Romeo and Juliet: ఆ సినిమాలో న్యూడ్ సీన్స్.. 55 ఏళ్ల తర్వాత దావా వేసిన నటులు
ABN , First Publish Date - 2023-01-04T15:27:46+05:30 IST
‘రోమియో మరియు జూలియట్’ (Romeo and Juliet).. 1968లో విడుదలైన ఈ చిత్రం ఓ ఐకానిక్ చిత్రం నిలిచిపోయింది.

‘రోమియో మరియు జూలియట్’ (Romeo and Juliet).. 1968లో విడుదలైన ఈ చిత్రం ఓ ఐకానిక్ చిత్రం నిలిచిపోయింది. పారామౌంట్ స్టూడియోస్ (Paramount Studios) నిర్మించిన ఈ మూవీలో ఒలివియా హస్సీ (Olivia Hussey), లియోనార్డ్ వైటింగ్ (Leonard Whiting) ముఖ్యపాత్రలు పోషించారు. అప్పట్లో ఆ చిత్రం నాలుగు ఆస్కార్ అవార్డులను సైతం గెలుచుకుంది. అయితే ఆ చిత్రంలో తమని అసభ్యంగా చూపించారంటూ పారమౌంట్ స్టూడియోస్‌పై నటీనటులు హాస్సీ, వైటింగ్ తాజాగా దావా వేశారు.
ఆ చిత్రం విడుదల సమయానికి వైటింగ్ వయస్సు 16 ఏళ్లు కాగా.. హాస్సీ వయస్సు 15 ఏళ్లు మాత్రమే. దీంతో తమను లైంగికంగా దోపిడీ చేశారని, టినేజీ పిల్లల నగ్న చిత్రాలను అమ్మారని వారు ఆరోపించారు. దివంగత ఫ్రాంకో జెఫిరెల్లి దర్శకత్వం వహించిన ‘రోమియో అండ్ జూలియట్’లో ఓ బెడ్‌రూమ్ సీన్‌పై అప్పట్లోనే వివాదం చెలరేగింది. అందులో అప్పటికీ మైనర్లు అయిన వైటింగ్, హాస్సీ ప్రైవేట్ పార్ట్స్‌ని చూపించారు.
ప్రముఖ పత్రిక వెరైటీ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం అంటే సినిమా విడుదలైన 55 సంవత్సరాల తర్వాత ఆ మూవీ స్టార్స్ శాంటా మోనికా సుపీరియర్ కోర్టులో స్టూడియోపై దావా వేశారు. ఇద్దరు నటీనటులకు బిజినెస్ మేనేజర్‌గా ఉన్న టోనీ మారినోజీ ఈ విషయం గురించి మాట్లాడాడు. ‘స్టూడియో వారు చెప్పింది ఒకటి.. చేసింది ఒకటి. వారు ఫ్రాంకోను విశ్వసించారు. అందుకే 16 సంవత్సరాల వయస్సులో అతను చెప్పినట్లు చేశారు. అలాగే ఆ వయస్సులో వారు ఏం చేయగలరు. వారికి మరో ఆప్షన్ లేదు’ అని చెప్పుకొచ్చాడు.
అలాగే.. సినిమాలో నగ్నత్వం ఉండదని నటీనటులకు చెప్పినట్లు నివేదిక పేర్కొంది. అయితే.. సినిమా హిట్ కావాలంటే ఆ సీన్ చేయాల్సిందేనని దర్శకుడు ఒత్తిడి చేసినట్లు అందులో రాసుకొచ్చింది. అలాగే నటుల నగ్న బాడీలను చిత్రీకరించమని చెప్పి.. చివరికీ దానికి విరుద్ధంగా చేశారని తెలిపింది. కాగా.. కాలిఫోర్నియా చట్టం ప్రకారం పిల్లల లైంగిక వేధింపుల కేసు ఎన్ని సంవత్సరాల తర్వాతైన చెల్లుబాటు అవుతుంది.