్లు తీస్తే బాగా రాదు, నువ్వే పూర్తి చేసి, దర్శకుడిగా మాత్రం తన పేరు వెయ్యమని చెప్పారు రామచంద్ర రావు. ఒప్పుకున్నారు కృష్ణ, ఆలా మొదటి సినిమా ఘోస్ట్ దర్శకుడిగా కృష్ణే పూర్తి చేశారు ఆ సినిమాని. పోరాట సన్నివేశాలకి కెఎస్ఆర్ దాస్ (KSRDas) ని పెట్టారు. ఆలా కష్టపడి చింతపల్లి, రంపచోడవరం అడవుల్లో ఆ సినిమాని పూర్తి చేశారు. మొదటి కాపీ వచ్చింది, బయ్యర్స్ కి చూపించారు, కానీ వాళ్ళకి అర్థం కావటం లేదు ఈ సినిమా ఆడుతుందో ఆడదో అని. ఏమీ చెప్పలేకపోతున్నారు.

krishna-cheekativelugulu.jpg

దర్శకుడు, నిర్మాత అయిన చక్రపాణి (Chakrapani) గారు కృష్ణగారి మంచి చెడ్డలు చూసుకునే వ్యక్తి. కృష్ణగారి నాన్నగారికి చక్రపాణికి వున్న సాన్నిహిత్యం వలన, చక్రపాణి ఎప్పుడూ కృష్ణ ఏ పని చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అని చూస్తూ వుండే వ్యక్తి. చెప్పాలంటే కృష్ణ బాగోగులు గురించి అడుగుతూ చూస్తూ ఉండే వ్యక్తి చక్రపాణి. అతను కృష్ణ కి కబురు పెట్టారు. అతను 'అల్లూరి సీతారామరాజు' సినిమా గురించి తెలిసి కాపీ తెప్పించు చూస్తాను అని చెప్పారు చక్రపాణి కృష్ణతో. అతనికి సినిమా చూపించారు. సినిమా చూసిన చక్రపాణి ఏమీ చెప్పకుండా రేపు కలిసినపుడు చెపుతాను అని వెళ్లిపోయారట. మర్నాడు కృష్ణ ఆత్రంగా చక్రపాణి దగ్గరకి వెళ్లారు, సినిమా చూసి ఏమీ చెప్పలేదు అని అడిగారు. దానికి ఆయనిచ్చిన సమాధానం విని కృష్ణ ఆశ్చర్యపోయారు. చక్రపాణి వెంటనే "నీతో ఎంతమంది ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నారు" అని అడిగారట. "ఒక ఏడు ఎనిమిది మంది తీస్తున్నారు, ఇంకో ఏడూ ఎనిమిది మంది వెయిటింగ్ లో వున్నారు" అని అన్నారు కృష్ణ గారు. వెంటనే చక్రపాణి "వాళ్ళందరి పని అయిపోయినట్టే, వాళ్ళందరూ బాగా దెబ్బతింటారయ్యా" అని కూల్ గా చెప్పారట. కృష్ణ షాక్ అయ్యారు వెంటనే, అదేంటి సినిమా బాగోలేదా అన్నారట. "బాగుండటం అంటే ఇలా ఆలా కాదు, బ్రహ్మాండంగా వుంది, ఎంత గొప్పగా ఉందంటే ఇలాంటి గ్రేట్ కేరక్టర్స్ లో నటించిన నిన్ను రానున్న రెండు మూడేళ్ళ వరకు వేరే పాత్రలో ప్రేక్షకులు చూడలేరు, ఈ సినిమా ఇంపాక్ట్ అంతలా ఉంటుంది అని చెప్పారు," చక్రపాణి. సీతారామరాజు గొప్ప చిత్రం అవుతుంది, మంచి విజయం సాధిస్తుంది, కానీ ఆ తరువాత వరసగా నీకు ఫ్లాప్స్ వస్తాయి అని చెప్పారు చక్రపాణి. దానికి నవలా ఏడవాలా అర్ధం కానీ పరిస్థితి కృష్ణది. ప్రశంసగా తీసుకొని ఆనందపడాలో, విమర్శగా తీసుకొని బాధపడాలో తెలియని పరిస్థితి.

krishna-gajulakrishnayya.jpg

1974, మే 1 న 'అల్లూరి సీతారామరాజు' విడుదలయింది. కృష్ణ అనుకున్నట్టుగానే ఆ సినిమా అఖండ విజయం సాధించింది, రికార్డ్స్ ఎన్నో నెలకొల్పింది. కొన్ని సెంటర్స్ లో సంవత్సరం పాటు ఆడిన ఈ సినిమా, మళ్ళీ రెండో సారి విడుదలైనప్పుడు కూడా హైద్రాబాదు లో 100 రోజులు ఆడింది. ఈ సినిమా విడుదలైన తరువాత కృష్ణవి 12 సినిమాలు విడుదలయ్యాయి. అన్నీ గోడకి కొట్టిన బంతిలా తిరిగి వస్తున్నాయి అని కృష్ణగారి చెప్పారు. సీతారామరాజు తరువాత 'మనుషులు మట్టిబొమ్మలు' యావరేజ్, ఆ తరువాత వరసగా 'రాధమ్మ పెళ్లి', 'గౌరి', ఆడంబరాలు అనుబంధాలు', 'దీర్ఘసుమంగళి ', 'ఇంటింటి కథ', 'ధనవంతులు గుణవంతులు', 'సత్యానికి సంకెళ్లు', 'దేవదాసు' విడుదలయ్యాయి. వీటిలో 'రాధమ్మ పెళ్లి', 'దీర్ఘసుమంగళి ' మంచి సినిమాలు అని చెప్పారు కృష్ణ గారు, కానీ ఏ సినిమా కూడా చెప్పుకోదగ్గవిగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడలేదు. అయితే 'దేవదాసు' కూడా పోవటంతో కృష్ణ కొంచెం బాధ పడ్డారు. ఆ సినిమా కృష్ణ ఆడుతుంది అనుకున్నారు, కానీ ఆడలేదు. 74 సంవత్సరంలో ఈ సినిమాలన్నీ ఫ్లాప్ అయితే, 75 వ సంవత్సరంలో కూడా కృష్ణగారి ఫ్లాప్ ల పరంపర కంటిన్యూ అయింది.

krishna-dheergasumangali.jpg

'అభిమానవతి', 'కొత్తకాపురం', 'సౌభాగ్యవతి', 'చీకటివెలుగులు', 'రక్త సంబంధాలు', 'సంతానం సౌభాగ్యం', 'గాజుల క్రిష్నయ్య', 'దేవుడులాంటి మనిషి' సినెమాలనీ 75 లో విడుదలయితే అవన్నీ బిజనెస్ రేంజ్ సక్సెస్ గానే మిగిలాయి. ముఖ్యంగా 'చీకటి వెలుగులు' #CheekatiVelugulu సినిమాని అప్పట్లో నిర్మాత రంజిత్ కుమార్ (RanjithKumar) చాలా ఖర్చు పెట్టి ప్రెస్టీజియస్ గా తీస్తే, దర్శకుడు కె ఎస్ ప్రకాశరావు కూడా అంతే శ్రద్ధగా బాగా తీశారు. అది కూడా అల్లూరి సీతారామరాజు హ్యాంగ్ ఓవర్ లో పడిపోయి అందకపోవటం కృష్ణకి ఆశ్చర్యం వేసింది. చక్రపాణి గారు చెప్పిన జోస్యం నిజమైంది. ఇవన్నీ 75 సంవత్సరం సాగ భాగంలోనే విడుదలై, వరసగా ఇన్ని సినిమాల ఫ్లాపులతో కృష్ణ పని అయిపొయింది అన్నారు పరిశ్రమలో. ఒక్క నిర్మాత కూడా ముందుకు రాలేదు. కృష్ణకి పని లేకుండా పోయింది. అప్పటి వరకు రోజుకి మూడు షిఫ్ట్ లు చేసిన కృష్ణతో ఒక్క సినిమా కూడా చెయ్యడానికి ఒక్క నిర్మాత కూడా ముందుకు రాలేదంటే ఆశ్చర్యం కదా ! స్వయంగా కృష్ణగారీ చెప్పుకున్నారు, "75 జులై నాటికి ఒప్పుకున్న సినిమాలన్నీ అయిపోవటం తో జాబ్ లెస్ గా తయారయింది నా పరిస్థితి అని. 1966లో విడుదలైన 'గూఢచారి 116' నుండి 75 వరకు పదేళ్ల పాటు విసుగూ, విరామం లేకుండా రోజుకి మూడు షిఫ్ట్ లు చేసిన నాకు సినిమా లేకుండా అయిపొయింది. అడిగిన వాళ్లందరికీ కాదనకుండా సినిమా చేసిన నన్ను అడిగిన వారే కరువయ్యారు," అని కృష్ణగారు చెప్పుకున్నారు. సంవత్సరానికి 15 సినిమాలు ఇచ్చిన హీరో హఠాత్తుగా 'అన్ ఎంప్లాయెడ్' అయితే పరిశ్రమలో పరిహాసాలు, జనం ఊహాగానాలు ఎలా వుంటాయో మొదటి సారి కృష్ణకి అనుభవంలోకి వచ్చింది.

krishna-gauri.jpg

ఈ సమయంలో కృష్ణ ని మళ్ళీ నిలబెట్టింది కృష్ణ నే. అదెలా అంటే అప్పుడు కృష్ణ తన సొంత బ్యానర్ లో సినిమా తీసి మళ్ళీ తానేంటో నిరూపించుకోవాలని అనుకున్నారు. అంతే అప్పటికప్పుడు దర్శకుడు పి సి రెడ్డి గారు చెప్పిన కథ నచ్చటం తో దాని మీద వర్క్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు. మొదట ఆత్రేయ గారిని పిలిచి వర్క్ చెయ్యమంటే, అతనికి నచ్చక వెళ్లిపోయారు. అప్పుడు మహారథి కూర్చొని దాని మీద వర్క్ చేశారు. అదే 'పాడి పంటలు' ఆ సినిమాతో కృష్ణ పూర్వ వైభవం మళ్ళీ వచ్చింది. ఆ సినిమా ఎలా మొదలైంది, దానికి వచ్చిన అడ్డంకులు ఇవన్నీ ఇంకో సారి మాట్లాడుకుందాం.

Updated Date - 2023-08-02T16:47:24+05:30 IST