RRR : చిత్రంపై ప్రశంసలు కురిపించిన హాలీవుడ్ నటి.. విమర్శలు చేసిన నెటిజన్స్

ABN , First Publish Date - 2023-01-22T15:13:45+05:30 IST

టాలీవుడ్ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

RRR : చిత్రంపై ప్రశంసలు కురిపించిన హాలీవుడ్ నటి.. విమర్శలు చేసిన నెటిజన్స్
RRR

టాలీవుడ్ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతేడాది విడుదలైన ఈ పిరియాడిక్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. అంతేకాకుండా ఎన్నో ప్రఖ్యాత అంతర్జాతీయ అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

తాజాగా హాలీవుడ్‌ నటి జేన్‌ ఫోండా (Jane Fonda) ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని ప్రశంసించింది. ‘నేను ఇంతకుముందు లెస్లీ సినిమా చూడమని సూచించాను కదా! కానీ దానికి పూర్తి విరుద్ధంగా ఉన్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తాజాగా నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. బెస్ట్‌ ఫారిన్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ఈ సినిమా ఆస్కార్‌కు షార్ట్‌ లిస్ట్‌ అయింది. సామ్రాజ్యవాదం గురించి సీరియస్‌గా చర్చించిన బాలీవుడ్‌ సినిమా ఇది. ఈ చిత్రాన్ని చూస్తూ ట్రాన్స్‌లోకి వెళ్లిపోయాను’ అని జేన్ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.

నెటిజన్లు స్పందిస్తూ.. ‘అవును. అదో గొప్ప చిత్రం. కానీ.. అది బాలీవుడ్ చిత్రం కాదు’.. ‘హలో అమాయక జెన్ ఫోండా. అది బాలీవుడ్ చిత్రం కాదు. టాలీవుడ్ చిత్రం. గాడ్ బ్లెస్ యూ చిన్నారి’.. ‘భారతదేశంలో బాలీవుడ్ మాత్రమే కాకుండా ఇతర ప్రాంతీయ భాష పరిశ్రమలు చాలా ఉన్నాయి. కాబట్టి భారతీయ సినిమా అనగానే బాలీవుడ్ మాత్రమేనని అనుకోకండి’ అని వరుసగా కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2023-01-22T15:13:47+05:30 IST