2023 Tollywood Rewind: ఈ సంవత్సరంలో సత్తా చాటిన తెలుగు అమ్మాయిలు!

ABN , Publish Date - Dec 21 , 2023 | 05:33 PM

ఈ సంవత్సరం తెలుగు అమ్మాయిలు మేము పరభాషా నటీమణులతో దేనికీ తీసిపోము అని తమ సత్తా చాటిచెప్పారు. శ్రీలీల, వైష్ణవి చైతన్య, కావ్య కళ్యాణ్ రామ్ లాంటి తెలుగు అమ్మాయిలు కథానాయికలుగా ఎంతో రాణించారు.

2023 Tollywood Rewind: ఈ సంవత్సరంలో సత్తా చాటిన తెలుగు అమ్మాయిలు!
Telugu actresses are on top this year

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక్క కథానాయకుడు, ఇంకా ఒకటి రెండు పాత్రల్లో తప్పితే, మిగతా చాలా పాత్రలకు పర భాషా నటుల్ని తెలుగు దర్శకులు, నిర్మాతలు దిగుమతి చేసుకోవటం పరిపాటి అయింది. అలాగే కథానాయికలను కూడా తెలుగు అమ్మాయిలను కాకుండా ఎక్కువగా పరభాషా నటీమణులమీదే తెలుగు పరిశ్రమ ఎక్కువ ఆధారపడుతోంది. అయితే ఇక్కడ తెలుగు అమ్మాయిలు దొరకటంలేదు అని వూరికే ఒక సాకులా చెపుతూ వుంటారు తప్పితే, ఈ పాన్ ఇండియా మోజులో ఎక్కువగా హిందీ, లేదా ఇతర భాష నటీమణుల వేపే దర్శకుల దృష్టి ఎక్కువగా వుంది.

ఇప్పుడు 2023 సంవత్సరం పూర్తి కావస్తోంది, ఈ సంవత్సరం మొత్తం చూస్తే కొంతమంది తెలుగు నటీమణులు తమ సత్తా చాటారు అని చెప్పాలి. అవకాశం ఇస్తే మేము కూడా హిందీ నటీమణులకు ఏమీ తీసిపోము అన్నట్టుగా మన తెలుగు అమ్మాయిలు తమకిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు అని పిస్తోంది. ఇక అల్లు అర్జున్ లాంటి అగ్ర నటుడు సైతం ప్రతి అవార్డు ఫంక్షన్స్ లో తెలుగు సినిమాలకి కూడా ఎక్కువగా పరభాషా అమ్మాయిలే అవార్డులు తీసుకోవడానికి వస్తున్నారు, కానీ తెలుగు అమ్మాయిలు అవార్డులు తీసుకుంటే చూసి ఆనందపడాలని వుంది అని ఒక సినిమా ప్రచార సభలో చెప్పడం ఆసక్తికరం.

తెలుగు చిత్ర పరిశ్రమలో మొదట్లో ఎక్కువగా తెలుగు అమ్మాయిలే ఉండేవారు. 90వ దశకం వరకు జయప్రద, జయసుధ, జయచిత్ర, శ్రీదేవి, తరువాత విజయశాంతి, మాధవి, రోజా, రంభ, గౌతమి, రజని ఇలా ఎంతోమంది ఎన్నో సినిమాలు చేసి తమ ప్రతిభని చాటుకున్నారు. కానీ తరువాత కాలంలో తెలుగు దర్శకులు, నిర్మాతలు ఎక్కువగా హిందీ అమ్మాయిలు, ఇతర భాష నటీమణులను తీసుకోవటం మొదలుపెట్టి ఇక అదే ఇంతవరకు చేసుకు వస్తున్నారు. తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఇస్తే వారు కూడా తమ ప్రతిభని చాటిచెప్తారు అని ఈ సంవత్సరం కొన్ని సినిమాలు నిరూపించాయి.

sreeleelasaree.jpg

శ్రీలీల (భగవంత్ కేసరి)

పెళ్లి సందడి సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టిన పదహారణాల పక్కా తెలుగు అమ్మాయి శ్రీలీల. ఆమె ఇప్పుడు తెలుగులో ఒక సంచలనం అనే చెప్పాలి. ఎందుకంటే అగ్ర నటుల పక్కన ఆమె నటించడమే కాకుండా, చాలా సినిమాలు చేతిలో వున్నాయి. ముఖ్యంగా వచ్చే సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటించిన 'గుంటూరు కారం' సినిమా విడుదలకుంది. ఈ సంవత్సరం ఆమెకి మిశ్రమ ఫలితాలు వచ్చినా, తెలుగు అమ్మాయి అగ్రనటీమణుల జాబితాలో వుంది అనే విషయం ఆసక్తికరం. ఆమె సినిమా 'స్కంద' ఈ సంవత్సరం విడుదలైంది. రామ్ పోతినేని కథానాయకుడు, బోయపాటి శ్రీను దర్శకుడు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా అంతగా ప్రభావం చూపలేదు. తరువాత వచ్చిన 'భగవంత్ కేసరి' సినిమాలో ఆమె నందమూరి బాలకృష్ణకి కుమార్తెగా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించటమే కాకుండా, శ్రీలీల నటనలో కూడా రాణించగలదు అని నిరూపించింది. తరువాత వచ్చిన రెండు సినిమాలు 'ఆదికేశవ', 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్' బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అయినా శ్రీలీల చేతిలో సినిమాలు దండిగా వున్నాయి, వచ్చే సంవత్సరం విడుదలవుతున్నాయి. ఆ సినిమాల విజయంతో శ్రీలీల అగ్రగణ్యంలో కొనసాగుతుంది అని పరిశ్రమలో టాక్. తెలుగు అమ్మాయిలతోటే కాకుండా, పరభాష నుండి వచ్చిన నటీమణులతో పిలిచి చూసినా సినిమా ఫలితాన్ని బట్టి కాకుండా శ్రీలీల అగ్రస్థానంలో నిలిచే అవకాశం వుంది.

vaishnavichaitanyahot.jpg

వైష్ణవి చైతన్య (బేబీ)

'బేబీ' అనే ఒక చిన్న సినిమా ఈ సంవత్సరం సంచలనం సృష్టించింది అని చెప్పొచ్చు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటించిన ఈ సినిమాకి సాయి రాజేష్ దర్శకుడు, ఎస్కెఎన్ నిర్మాత. వైష్ణవి చైతన్య ఇంతకు ముందు చిన్న చిన్న పాత్రల్లో కనిపించినా ఈ 'బేబీ' సినిమాలో కథానాయికగా నటించింది. ఈ సినిమాలో ఆమె అసమాన ప్రతిభ కనపరిచి, తెలుగు అమ్మాయిలు దేనికీ తీసిపోరు అనేంతగా ఇటు నటనలోనూ, అటు గ్లామర్ లోనూ నిరూపించింది. ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు, అలాగే వైష్ణవి నటనని అందరూ ప్రశంసించారు. విమర్శకుల మెప్పు సైతం పొందిన నటి వైష్ణవి. ఈ సినిమా విజయంతో వైష్ణవి మరిన్ని సినిమాలు చేసి తన నటనతో అందరినీ మెప్పిస్తుందని ఆశిద్దాం.

kavyakalyanramtelugu.jpg

కావ్య కళ్యాణ్ రామ్ (బలగం)

మంచి పేరు సంపాదించినా ఇంకొక తెలుగు అమ్మాయి కావ్య కళ్యాణ్ రామ్. బాలనటిగా తెలుగు ప్రేక్షకులకి అందరికీ కావ్య తెలుసు. అల్లు అర్జున్ నటించిన 'గంగోత్రి' సినిమాతో తెలుగు తెరకి బాలనటిగా పరిచయం అయిన కావ్య, చాలా తెలుగు సినిమాలలో చేసింది, అందులో కొన్ని ముఖ్యమైనవి 'స్నేహమంటే ఇదేరా', 'ఠాగూర్', 'బాలు', 'బన్నీ' లాంటి సినిమాలలో బాలనటిగా చేసింది. ‘వ‌ల్లంకి పిట్టా వల్లంకి పిట్టా మెల్లంగ ర‌మ్మంటా’ అని 'గంగోత్రి' లో వచ్చే పాటలో ఆమె నటనతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.

ఆ తరువాత కథానాయికగా 2022లో సాయి కిరణ్ దర్శకత్వం వహించిన హర్రర్ చిత్రం 'మసూద'తో అరంగేట్రం చేసింది. ఆ సినిమా మంచి విజయం సాధించటమే కాకుండా కావ్యకి ప్రసంశలు కూడా తీసుకువచ్చింది. అయితే ఈ సంవత్సరం ఇంకో సంచలనం సృష్టించిన చిన్న సినిమా 'బలగం' లో కావ్య కథానాయిక పాత్ర పోషించింది. దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై దిల్ రాజు కుమార్తె హన్షిత, అన్న కుమారుడు హర్షిత్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి కథానాయకుడు అయితే కావ్య కళ్యాణ్‌ రామ్‌ కథానాయకురాలు. ఈ సినిమా ఈ సంవత్సరం మార్చి 3న విడుదలై, ఒక సంచలనం సృష్టించింది అని చెప్పాలి. ఈ సినిమా నేపధ్యం తెలంగాణాలో ఒక పల్లెటూరులో జరిగిన కథని ఎంతో సహజంగా, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలని చూపిస్తూ చక్కగా తీసిన చిత్రం ఇది. ఈ సినిమాలో కావ్య చూపించిన ప్రతిభకి ఆమె ఒక మంచి నటి, తనకి ఎటువంటి పాత్ర ఇచ్చినా తాను ఆ పాత్రకి న్యాయం చెయ్యగలదు అని ఈ సినిమాతో చెప్పింది. తెలంగాణలోని కొత్తగూడెంలో జన్మించిన కావ్య న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలు. ఆ తరువాత ఇదే సంవత్సరం విడుదలైన 'ఉస్తాద్' అనే సినిమాలో కథానాయికగా చేసింది, ఆ సినిమా వ్యాపారపరంగా నడవకపోయినా కావ్యకి మంచి మార్కులు వచ్చాయి. ఆమె నటనతో విమర్శకుల ప్రసంశలు పొందింది.

shivatmikashivani.jpg

ఈ ముగ్గురూ ఈ సంవత్సరం గొప్ప సంచలన విజయాలతో ముందంజలో వుంటే, మళ్ళీ తెలుగు అమ్మాయిల హవా, సత్తా తెలుగు పరిశ్రమలో చాటి చెప్తాము అనేట్టు తమ ప్రతిభా పాటవాలని చూపించారు. వీళ్ళతో పాటు ఇంకా చాలామంది తెలుగు అమ్మాయిలు ఈ సవంత్సరం తెలుగు సినిమాలలో కనిపించారు. జీవిత రాజశేఖర్ కుమార్తెలు శివాత్మిక రాజశేఖర్ (రంగ మార్తాండ), శివాని రాజశేఖర్ (కోటబొమ్మాళి పీఎస్) అనే సినిమాలతో ఈ సంవత్సరం వచ్చారు. ఈ ఇద్దరూ తమిళ సినిమాలు కూడా చేస్తున్నారు, అలాగే తెలుగు సినిమాలు కూడా చేతిలో వున్నాయి. రానున్న కాలంలో ఈ ఇద్దరూ తమ ప్రతిభా పాటవాలని చూపిస్తారని ఆశిద్దాం.

kamakshi-bhaskarla6.jpg

అలాగే ఇంకో తెలుగు నటి కామాక్షి భాస్కర్ల, 'మా ఊరి పొలిమేర 2' లో నటించి తన నటనకు మంచి ప్రసంశలు పొందారు. ఈమె వృత్తి రీత్యా డాక్టరు, నటన మీద ఆసక్తితో తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. ఈమె 'ధూత' వెబ్ సిరీస్ లో కూడా చేశారు, నటనకి ప్రాధాన్యమున్న పాత్రల్లో తాను మంచి ప్రతిభ కనపరచగలను అని నిరూపించుకున్నారు డాక్టర్ కామాక్షి.

pranavimanukondatelugu.jpg

ఇక బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు కథానాయకుడిగా వచ్చిన చిత్రం 'స్లమ్ డాగ్ హస్బెండ్' ఇందులో తెలుగు అమ్మాయి ప్రణవి మానుకొండ కథానాయికగా నటించింది. ఏఆర్ శ్రీధర్ ఈ సినిమాకి దర్శకుడు, అప్పిరెడ్డి నిర్మాత. ఇదే నిర్మాతలు ఇంకో సినిమా బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ కథానాయకుడిగా 'మిష్టర్ ప్రెగ్నంట్' సినిమా తీశారు. ఇందులో కూడా ఒక తెలుగు అమ్మాయి రూప కొడువాయుర్ కథానాయికగా నటించింది. ఆమె కూడా వృత్తి రీత్యా డాక్టర్. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోండి, అలాగే ఇందులో నడిచిన రూప కూడా తన అభినయంతో మెప్పించింది.

anasuya-new2.jpg

ఇక అనసూయ తెలుగు ప్రేక్షకులు అందరికీ పరిచయస్తురాలు. ఆమె టీవిలో ఎన్నో షోలకు వ్యాఖ్యాతగా పని చేస్తూ, చాలా ఈవెంట్స్ కి హోస్ట్ గా పనిచేస్తూ, సినిమాలలో కూడా బిజీ అయిపోయిన ఒక తెలుగు అమ్మాయి. 'క్షణం' సినిమాతో ప్రధానమైన పాత్రల్లో కనపడుతూ తెలుగు సినిమాలే కాకుండా, తమిళం మలయాళం సినిమాలు చేస్తూ బిజీ అయిపోయిన తెలుగు నటి అనసూయ. ఈ సంవత్సరం ఆమెవి ఐదు సినిమాలు విడుదలయ్యాయి. 'మైకేల్', 'రంగమార్తాండ', 'విమానం', 'పెద్ద కాపు 1', 'ప్రేమ విమానం' ఇలా అన్ని సినిమాలలో ఒకదానికొకటి సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ, తెలుగు నటీమణులు దేనికైనా తీసిపోరు అనేంతగా తన ప్రతిభా పాటవాలని చూపిస్తోంది అనసూయ. క్యారెక్టర్ నటీమణుల్లో ఇప్పుడు తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్, అనసూయ మధ్య ఎక్కువ పోటీ ఉందని ఒక వార్త కూడా నడుస్తోంది. తెలుగు నటిగా ఇది చాలా శుభ పరిణామం అనే చెప్పొచ్చు.

Updated Date - Dec 21 , 2023 | 05:58 PM