A SuryaNarayana: ‘అడవిరాముడు’ నిర్మాత కన్నుమూత

ABN , First Publish Date - 2023-01-20T19:54:31+05:30 IST

సీనియర్ ఎన్టీఆర్, జయప్రద, జయసుధ కాంబినేషన్‌లో ‘అడవి రాముడు’ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ఏ. సూర్యనారాయణ.. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ..

A SuryaNarayana: ‘అడవిరాముడు’ నిర్మాత కన్నుమూత
Producer Arumilli Suryanarayana

సీనియర్ ఎన్టీఆర్, జయప్రద, జయసుధ కాంబినేషన్‌లో ‘అడవి రాముడు’ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ఏ. సూర్యనారాయణ.. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శుక్రవారం (20-01-2023) మృతిచెందారు. శ్రీ సత్యచిత్ర బ్యానర్‌పై నెక్కంటి వీర వెంకట సత్యాన్నారాయణ (Nekkanti Veera Venkata Satyanarayana)తో కలిసి ఆరుమిల్లి సూర్యనారాయణ (Arumilli Suryanarayana) ఎన్నో మరపురాని చిత్రాలను నిర్మించారు. ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణ వంటి హీరోలతో వీరిద్దరూ ఎన్నో చిత్రాలు నిర్మించారు. ఎన్టీఆర్‌తో తీసిన ‘అడవి రాముడు’ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలవడమే కాకుండా.. ఈ సంస్థకు చాలా మంచి పేరు తీసుకువచ్చింది. వీరు నిర్మించిన ‘కుమార రాజా’ చిత్రంలో హీరో కృష్ణ త్రిపాత్రాభినయం చేశారు. అలాగే వీరు నిర్మించిన ‘కొత్త అల్లుడు’ సినిమాలో చిరంజీవి విలన్‌గా నటించారు. సత్యనారాయణ కన్ను మూసిన తర్వాత కూడా సూర్యనారాయణ చిత్ర నిర్మాణం కొనసాగించారు. భరద్వాజ దర్శకత్వంలో ఆయన ఒక సినిమా తీశారు.

శ్రీ సత్యచిత్ర బ్యానర్‌పై తహసిల్దార్ గారి అమ్మాయి (1971), ప్రేమ బంధం (1976), అడవిరాముడు (1977), కుమార రాజా (1978), కొత్త అల్లుడు (1979), కొత్తపేట రౌడీ (1980), ఏది ధర్మం ఏది న్యాయం (1982), ఉద్ధండుడు (1984), భలే తమ్ముడు (1985), అత్తా నీ కొడుకు జాగ్రత్త (1997) తదితర చిత్రాలను వారు నిర్మించారు. సూర్యనారాయణ మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, నివాళులు అర్పిస్తున్నారు.

Updated Date - 2023-01-20T19:54:32+05:30 IST