Sowkar Janaki: ఈ క్రొత్త ముఖాలొచ్చి మా ప్రాణాలు తీస్తున్నారు... ఆలా అనిపించుకున్న నటే...

ABN , First Publish Date - 2023-08-08T17:13:38+05:30 IST

శివాజీ వేషం బాగా వేశారు కాబట్టి శివాజీ గణేశన్ అని, జెమిని సంస్థలో పనిచేశారు కాబట్టి జెమిని గణేశన్ అని, అలాగే తన మొదటి సినిమా 'షావుకారు' సినిమాలో అత్యుత్తమ నటన కనపరిచినందుకు జానకిని షావుకారు జానకిగానే పిలుస్తూ వుంటారు. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఆమె మొదటి సినిమా షూటింగ్ లో ఏమైంది అంటే..

Sowkar Janaki: ఈ క్రొత్త ముఖాలొచ్చి మా ప్రాణాలు తీస్తున్నారు... ఆలా అనిపించుకున్న నటే...
Shavukaru Janaki

షావుకారు జానకి (SowkarJanaki) కొన్ని దశాబ్దాల పాటు తెలుగు, తమిళ కన్నడ భాషల్లో తన అపురూపమైన నటనతో ప్రేక్షకులని అలరించిన గొప్ప నటి. చాలామంది నటీమణులకు అవకాశాలు రావటమే కద్దు, అలాటిది అప్పట్లో ప్రముఖ దర్శకుడు బిఎన్ రెడ్డి (BNReddi) వచ్చి తన సినిమాలో కథానాయికగా ఛాన్స్ ఇస్తాను అంటే తిరస్కరించిన నటి జానకి. చాలామంది నటీమణులు పెళ్ళికాకముందు సినిమాపరిశ్రమలో ప్రవేశించి తరువాత పెళ్లిచేసుకొని, మళ్ళీ వస్తారు. కానీ జానకి తనకి పెళ్లయి, ఇద్దరు పిల్లలు పుట్టాక సినిమారంగంలోకి వచ్చారు.

shavukaru-poster.jpg

ఈమధ్యనే విడుదలైన నందిని రెడ్డి (BVNandiniReddy) దర్శకత్వంలో 'అన్నీ మంచి శకునములే' #AnniManchiSakunamule అనే సినిమాలో కూడా నటించి, 91 ఏళ్ళు వచ్చినా తాను ఇంకా బ్రహ్మాండంగా నటించగలను అని అనిపించుకున్న నటి జానకి. ఈమె మొదటి సినిమా 'షావుకారు' (Shavukaru), ఎల్వీ ప్రసాద్ (LVPrasad) దర్శకుడు, విజయావారి (VijayaProductions) సినిమా ఇది, నాగిరెడ్డి చక్రపాణి (NagiReddy Chakrapani) లు నిర్మాతలు. మొదటి సినిమాతో మంచి ఛాన్స్ కొట్టేసిన నటి జానకి. కథానాయకుడు ఎవరని అడగరేంటి, ఇంకెవరు అగ్ర నటుడు ఎన్ టి రామారావు (NTRamaRao) గారు. ఈ సినిమాలో జానకి చూపించిన నటనా ప్రతిభకి గాను ఆమెని అప్పటి నుండి ఇప్పటివరకు షావుకారు జానకి (ShavukaruJanaki) గానే పిలుస్తూ వుంటారు, రాస్తూ వుంటారు. అంటే మొదటి సినిమాతోటే తన ప్రతిభ, పాటవాలను చూపించిన నటి. అయితే జానకికి రంగస్థలం, రేడియో లలో మంచి అనుభవం వుంది.

ఈ 'షావుకారు' #Shavukaru సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఒక తమాషా అయిన సంఘటన జరిగింది. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో జానకి ఏడ్వ వలసి వచ్చిందట. ఎంత ప్రయత్నం చేసిన జానకికి ఏడుపు రాలేదుట. టైము అయిపోతోంది కానీ జానకికి ఏడుపు మాత్రం రావటం లేదుట. అప్పుడు దర్శకుడు ఎల్వీ ప్రసాద్ ఇక ఏమీ తోచక, "ఈ క్రొత్త ముఖాలు వచ్చి మా ప్రాణాలు తీస్తున్నారు" అని అన్నారట. ఆ మాటలు జానకి కి ములుకుల్లా తగిలి వెంటనే దుఃఖం ఆపుకోలేక బొట బొటా కన్నీళ్లు కారుస్తూ ఏడవటం మొదలెట్టిందిట. దర్శకుడు ప్రసాద్ ఆ ఏడుస్తున్నప్పుడే ఆ ఏడ్పు మొహంతో వున్న జానకితో తనకి కావలసిన ఏడుపు సన్నివేశాన్ని చక్కగా చిత్రీకరించుకున్నారట.

shavukarujanaki1.jpg

అయితే షూటింగ్ అయిపోయినా కూడా జానకి ఇంకా ఏడుస్తూనే ఉందిట. ఏడుపు మానలేదుట. దర్శకుడు ఎల్వీ ప్రసాద్ ఆమె దగ్గరికి వెళ్లి, "మీ మనసును కష్టపెట్టి మీకు ఏడుపు తెప్పించడానికి ఆలా అన్నాను కానీ, మీరు నిజమే అనుకున్నారా ఏంటి," అని నవ్వుతూ చెప్పారట ఆమెతో. వెంటనే ఆమె ఏడుపు ఆపేసింది. అంటే అప్పట్లో దర్శకులు, నటీనటులు ఒక సన్నివేశం కోసం ఎంత కష్టపడాల్సి వచ్చేదో చూడండి. ఈ సినిమా కోసం ఇందులో నటీనటులు అందరికీ చాలాకాలం పాటు రిహార్సల్స్ ఇచ్చారు. అందుకనే అప్పట్లో సినిమాలు అంత చక్కగా, సహజంగా ఉంటాయి. ఇది జానకి నటించిన మొదటి తెలుగు సినిమా 'షావుకారు', ఆ సినిమా విడుదలైన దగ్గర నుండి ఆమె పేరు షావుకారు జానకి గానే స్థిరపడింది. ఆ తరువాత ఆమె ఎన్నో వందల తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించి, ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. చిత్రపరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటి జానకి, అప్పట్లో అగ్ర నటిగా ఒక వెలుగు వెలుగుతున్న కృష్ణకుమారి (KrishnaKumar) ఇద్దరూ సొంత అక్కాచెల్లెళ్లు. అంటే అక్క చెల్లెల్లు ఇద్దరూ చిత్ర పరిశ్రమలో కొన్నేళ్లపాటు అగ్ర నటీమణులుగా చలామణి అయ్యారు.

Updated Date - 2023-08-08T17:13:38+05:30 IST